Elon musk: మస్క్‌లోని ఆ లక్షణాలే వ్యాపారంలో విజయానికి.. మా విడాకులకు కారణం: జస్టిన్‌ మస్క్‌

Elon musk: దక్షిణాఫ్రికాలో పురుషాధిక్య సంస్కృతిలో పెరిగిన ఎలాన్‌ మస్క్‌.. ఇంట్లోనూ దాన్ని ప్రదర్శించేవారని ఆయన మాజీ భార్య జస్టిన్‌ మస్క్‌ ఆరోపించారు.

Published : 03 Oct 2023 13:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రారంభించిన అన్ని వ్యాపారాల్లో  టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) గొప్ప విజయాలను సాధిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆయనకున్న క్రేజ్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఆయన తన వ్యక్తిగత జీవితంలో అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వైవాహిక బంధంలో అనేక ఆటుపోట్లను చవిచూశారు. ఇటీవల విడుదలైన ఆయన జీవిత చరిత్రలో అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అయితే, ఆయన మొదటి భార్య జస్టిన్‌ మస్క్‌ (Justine Musk) గతంలో రాసిన ఓ వ్యాసం తాజాగా వైరలవుతోంది. 

ఎలాన్‌ మస్క్‌తో విడాకుల గురించి జస్టిన్‌ 2010లో ఓ వ్యాసం రాశారు. వారి వైవాహిక బంధం గురించి అందులో ఆమె వివరించారు. వివాహం జరిగిన తొలిరోజు రాత్రే తనకు మస్క్‌ నుంచి కొన్ని హెచ్చరికలు అందాయని జస్టిన్‌ తెలిపారు. దక్షిణాఫ్రికాలో పురుషాధిక్య సంస్కృతిలో పెరిగిన మస్క్‌.. ఇంట్లోనూ దాన్ని ప్రదర్శించేవారని ఆమె ఆరోపించారు. పోటీతత్వం, ఆధిపత్యం చలాయించాలనే సంకల్పమే మస్క్‌ను వ్యాపారంలో విజయవంతుణ్ని చేశాయని తెలిపారు. అయితే, ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాటిని వీడకపోవడం ఇబ్బందులకు దారితీసినట్లు పేర్కొన్నారు.

తనకూ, ఎలాన్‌ మస్క్‌కు మధ్య ఆర్థికంగా చాలా అంతరాలు ఉండేవని జస్టిన్‌ తెలిపారు. ఇది క్రమంగా తనపై మస్క్‌ ఆధిపత్యం పెరగడానికి దోహదం చేసినట్లు పేర్కొన్నారు. ఎలాన్‌ మస్క్‌ తరచూ తనలోని లోపాలను ఎత్తిచూపేవారని ఆమె తెలిపారు. ‘‘నేను మీ ఉద్యోగిని కాదు.. భార్యను’’ అని పదేపదే చెప్పాల్సి వచ్చేదని వివరించారు. దీనికి ఎలాన్‌ మస్క్‌ బదులిస్తూ ‘‘ఒకవేళ నువ్వు నా ఉద్యోగి అయి ఉంటే నిన్ను ఎప్పుడో తొలగించేవాణ్ని’’ అని ఎద్దేవా చేసేవారని వెల్లడించారు. జుట్టుకు మరింత అందంగా రంగు వేయాలని తరచూ ఒత్తిడి చేసేవారని తెలిపారు. తమ తొలి కుమారుడు నెవాడా మరణించిన తర్వాత ఇరువురి మధ్య దూరం మరింత పెరిగిందని చెప్పారు. 2008లో ఈ జంట విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని