Elon Musk: ట్విటర్‌కు మస్క్‌ సూచించిన మార్పులివే!

ఎవరూ లేని ఆ కార్యాలయాన్ని ఇల్లులేని వారికి ఆశ్రయం కల్పించేందుకు ఉపయోగిద్దామా? అంటూ మస్క్‌ పోల్‌ పెట్టారు....

Published : 10 Apr 2022 18:07 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌లో చురుగ్గా ఉంటారు. ఆయన ట్వీట్లు ఆలోచింపజేస్తాయి. ఒక్కోసారి సరదాగానూ ఉంటాయి. కొన్ని సార్లు కొంటెగా ఉంటే మరికొన్నిసార్లు వివాదాస్పదమూ అవుతాయి. తాజాగా ఆయన చేసిన ఈ ట్వీట్‌ ఏ కేటగిరీలోకి వస్తుందో మీరే చూడండి మరి!

ఇటీవలే ఆయన ట్విటర్‌లో 9.2 శాతం వాటా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ కంపెనీ బోర్డులో కూడా చేరారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్‌ ప్రధాన కార్యాలయం ఖాళీగా ఉందన్నది తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ సారాంశం. అందరూ వర్క్‌ ఫ్రమ్‌ హోంలో ఉండడమే అందుకు కారణం. అయితే, ఎవరూ లేని ఆ కార్యాలయాన్ని ఇల్లులేని వారికి ఆశ్రయం కల్పించేందుకు ఉపయోగిద్దామా? అంటూ పోల్‌ పెట్టారు. ఎనిమిది గంటల్లో దాదాపు 10 లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం. వీరిలో చాలా మంది ఉపయోగిద్దామని చెప్పడం గమనార్హం.

మరికొన్ని ట్వీట్లలో ట్విటర్‌లో చేయాల్సిన మార్పుల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా బ్లూ సబ్‌స్క్రైబర్లకు అందించాల్సిన ఫీచర్లలో మార్పులు చేయాలని సూచించారు. బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు తగ్గించడం, ప్రకటనల నిషేధం, క్రిప్టోకరెన్సీలో చెల్లింపులు వంటి అంశాలు ఆయన సూచించిన వాటిలో ఉన్నాయి. సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, అధికారిక ఖాతాలు, గుర్తింపు పొందిన వ్యక్తులకు ఇచ్చే ‘వెరిఫికేషన్‌ మార్క్‌’తో పోలిస్తే ప్రత్యేకంగా ఉండే ఓ ‘అథెంటికేషన్‌ చెక్‌మార్క్‌’ను బ్లూ సబ్‌స్క్రైబర్లకు ఇవ్వాలని చెప్పారు. ఫోల్డర్ల బుక్‌మార్క్‌, అన్‌డూ ట్వీట్‌, రీడర్‌ మోడ్‌ వంటి ఫీచర్లు ప్రస్తుతం బ్లూ సబ్‌స్క్రైబర్లకు లభిస్తున్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని వినియోగదారులకు మాత్రమే ప్రస్తుతానికి ఈ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ వసతి అందుబాటులో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని