Emergency Fund: అత్య‌వ‌స‌ర నిధి ఎంత కావాలి?

ఆప‌ద స‌మ‌యంలో అప్పు చేయాల్సిన అవ‌స‌రం రాకుండా ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది అత్య‌వ‌స‌ర నిధి.

Updated : 18 Jul 2022 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితంలో ఒడుడొడుకులు స‌హ‌జం. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుందో మ‌నం ఊహించ‌లేం. అలాగే ఆర్థికంగా కూడా ఎలాంటి ప‌రిస్థితులైనా రావ‌చ్చు. వాటిని ఎదుర్కొనేందుకు ఎల్ల‌ప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆప‌ద స‌మ‌యంలో అప్పు చేయాల్సిన అవ‌స‌రం రాకుండా ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది అత్య‌వ‌స‌ర నిధి. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రి ఆర్థిక ప్ర‌ణాళిక‌లో అత్య‌వ‌స‌ర నిధి భాగం కావాలి. అయితే, చాలా మందికి సాధార‌ణంగా ఎదుర‌య్యే ప్ర‌శ్న - ఎంత మొత్తం అత్య‌వ‌స‌ర నిధి కోసం స‌మ‌కూర్చుకోవాలి? ఎక్క‌డ దాచిపెట్టాలి?
1. ఊహించ‌లేని సంద‌ర్భాలు: వీటికి ఎప్పుడు, ఎంత మొత్తం అవ‌స‌ర‌మ‌వుతుందో మ‌నం ఊహించ‌లేం. ఉదాహ‌ర‌ణ‌కు అనుకోకుండా ఉద్యోగం పోయింది. మ‌ళ్లీ ఉద్యోగం దొరికే వ‌ర‌కు నెల‌వారీ ఖ‌ర్చుల‌కు డ‌బ్బు కావాలి. తిరిగి ఉద్యోగంలో చేర‌డానికి నెల లేదా 2, 3 నెల‌లు.. లేదా అంతకంటే ఎక్కువ సమయమే పట్టొచ్చు. అప్ప‌టి వ‌ర‌కు అప్పులు చేయ‌కుండా జీవించేందుకు, అనుకోని వైద్య ఖ‌ర్చులకు అత్య‌వ‌స‌ర నిధి స‌హాయ‌ప‌డుతుంది.

ఇందుకోసం మీ నెల‌వారీ సంపాద‌న లేదా ఖ‌ర్చుల‌ను అనుస‌రించి అత్య‌వ‌స‌ర నిధిని అంచ‌నా వేయాలి. క‌నీసం 3 నుంచి 12 నెల‌ల జీతానికి స‌మాన‌మైన మొత్తాన్ని అత్య‌వ‌స‌ర నిధిగా ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఒక‌వేళ మీరు స్వ‌యం ఉపాధి పొందుతున్న వ్య‌క్తులైతే ఖ‌ర్చుల‌ను అనుస‌రించి అంచ‌నా వేయ‌వ‌చ్చు. క‌నీసం 3 నుంచి 12 నెల‌ల ఖ‌ర్చుల (ఇందులో రుణ ఈఎంఐ వంటివి కూడా చేర్చాలి)కు స‌మాన‌మైన మొత్తాన్ని అత్య‌వ‌స‌ర నిధిగా ఏర్పాటు చేసుకోవ‌చ్చు.

2. ఊహించ‌గ‌లిగే సంద‌ర్భాలు: కొన్ని సంద‌ర్భాల‌ను, అందుకు అయ్యే ఖ‌ర్చును సుమారుగా మ‌నం ఊహించ‌గ‌లం. అయితే, అలాంటి సంద‌ర్భం జీవితంలో ఎప్పుడు వ‌స్తుందో మాత్రం మ‌నం ఊహించ‌లేము. ఉదాహ‌ర‌ణకు కొంద‌రు త‌మ ఉద్యోగం నిమిత్తం త‌ర‌చూ వేరు వేరు ప్ర‌దేశాల‌కు వెళ్ల‌వ‌ల‌సి వ‌స్తుంది. ఇల్లు మారుతున్న ప్ర‌తిసారీ కొత్త ఇంటి కోసం ఇచ్చే అడ్వాన్సులు, రవాణా కోసం చెల్లింపులు ఇలా.. ఖ‌ర్చులు భారీగా అవుతాయి. అలాగే, ఉద్యోగం కోసం ఎక్కువ‌గా సొంత వాహ‌నంలో ప్ర‌యాణించే వారికి వాటి రిపేర్ల‌కు ఖ‌ర్చులు అవుతాయి. చిన్న చిన్న రిపేర్లు అయితే ప‌ర్వాలేదు కానీ ఒక్కోసారి వాహ‌నం విడిభాగాల‌ను మార్చాల్సి వ‌చ్చిన‌ప్పుడు అధిక మొత్తంలో ఖ‌ర్చు కావ‌చ్చు. 

కొన్ని వ్యాధులు జ‌న్యుప‌రంగా వ‌స్తుంటాయి. అంటే కుటుంబంలోని ముందు త‌రం వారికి అంటే త‌ల్లిదండ్రులు, ర‌క్త సంబంధీకుల‌లో ఎవ‌రికైనా జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉంటే.. అవి వారి సంతానానికి కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఒక్కోసారి వీటికి సంబంధించిన అన్ని ఖ‌ర్చుల‌ను బీమా కూడా క‌వ‌ర్ చేయ‌క‌పోవ‌చ్చు. అలాంటి సంద‌ర్భాల్లో సంబంధిత చికిత్స కోసం (చికిత్స‌ను బీమా క‌వ‌ర్ చేస్తుంటే ఇత‌ర ఖ‌ర్చుల కోసం) డ‌బ్బు అవ‌స‌రం అవుతుంది.

ఒక‌వేళ మీరు త‌ర‌చూ ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంబంధించే ప్రాంతాల‌లో నివ‌సిస్తుంటే.. ఈ కార‌ణంగా కొన్ని రోజులు బ‌య‌టకు వెళ్ల‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డవ‌చ్చు. లేదా మీ ఇల్లు, వాహ‌నాలు వంటివి పాక్షికంగా దెబ్బతిన‌వ‌చ్చు. వీటి రిపేర్ల‌కు ఖ‌ర్చులు అవుతుంటాయి. ఇలా మీ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసి, త‌గిన‌ అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు చేయ‌వ‌చ్చు. 

ఎక్క‌డ దాచిపెట్టాలి?
అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు ఎప్పుడు వ‌స్తాయో చెప్ప‌లేం. ఇదే స‌మ‌యానికి డ‌బ్బు అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని కచ్చితంగా చెప్ప‌లేం. కాబ‌ట్టి అత్య‌వ‌స‌ర నిధి కోసం దీర్ఘ‌కాల లాక్-ఇన్ పిరియ‌డ్‌ ఉండే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోకూడ‌దు. కొంత మొత్తాన్ని ఎప్పుడైనా తీసుకోగ‌లిగేలా పొదుపు ఖాతాలో ఉంచి మిగిలిన మొత్తాన్ని మూడు నెల‌లు, ఆరు నెల‌ల కాల‌ వ్య‌వ‌ధిలో మెచ్యూర్ అయ్యే పెట్టుబ‌డులో పెట్టొచ్చు. వీటిని ఆటో-రెన్యూ ఆప్ష‌న్‌లో ఉంచ‌డం ద్వారా మెచ్యూరిటీ త‌ర్వాత.. అవ‌స‌రం లేక‌పోతే అత్య‌వ‌స‌ర నిధి కోసం పెట్టుబ‌డులు పున‌రావృతం అవుతాయి. ప్ర‌కృతి వైప‌రీత్యాలు వంటి ప్రాంతాల్లో నివ‌సించే వారు కొంత మొత్తాన్ని ఇంటిలో ఉంచుకోవ‌డం మంచిది. ఇలాంట‌ప్పుడు బ్యాంకులు, ఏటీఎంలు స్తంభించ‌వ‌చ్చు. కాబ‌ట్టి ఆ స‌మ‌యంలో ఈ మొత్తం ఉప‌యోగ‌ప‌డుతుంది. 

ఉదాహ‌ర‌ణ‌కు శ్యామ్ త‌ర‌చూ ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించే ప్రాంతంలో నివ‌సిస్తున్నాడు. నెల వారీ జీతం రూ.50 వేలు అనుకుందాం. శ్యామ్‌ త‌న జీతానికి 12 రెట్లు స‌మానమైన మొత్తం, అంటే రూ.6 ల‌క్ష‌లు అత్య‌స‌ర నిధిగా ఏర్పాటు చేసుకున్నాడు. అత‌డు ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించే ప్రాంతంలో నివ‌సిస్తున్నాడు కాబ‌ట్టి ఎప్పుడూ క‌నీసం రూ. 10 వేలు ఇంటి వ‌ద్ద ఉంచుకోవాలి. క‌నీసం రూ.40 వేలు పొదుపు ఖాతాలో ఉంచి కొంత‌ మొత్తాన్ని 90 రోజుల మెచ్యూరిటీ వ్య‌వ‌ధి గ‌ల లిక్విడ్ ఫండ్లు, మిగ‌లిన మొత్తాన్ని అల్ట్రా షార్ట్ ట‌ర్మ్ డూరేష‌న్ ఫండ్ల (మెచ్యూరిటీ స‌మ‌యం 6 నెల‌లు)లో ఉంచ‌వ‌చ్చు. స్వీప్ ఇన్ ఫిక్సిడ్ డిపాజిట్ కూడా చేయవచ్చు.

చివ‌రగా: అత్య‌వ‌స‌రి నిధి కోసం అధిక రాబడి ఇచ్చే ప‌థ‌కాల‌ను కాకుండా.. అధిక లిక్విడిటీ ఉన్న పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌డం మంచిది. అలాగే లిక్విడిటీతో పాటు కొంత రాబ‌డి ఉండ‌డం అవ‌స‌రం కాబ‌ట్టి వేరు వేరు పెట్టుబ‌డుల‌లో పెట్టడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు