EPF: ఈపీఎఫ్ వ‌డ్డీ ఆదాయం.. ప‌న్ను నియ‌మాలు

ఉద్యోగులు ఈపీఎఫ్‌కి కాంట్రీబ్యూట్ చేసే మొత్తం రూ. 2.5 లక్ష‌ల లోపు ఉంటే వడ్డీపై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది.

Updated : 04 Aug 2022 17:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాలు అందించే ప‌థ‌కమే ఈపీఎఫ్‌ (EPF). ఈ ప‌థ‌కంలో వ‌చ్చే వ‌డ్డీ ఆదాయంపై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 10 ప్ర‌కారం ఇంత‌కు ముందు వ‌ర‌కు పూర్తి ప‌న్ను మినహాయింపు వ‌ర్తించేది. కానీ, ఆర్థిక చ‌ట్టం 2021లో చేసిన స‌వ‌ర‌ణ‌ల‌తో పీఎఫ్ బ్యాలెన్స్‌పై వ‌చ్చే వ‌డ్డీ ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చింది. ఇది 2022 ఏప్రిల్ 1 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింనందువ‌ల్ల‌ ఈ సంవ‌త్స‌రం వేత‌నం పెరిగిన ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఈపీఎఫ్ కాంట్రీబ్యూష‌న్‌ను చెక్ చేసుకోవాలి. ఒక‌వేళ మీ ఈపీఎఫ్ కాంట్రీబ్యూష‌న్ నిర్దిష్ట ప‌రిమితికి మించి ఉంటే.. వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త రూల్ ప్ర‌కారం.. ఉద్యోగులు ఈపీఎఫ్‌కి కాంట్రీబ్యూట్ చేసే మొత్తం రూ.2.50 లక్ష‌లలోపు ఉంటే వడ్డీపై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. ఒక‌వేళ ప‌రిమితి దాటితే ఆ మొత్తంపై పన్ను వ‌ర్తిస్తుంది. ఇందులో ఈపీఎఫ్‌, వీపీఎఫ్ కాంట్రీబ్యూష‌న్ రెండింటినీ ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటారు. ఈ నియ‌మం ఈపీఎఫ్ కాంట్రీబ్యూష‌న్‌లో య‌జ‌మాని వాటా ఉన్న ఉద్యోగుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. ఒక‌వేళ ఈపీఎఫ్‌లో య‌జ‌మాని వాటా లేకపోతే.. రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను వ‌ర్తించ‌దు. ఇది సాధార‌ణంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్తిస్తుంది. ఎందుకంటే ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సంస్థ వాటా ఉండ‌దు.

ఈ లెక్కింపుల కోసం పీఫ్ కార్యాల‌యం వారు ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22 నుంచి ప్ర‌ధాన పీఎఫ్ ఖాతా కింద రెండు ఖాతాల‌ను నిర్వ‌హిస్తున్నారు.
1.  థ్రిషోల్డ్ లిమిట్ లోపు ఉన్న ఖాతాలు (ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితి లోపు ఉన్న ఖాతాలు)
2.  థ్రిషోల్డ్ లిమిట్‌ని మించిన‌ ఖాతాలు (ప‌న్ను వ‌ర్తించే ఖాతాలు)

వ‌డ్డీ ఆదాయంపై టీడీఎస్ ఎలా లెక్కిస్తారు? 
ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 194A కింద వడ్డీ ఆదాయంపై మూలం వద్ద పన్ను క‌ట్ చేస్తారు. ఈ సెక్షన్ ప్రకారం, ఆదాయాన్ని చెల్లించేవారు టీడీఎస్ తీసేయాలి. కాబ‌ట్టి, ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం లేదా ఈపీఎఫ్ ట్రస్ట్ టీడీఎస్‌ని క‌ట్ చేస్తారు.

భార‌తీయ నివాసుల‌కు..
భార‌తీయ నివాసులైన వ్య‌క్తుల‌కు 10 శాతం టీడీఎస్ వ‌ర్తిస్తుంది. అయితే, ఇందుకోసం పీఎఫ్ ఖాతాకు త‌ప్ప‌నిస‌రిగా పాన్ (శాశ్వ‌త ఖాతా సంఖ్య‌)ను అనుసంధానించి ఉండాలి. ఒక‌వేళ పాన్‌ను అనుసంధానించ‌క‌పోతే 20 శాతం టీడీఎస్ క‌ట్ చేస్తారు. ఏది ఏమైనా వ‌డ్డీ ఆదాయం రూ. 5000 అంత‌కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్ర‌మే టీడీఎస్ క‌ట్ అవుతుంది.

ఎన్ఆర్‌ఐలకు
భార‌తీయ నివాసులు కాని (ఎన్ఆర్‌ఐ) వారికి ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 195 ప్ర‌కారం 30 శాతం టీడీఎస్ వ‌ర్తిస్తుంది. అయితే, డ‌బుల్ ట్యాక్సేష‌న్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) కింద పేర్కొన్న రేట్లు ప్రయోజనకరంగా ఉంటే, అవే రేట్లు వర్తిస్తాయి. పీఎఫ్‌ ఖాతాను పాన్‌తో లింక్ చేయడం తప్పనిసరి. లేకపోతే 30 శాతం టీడీఎస్, 4 శాతం సెస్ వ‌ర్తిస్తాయి. పీఎఫ్ ఖాతాలో వ‌చ్చే వ‌డ్డీ ఆదాయాన్ని ‘ఇత‌ర మార్గాల ద్వారా వ‌చ్చే ఆదాయం’గా పరిగ‌ణిస్తారు. వ్య‌క్తుల‌కు వ‌ర్తించే ప‌న్ను స్లాబ్ ప్ర‌కారం ప‌న్ను డిడ‌క్ట్ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని