Loans: విహార యాత్రల కోసం అప్పు చేస్తున్నారా?

ఉద్యోగ, వ్యాపారాల‌ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు విహారయాత్రలకు వెళ్లడం తప్పుకాదు.

Published : 14 Apr 2022 16:23 IST

ఇల్లు కొనుగోలు చేయడం, స్థిర ఆస్తులను సమకూర్చుకోవడం లేదా సంపాదనా సామర్థ్యాలను పెంచుకోవడం కోసం వృత్తి, వ్యాపారాల కోసం రుణం తీసుకోవడంలో తప్పు లేదు..కానీ చాలా మంది ఇప్పుడు వస్తు, సేవల వినియోగం కోసం కూడా రుణాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, బైనౌ పే లేటర్ (బీఎన్‌పీఎల్) సేవలు, మార్ట్గేజ్ రుణాలు.. ఇలా అనేక రూపాల్లో రుణాలు సులభంగా అందుబాటులో ఉండడం, ఈఎమ్ఐలలో నెలవారిగా తిరిగి చెల్లించవచ్చనే ధీమాతో రుణం తీసుకునేందుకు వెనకాడడం లేదు.

విహార యాత్ర కోసం తక్షణమే డబ్బు కావాల్సి వచ్చినప్పుడు చాలామంది వ్యక్తిగత రుణం వైపు చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా బై-నౌ పే-లేటర్ (ఇప్పుడు కొనండి తరవాత చెల్లించండి) రుణాలు కూడా లభిస్తున్నాయి. ప్రత్యేకించి ఇప్పటికే దీర్ఘకాలిక రుణాలు ఉండి, రుణ వాయిదాలు చెల్లిస్తున్న వారికి కూడా ఈ రకమైన రుణాలు స్వల్పకాలిక అవసరాలకు అనుగుణంగా లభిస్తున్నాయి. వ్యక్తిగత రుణం తీసుకున్న తర్వాత నిర్ధిష్ట కాలం పాటు రుణ వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. 'బీఎన్‌పీఎల్‌' విధానంలో ఏకమొత్తంగానూ, ఈఎమ్ఐలలో మీకు నచ్చిన విధానంలో చెల్లింపులు చేయవచ్చు. 

వ్యక్తిగత రుణాలు ఖరీదైనవి. వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. సమయానికి చెల్లింపులు చేయకపోతే మరింత భారమవుతాయి. అందుకే అత్యవసరమైతే తప్ప అధిక వడ్డీ రేటుతో కూడిన వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాల జోలికి వెళ్లద్దంటారు నిపుణులు.  అయితే స్వల్ప కాల ఆనందం, సంతృప్తి కోసం, తప్పనిసరికాని ఖర్చులకు దూరంగా ఉండడమే మంచిది. 

ఏడాదంతా కష్టపడి ఉద్యోగాల, వ్యాపార, వృత్తి పనులలో తీరిక లేకుండా పనిచేసి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు విహారయాత్రలకు వెళ్లడం తప్పుకాదు. అయితే, రుణం తీసుకుని విహారయాత్రలు చేయడం కూడా తెలివైన పనికాదు. విహార యాత్రలకు వెళ్లాలనుకునే వారు ముందు నుంచే సిద్ధం కావాలి. దీన్ని ఒక స్వల్పకాలిక లక్ష్యంగా వార్షిక ఆర్థిక ప్రణాళికలో చేర్చి సమయాన్ని ప్రణాళిక వేసుకుని మదుపు చేయాలి. 

సెలవలు ఎప్పటి నుంచి మొదలవుతాయి. ఎప్పటి నుంచి యాత్ర మొదలుపెడుతున్నాం. ఎంత కాలం ప్రయాణానికి కేటాయించాలనుకుంటున్నాం, తదితర విషయాలను బట్టి ఎంత సొమ్ము అవసరమవుతుందో లెక్క వేసుకోవాలి. అవసరమనుకున్నదానికంటే కొంత ఎక్కువ సొమ్మును జమచేసుకుంటే మేలు. అత్యవసర సమయాల్లో పనికి వస్తుంది. ఇలా చేస్తే విహార యాత్ర చేసేందుకు ఎన్ని నెలల సమయం ఉంటుందో ముందే తెలుస్తుంది కాబట్టి నెలకు ఎంత జమ చేయాలో లెక్కవేసుకోవచ్చు. ఇలా జమ చేసే సొమ్మును లిక్విడ్ ఫండ్స్ లో ఉంచడం మంచిది. పొదుపు ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లతో పోలిస్తే లిక్విడ్ ఫండ్స్ లో రాబడి కాస్త ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. పైగా లిక్విడ్ ఫండ్స్ కు నిష్క్రమణ ఛార్జీల్లాంటివి ఉండవు. కొన్ని బ్యాంకుల ఫిక్సిడ్ డిపాజిట్లలో కూడా అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. ఇలాంటివి కూడా పరిశీలించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని