Elon Musk: మరో కంపెనీ కొనుగోలుకు మస్క్‌ సిద్ధమవుతున్నారా..?

ట్విటర్‌ కొనుగోలుతో కలిపి ఎలాన్‌ మస్క్ ఏడు కంపెనీలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన మరో కంపెనీని కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.

Published : 28 Dec 2022 21:35 IST

న్యూయార్క్‌: ట్విటర్‌ (Twitter) కొనుగోలు తర్వాత వరుస నిర్ణయాలతో విమర్శలపాలవుతున్న ఎలాన్‌ మస్క్(Elon Musk), మరో కంపెనీ కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ట్విటర్‌లో ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు మస్క్‌ ఇచ్చిన సమాధానం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. అమెరికాకు చెందిన సబ్‌స్టాక్‌ (Substack) అనే  సంస్థ.. పబ్లిషింగ్‌, పేమెంట్‌, ఎనలిటిక్స్, డిజైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి విభాగాలకు సంబంధించిన డిజిటల్‌ న్యూస్‌లెటర్లను నేరుగా సబ్‌స్క్రైబర్లకు చేరవేస్తుంది. ఈ సంస్థ సబ్‌స్క్రైబర్లలో ఎక్కువమంది జర్నలిస్టులు, మీడియారంగంలోని వారే ఉన్నారు. దీంతో మీడియారంగంలో ఇతర సంస్థలకు పోటీగా మస్క్‌ ఈ సంస్థను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.  

‘‘ట్విటర్‌ను కొనుగోలు చేసిన మీరు, సబ్‌స్టాక్‌ను కూడా సొంతం చేసుకుని, రెండింటిని పటిష్ఠం చేసి అనుసంధానిస్తే బావుంటుంది. ఈ రెండు సంస్థల కలయిక కార్పొరేట్ మీడియారంగంలో కొత్త పోటీకి తెరలేపుతుంది’’ అని వాల్‌ స్ట్రీట్‌ సిల్వర్‌ అనే నెటిజన్‌ మస్క్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు ‘‘ ఈ ఆలోచన సమ్మతమైంది’’ అని మస్క్‌ రిప్లై ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సంభాషణను చూసిన నెటిజన్లు మస్క్ మరో సంస్థను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు. 

ఇటీవల కొనుగోలు చేసిన ట్విటర్‌తో కలిపి మస్క్‌ ఏడు కంపెనీలను నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా (Tesla), అంతరిక్ష ప్రయోగాల కోసం స్పేస్‌ఎక్స్‌ (SpaceX), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై పరిశోధనల కోసం ఓపెన్‌ ఏఐ (Open AI), మానవ మెదడులో కంప్యూటర్‌ చిప్‌ను చొప్పించేందుకు న్యూరాలింక్‌ (Neuralink), వేగవంతమైన రవాణా వ్యవస్థ కోసం ది బోరింగ్ కంపెనీ (The Boring Company)లు ఈ జాబితాలో ఉన్నాయి. 

ట్విటర్‌ సీఈవోగా మస్క్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వ్యక్తం అవుతుండటంతో, ఎక్కువ మంది యూజర్లు సీఈవోగా తప్పుకోవాలని ఓటేశారు. దీంతో ఆ పదవి నుంచి ఆయన వైదొలగనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ట్విటర్‌కు కొత్త సీఈవోను నియమించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్‌ ఒకరు సీఈవో పదవికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, సీఈవో పదవి చేపట్టేందుకు ఎవరూ ఆసక్తి కనబరచడంలేదని మస్క్ ట్వీట్ చేయడం కొసమెరుపు. 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు