Elon Musk: మస్క్‌ సంపద మరింత పతనం.. ఒక్కరోజే ₹63.72 వేల కోట్లు ఆవిరి!

టెస్లా షేర్లు (Tesla Shares) మంగళవారం భారీగా పతనమయ్యాయి. దీంతో ఇప్పటికే ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని కోల్పోయిన మస్క్‌ (Elon Musk) సంపద మరింత దిగజారింది.

Published : 21 Dec 2022 15:03 IST

వాషింగ్టన్‌: టెస్లా, ట్విటర్‌, స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇటీవలే ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానాన్ని కోల్పోయారు. ఆయన సంపద ఇంకా తరిగిపోతూనే ఉండడం గమనార్హం. మంగళవారం టెస్లా షేర్ల (Tesla Shares)లో భారీ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో మస్క్‌ (Elon Musk) సంపదలో 7.7 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.63.72 వేల కోట్లు) ఆవిరయ్యాయి. అక్టోబరు తర్వాత టెస్లా షేర్లు మంగళవారం అతిపెద్ద ఒకరోజు నష్టాన్ని నమోదు చేశాయి.

ఈ ఏడాది మస్క్‌ సంపద ఇప్పటి వరకు 122.6 బిలియన్‌ డాలర్లు కరిగిపోయింది. 2021లో ఆయన సంపాదించిన దానికంటే ఇది ఎక్కువ. గత ఏడాది ఆయన ప్రపంచంలోనే అత్యధిక సంపద కూడగట్టుకున్న వ్యక్తిగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ల సూచీ ప్రకారం మస్క్‌ సంపద ఇప్పుడు 148 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది రెండేళ్ల కనిష్ఠం. ప్రస్తుతం ఆయన కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. లగ్జరీ వస్తువుల బ్రాండ్‌ అయిన ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 161 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తర్వాత భారత్‌కు చెందిన అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ 127 బిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.

మస్క్‌ సంపదలో అత్యధికంగా టెస్లా స్టాక్స్‌, ఆప్షన్స్‌ రూపంలోనే ఉంది. అక్టోబరులో ట్విటర్‌ను సొంతం చేసుకున్న ఆయన.. దానికి కావాల్సిన నిధుల కోసం టెస్లా షేర్లను విక్రయించారు. ఇటీవలే 3.58 బిలియన్‌ డాలర్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. దానికి కారణం వెల్లడించనప్పటికీ.. ట్విటర్‌ కొనుగోలు బకాయిలు చెల్లించడానికే అయి ఉంటుందన్న వార్తలు వచ్చాయి. మరోవైపు ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన తన సమయంలో ఎక్కువ భాగాన్ని దాని కోసమే వెచ్చిస్తున్నారన్న ఆందోళన వాటాదారుల్లో నెలకొంది. ఈ క్రమంలో ఆయన టెస్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే భయం వారిలో బలపడుతోంది. పైగా ట్విటర్‌లో మస్క్‌ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతుండడంతో ఆ ప్రభావం కూడా టెస్లా బ్రాండ్‌ విలువపై ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలే షేరు విలువ దిగజారడానికి కారణమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని