EPF: 40 ఏళ్ల కనిష్ఠానికి పీఎఫ్‌ వడ్డీరేటు.. అయినా ఇదే మేలు!

గత నాలుగు దశాబ్దాలకు పైగా కాలంలో పీఎఫ్‌పై ఇదే అత్యల్ప వడ్డీ రేటు కావడం గమనార్హం. అయినప్పటికీ.. సురక్షిత స్థిర ఆదాయ పెట్టుబడి మార్గాలైన పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఆర్‌బీఐ సేవింగ్స్‌ బాండ్స్‌.. వంటి వాటితో పోలిస్తే ఇప్పటికీ ఈపీఎఫ్‌ మెరగైందని చెప్పొచ్చు...

Published : 05 Jun 2022 19:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై 2021-22కుగానూ కేవలం 8.1% వడ్డీ లభించనుంది. ఈ మేరకు కేంద్రం తాజాగా ఆమోదముద్ర వేసింది. 2020-21లో పీఎఫ్‌పై 8.5% వడ్డీ దక్కింది. అనంతరం 2021-22కు వడ్డీరేటును 8.1%కు తగ్గించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ ఏడాది మార్చిలో నిర్ణయం తీసుకుంది. దాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించినట్లు ఈపీఎఫ్‌వో శుక్రవారం వెల్లడించింది.

గత నాలుగు దశాబ్దాలకు పైగా కాలంలో పీఎఫ్‌పై ఇదే అత్యల్ప వడ్డీ రేటు కావడం గమనార్హం. అయినప్పటికీ.. సురక్షిత స్థిర ఆదాయ పెట్టుబడి మార్గాలైన పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఆర్‌బీఐ సేవింగ్స్‌ బాండ్స్‌.. వంటి వాటితో పోలిస్తే ఇప్పటికీ ఈపీఎఫ్‌ మెరుగైందని చెప్పొచ్చు. చాలా వరకు పెద్ద బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6% వడ్డీరేటునే ఇస్తున్నాయి. సీనియర్‌ సిటిజన్లయితే 6.5% వరకు వస్తోంది.

ఈపీఎఫ్‌లోకి ఉద్యోగులు తమ వాటాగా మూల వేతనంలో 12 శాతం డిపాజిట్‌ చేస్తే.. కంపెనీలు కూడా అంతే మొత్తంలో వారి వాటాగా జమ చేస్తాయి. ఉద్యోగులు కావాలంటే వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (వీపీఎఫ్‌) ద్వారా అదనంగా కూడా డిపాజిట్‌ చేసే వెసులుబాటు ఉంది. వీపీఎఫ్‌ డిపాజిట్లకు కూడా ఈపీఎఫ్‌ వడ్డీరేటే వర్తిస్తుంది. పైగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల వరకు (ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌ కలుపుకొని) పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.

మరోవైపు పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF) కూడా అందుబాటులో ఉంది. అయితే దీంట్లో లభించే వడ్డీరేటు 7.1 శాతమే. వీపీఎఫ్‌తో పోలిస్తే ఇది తక్కువ. పైగా ఒక ఏడాదిలో పీపీఎఫ్‌ ఖాతాలో రూ.1.5 లక్షల కంటే ఎక్కువ జమ చేయలేరు. ఈ నేపథ్యంలో పీపీఎఫ్‌తో పోలిస్తే వీపీఎఫ్‌ ఉత్తమ మార్గం. ఒకవేళ దీర్ఘకాలం పాటు స్థిర ఆదాయ పెట్టుబడి మార్గం కావాలనుకునేవారికి వీపీఎఫ్‌ సరిగ్గా సరిపోతుంది. రాబడితో పాటు పన్ను ప్రయోజనాల్లోనూ ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది. వీపీఎఫ్‌పై అధిక వడ్డీ రేటు గరిష్ఠ ప్రయోజనాన్ని పొందాలంటే.. ఏటా మీ ఈపీఎఫ్‌ వాటా ఎంతో లెక్కించాలి. ఆపై మీ వీపీఎఫ్‌ వాటా రూ.2.5 లక్షల పన్ను మినహాయింపు పరిమితిలోపు ప్లాన్ చేసుకోవచ్చు. 

మిగిలిన పెట్టుబడి మార్గాల్లో వస్తున్న వడ్డీరేటు ఇలా ఉంది..

  • సుకన్య సమృద్ధి యోజన - 7.60%
  • సీనియర్‌ సిటిజెన్స్‌ సేవింగ్స్‌ స్కీం - 7.40%
  • పీపీఎఫ్‌ - 7.10%
  • 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్లు - 6.82%
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎఫ్‌డీ - 5.60%
  • ఎస్‌బీఐ ఎఫ్‌డీ - 5.50%
  • ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌ - 8.1%
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని