Twitter- Elon Musk: ట్విటర్‌ను అందుకే కొనుగోలు చేశా: ఎలాన్‌ మస్క్‌

ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ దాని వెనకున్న కారణమేంటో తెలిపారు. డబ్బు కోసం తాను ట్విటర్‌ను కొనలేదని చెప్పుకొచ్చారు.

Published : 28 Oct 2022 13:31 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ను తాను డబ్బు కోసం కొనుగోలు చేయడం లేదని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అన్నారు. తాను ప్రేమించే మానవాళి మంచి కోసమే సామాజిక మాధ్యమాన్ని సొంతం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన చర్చకు అందరికీ ఓ ఉమ్మడి వేదికను తీసుకురావడమే తన ఉద్దేశమని వివరించారు. ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియను మస్క్‌ పూర్తిచేశారన్న వార్త బయటకు రావడానికి ముందే ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటనదారులను ఉద్దేశిస్తూ ఓ సందేశాన్ని ట్విటర్‌లో ఉంచారు.

‘‘ట్విటర్‌ను కొనాలనే నిర్ణయం వెనకున్న నా ఉద్దేశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా. ట్విటర్‌ను నేను ఎందుకు కొంటున్నాను.. ప్రకటనలపై నా ఉద్దేశానికి సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజం లేదు. రాబోయే తరానికి ఓ ఉమ్మడి డిజిటల్‌ వేదిక ఉండడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన వాతావరణంలో అనేక అంశాలపై చర్చించుకునేలా అది ఉండాలి. హింసకు తావుండొద్దు. ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాలు రెండు భిన్న ధ్రువాలుగా విడిపోయి విద్వేషం, విభజనను ప్రోత్సహించేలా మారే ప్రమాదం ఉంది. దీంతో చర్చకు అవకాశం లేకుండా పోతోంది. అందుకోసమే నేను ట్విటర్‌ను కొనుగోలు చేశాను. డబ్బు కోసం కాదు. నేను ప్రేమించే ఈ మావనవాళికి సాయం చేయడం కోసమే కొన్నాను. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా ఏదైనా చెప్పడానికి అందరికీ ట్విటర్‌ ఉచిత వేదిక కాబోదు. నిబంధనలు, చట్టాలకు కట్టుబడి ఉంటూనే అందరికీ అందుబాటులో ఉండాలి. అన్ని వర్గాలకు నచ్చిన ఎంపికలను అందించేలా తీర్చిదిద్దాలి’’ అని మస్క్‌ తన సందేశంలో తెలిపారు.

(ఇదీ చదవండి: పరాగ్‌ను పంపించేసిన మస్క్‌.. మరో ఉన్నతోద్యోగికి అవమానకర రీతిలో ఉద్వాసన!)

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఎట్టకేలకు ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియను పూర్తిచేశారు. 44 బిలియన్‌ డాలర్లకు దాన్ని సొంతం చేసుకున్నారు. ఒక్కో షేరుకు 54.20 డాలర్లు చెల్లించారు. ఏప్రిల్‌లోనే ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నప్పటికీ.. దాదాపు 6 నెలల తర్వాత అది కార్యరూపం దాల్చింది. జులైలో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఈ వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఎట్టకేలకు అక్టోబరు 28 నాటికి ఏదో ఒకటి తేల్చుకోవాలని న్యాయస్థానం ఆదేశించడంతో గడువు ముగిసేలోగా మస్క్‌ డీల్‌ను పూర్తిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని