EMIలు మరింత భారం.. ఎంత వరకు పెరగొచ్చంటే?

ఆర్‌బీఐ రెపోరేటు పెంచడంతో బ్యాాంకులు రుణరేట్లను పెంచనున్నాయి. దీంతో రుణదాతల నెలవారీ వాయిదాల (EMI) మొత్తం పెరగనుంది. 

Updated : 30 Sep 2022 14:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌బీఐ రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.90 శాతం చేసింది. దీంతో బ్యాంకులు రుణరేట్లనూ పెంచనున్నాయి. ప్రస్తుతం అన్ని బ్యాంకులూ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్కుగా రెపోరేటు (Repo Rate)ను తీసుకుంటుండడమే దీనికి కారణం. ఏప్రిల్‌లో 6.5-7 శాతం వడ్డీరేటుకు లభించిన రుణం, ఇప్పుడు 8.5 శాతానికి మించే అవకాశాలున్నాయి.

వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద రుణాలు తీసుకుంటుంటాయి. రెపోరేటు పెరగడంతో ఇప్పుడు బ్యాంకులకు అధిక రేటు వద్ద రుణాలు లభిస్తాయి. ఈ భారాన్ని రుణరేట్లను పెంచడం ద్వారా బ్యాంకులు వినియోగదారులపై మోపుతాయి. అందుకోసమే బ్యాంకులు తమ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్కుగా రేపోరేటును ఆధారం చేసుకుంటున్నాయి. దీంతో కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వారికి అధిక వడ్డీరేటు వర్తిస్తుంది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారి నెలవారీ వాయిదా (EMI) మొత్తం పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈఎంఐలో పెంపు వద్దనుకుంటే రుణం చెల్లింపు కాలం పెరుగుతుంది.

కొత్త ఇల్లు కొనుగోలుకు రూ.30లక్షల రుణాన్ని 25 ఏళ్ల వ్యవధికి 6.5 శాతం వడ్డీతో తీసుకున్నప్పుడు ఈఎమ్‌ఐ రూ.20,256 అవుతుంది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రుణరేటు 1.90 శాతం పెరిగినందున, ఈఎమ్‌ఐ రూ.23,955కు చేరుతుంది. అంటే ప్రతి రూ.లక్ష లోన్‌కు అదనంగా నెలకు రూ.123 చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తుల ఆదాయం, వయసు ఆధారంగా బ్యాంకులు రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. వడ్డీ రేటు పెరిగినప్పుడు ఆ మేరకు రుణ అర్హత తగ్గుతుంది. పై ఉదాహరణలో చూసుకుంటే.. రూ.20,256 వాయిదా చెల్లించే వారికి రుణం రూ.30 లక్షలకు బదులు, రూ.25.40 లక్షలు మాత్రమే మంజూరవుతుంది.

రేట్లు పెంచడం ప్రారంభించడానికి ముందు రూ.10 లక్షల వాహన రుణం, 7 ఏళ్ల కాలపరిమితి, 10 శాతం వడ్డీరేటుతో తీసుకున్నారనుకుంటే.. ఈఎమ్‌ఐ రూ.16,601గా ఉంటుంది. వడ్డీరేటు ఇటీవల 1.9 శాతం పెరిగిన నేపథ్యంలో ఈఎమ్‌ఐ రూ.17,599కు పెరగనుంది. అంటే ఏప్రిల్‌తో పోలిస్తే అదనంగా నెలకు రూ.998 చెల్లించాల్సి ఉంటుంది.

అదే పర్సనల్‌ లోన్ విషయానికి వస్తే.. రూ.6 లక్షల రుణానికి ఐదేళ్ల కాలపరిమితి, 14 శాతం వడ్డీరేటుతో లెక్కిస్తే ఈఎమ్‌ఐ రూ.598 పెరిగి రూ.13,961 నుంచి రూ.14,559కు చేరనుంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ వ్యక్తి 15 ఏళ్ల వ్యవధికి 6.75 శాతం రుణరేటు వద్ద రూ.20 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం.. ఆ వ్యక్తి చెల్లించాల్సిన ఈఎంఐ ఎలా మారుతుందో చూద్దాం..

(** రెపో ఆధారిత రుణ వడ్డీరేటు.. రెపోకు అదనంగా బ్యాంకు 2.75 శాతం వసూలు (స్ప్రెడ్‌) చేస్తుందనే అంచనాలతో)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని