Twitter: ‘అసలు ట్విటర్‌ ఉంటుందా?’.. ఎలాన్‌ మస్క్‌ సమాధానమిదే..!

ట్విటర్‌ భవిష్యత్తు ఇక కష్టమేనని అంచనాలు వేస్తూ నెటిజన్లు చేస్తోన్న విమర్శలకు మస్క్‌ స్పందించారు. వారికి తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు.

Published : 23 Nov 2022 10:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నేతృత్వంలో ట్విటర్‌ (Twitter)లో వస్తోన్న మార్పులు, వేల సంఖ్యలో ఉద్యోగాల కోతలను చూస్తుంటే అసలు ఈ సంస్థ మనుగడ సాధిస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై పలువురు విమర్శలు చేయగా.. మస్క్‌ వారికి గట్టి సమాధానమిచ్చారు. అలా అనుకుంటే ట్విటర్‌ ఈపాటికే చచ్చిపోయి ఉండాలి? కదా అంటూ విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చారు.

ట్విటర్‌ భవిష్యత్తు ఇక కష్టమేనని అంచనాలు వేస్తూ నెటిజన్లు చేస్తోన్న విమర్శలపై మస్క్‌ బుధవారం స్పందించారు. ట్విటర్‌ పని ఇప్పటికే ముగిసి ఉండాలి లేదా మరేదైనా జరిగి ఉండాలి కదా? అని ట్వీట్‌ చేశారు. దీన్ని కొనసాగిస్తూ.. ‘బహుశా అదే జరిగితే.. ఇప్పటికే స్వర్గానికో/నరకానికో వెళ్లి ఉంటామేమో. తెలియదు మరి’ అంటూ వ్యంగ్య ధోరణిలో రాసుకొచ్చారు.

ట్విటర్‌ను విమర్శించేవారు.. సంస్థ గురించి ఏమీ తెలియకుండానే ఓ నిర్ధారణకు వచ్చేవారు వేరే సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లు చూసుకోవాలని మస్క్‌ నిన్న ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. వరుస విమర్శలతో విసుగెత్తిపోయిన ఆయన నిన్న ‘మీకో దండం’ అనే ఉద్దేశంలో ‘నమస్తే’ అంటూ ట్వీట్ చేశారు.

ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత మస్క్‌ అనేక మార్పులను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. తొలుత ట్విటర్‌ బ్లూ సేవలకు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. అది కాస్తా బెడిసికొట్టడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు కంపెనీ ఖర్చులను తగ్గించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. అటు కష్టపడి పనిచేసేవాళ్లు మాత్రమే సంస్థలో ఉండాలంటూ అల్టిమేటం తీసుకొచ్చారు. దీంతో అనేక మంది స్వచ్ఛంద రాజీనామాలకు సిద్ధమయ్యారు. మస్క్‌ చేతుల్లోకి వెళ్లకముందు సంస్థల్లో దాదాపు 7500 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో దాదాపు 5వేల మందిని మస్క్‌ తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని