EPFO: ఈపీఎఫ్‌ ఖాతాలో వడ్డీ సొమ్ము కనిపించడం లేదా? కారణమిదే..

EPFO సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ కారణం వల్లే వడ్డీ మొత్తం ఈపీఎఫ్‌ స్టేట్‌మెంట్‌లో కనిపించడం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Updated : 06 Oct 2022 12:37 IST

దిల్లీ: పీఎఫ్‌ మొత్తాలపై వడ్డీ ఎప్పుడూ సమస్యగానే ఉంటోంది. ఫలానా ఆర్థిక సంవత్సరానికి ఇంత వడ్డీ అని నిర్ణయించాక కూడా కొన్ని నెలలకు గానీ ఆ మొత్తం జమ కాని పరిస్థితి. తాజాగా చాలా మంది తమ ఈపీఎఫ్‌ (EPF) స్టేట్‌మెంట్‌లో వడ్డీ మొత్తం కనిపించడం లేదంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా ఈ వడ్డీ మొత్తం స్టేట్‌మెంట్‌లో కనిపించడం లేదని పేర్కొంది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈఎపీఎఫ్‌ఓ (EPFO) బోర్డు 8.5 శాతం వడ్డీ నిర్ణయించింది. ఆ మొత్తం గతేడాది డిసెంబర్‌లో జమ అయ్యింది. గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి ఈపీఎఫ్‌ బోర్డు వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించింది. దీనికి ఆర్థిక శాఖ జూన్‌లో ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ మొత్తాలు జమ అవుతాయని ఈపీఎఫ్‌ (EPF) చందాదారులు ఎదురుచూస్తున్నారు.

ఆర్థిక శాఖ ఆమోదం తెలిపి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ వడ్డీ జమ కాకపోవడంపై సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ మాజీ డైరెక్టర్‌ మోహన్‌దాస్‌ పాయ్‌ దీనిపై ట్వీట్‌ చేశారు. పీఎఫ్‌ వడ్డీ ఎక్కడ? అంటూ రాసిన ఆర్టికల్‌ను తన ట్వీట్‌కు జత చేసి పీఎంఓ, ప్రధాని, ఆర్థిక మంత్రిత్వ శాఖ, నిర్మలా సీతారామన్‌ను ట్విటర్‌ ఖాతాలకు ట్యాగ్‌ చేశారు. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది.

‘‘వడ్డీ మొత్తాన్ని ఏ ఒక్క చందాదారుడూ కోల్పోరు. అందరి ఈపీఎఫ్‌ ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది. కాకపోతే సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ కారణంగా వడ్డీ మొత్తం స్టేట్‌మెంట్‌లో కనిపించకపోవచ్చు’’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రూ.2.5 లక్షల మించి పీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తే ఆ అధిక మొత్తంపై లభించే వడ్డీకి పన్ను విధిస్తామని గతంలో కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడేషన్‌ జరుగుతుండటంతో ఆలస్యం అవుతోందని తాజాగా వివరించింది. అలాగే, ఎవరైనా పీఎఫ్‌ సెటిల్‌మెంట్లు గానీ, విత్‌డ్రాలు గానీ ఉంటే.. వారికి వడ్డీ మొత్తం కలిపే జరుగుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. తన ట్వీట్‌కు స్పందించినందుకు మోహన్‌దాస్‌పాయ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈపీఎఫ్‌ ఖాతాలన్నీ ఎలక్ట్రానిక్‌గా మారిన తర్వాత కూడా వడ్డీ చెల్లింపులు ఎందుకు ప్రతి సంవత్సరం ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు