Elon Musk: ఎలాన్‌ మస్క్‌ సొంత సోషల్‌ మీడియా ప్రారంభించనున్నారా?

Elon Musk: తాజాగా ఎలాన్‌ మస్క్‌ ఇచ్చిన ఓ సమాధానంతో ఆయన సొంత సోషల్‌ మీడియా ప్రారంభించనున్నారనే చర్చ జరుగుతోంది...

Updated : 12 Aug 2022 11:10 IST

వాషింగ్టన్‌: ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే టెక్‌ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ తరచూ తన పోస్టులతో యూజర్లను గందరగోళానికి గురిచేస్తుంటారు. ఆయన పెట్టిన సందేశాల వెనుక అర్థమేంటో తెలుసుకోవడానికి ఒక్కోసారి బుర్ర గోక్కోవాల్సి వస్తుంటుంది! తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌ అలాంటి పరిస్థితికే దారి తీసింది.

ట్విటర్‌ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. అయితే, ‘‘ఒకవేళ ట్విటర్‌ డీల్‌పై ముందుకెళ్లకపోతే.. మరో కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తారా?’’ అని ఓ యూజర్‌ ట్విటర్‌లో మస్క్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన ‘ఎక్స్‌.కామ్‌ (X.com)’ అంటూ ఒకే పదంతో సమాధానం ఇచ్చారు. ఇంతకు మించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో మస్క్‌ ఈ పేరుతో కొత్త సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించనున్నారా? అనే చర్చకు తెరలేచింది.

ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం ఖరారు చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు కూడా మస్క్‌ ఇలాంటి సమాధానమే ఇచ్చారు. ‘‘కొత్త సోషల్‌ మీడియా వేదికను ఏమైనా ఏర్పాటు చేస్తారా?’’ అని మార్చి ఆరంభంలో ఓ యూజర్‌ ప్రశ్నించారు. మస్క్‌ సమాధానమిస్తూ.. ‘‘దీనిపై తీవ్రంగా ఆలోచిస్తున్నాను’’ అని బదులిచ్చారు. దీంతో ఆయన కొత్త సోషల్‌ మీడియాను ప్రారంభించనున్నారని అప్పట్లో తెగ చర్చ జరిగింది. కానీ, కొన్ని రోజులకే ట్విటర్‌ కొనుగోలు ప్రతిపాదనను ముందు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

డొమైన్‌ ఎక్స్‌.కామ్‌ అనేది మస్క్‌కి కొత్తేమీ కాదు. ఇది గతంలో ఆయన నిర్వహించి తర్వాత పేపాల్‌లో విలీనం చేసిన ఓ ఆర్థిక సేవల సంస్థకు చెందినది. ఈ ‘డొమైన్‌ నేమ్‌’ను తిరిగి 2017లో పేపాల్‌ నుంచి సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ డొమైన్‌ యాక్టివ్‌లోనే ఉంది. కానీ, అందులో ఎలాంటి సమాచారం లేదు. దీనిపై క్లిక్‌ చేస్తే తెల్లటి బ్యాక్‌గ్రౌండ్‌ పైభాగంలో కుడిపక్కన ఎక్స్‌ అనే అక్షరం ఒక్కటే కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని