పెన్షనర్ల EPFO గుడ్‌న్యూస్‌.. డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించడం ఇక ఈజీ

EPFO launches face authentication for pensioners: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పెన్షనర్ల కోసం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 

Updated : 10 Aug 2022 20:38 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పెన్షనర్ల కోసం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫేస్‌ అథెంటికేషన్‌ సదుపాయంతో ఎక్కడి నుంచైనా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించే వీలు కల్పించింది. దీనివల్ల సుమారు 73 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలగనుంది. లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించే సమయంలో వయసు రీత్యా బయో మెట్రిక్‌ (వేలి ముద్రలు, ఐరిస్‌) వివరాలు సరిగా నమోదుకాని వారికి ముఖ్యంగా ఈ సదుపాయం ఉపయోగపడనుంది. ఈ సదుపాయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌, ఈపీఎఫ్‌ఓ అత్యున్నత నిర్ణయాక మండలి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌తో (CBT) కలిసి ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు శనివారం జరిగిన సీబీటీ 231వ సమావేశంలో సూత్ర ప్రాయ అంగీకారం లభించిందని పేర్కొంది. దశలవారీగా ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది.

ఈ సందర్భంగా పెన్షన్‌ అండ్‌ ఎంప్లాయీ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కాలిక్యులేర్‌ను సైతం కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్‌ ప్రారంభించారు. ఈ కాలిక్యులేటర్‌ ద్వారా పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు పెన్షన్‌, డెత్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ ప్రయోజనాలను ఆన్‌లైన్‌ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. EPFO సెక్యూరిటీస్‌కి రాబోయే మూడేళ్ల పాటు కస్టోడియన్‌గా సిటీ బ్యాంక్‌ను నియమిస్తూ CBT నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ సెక్యూరిటీస్‌కి స్టాండర్డ్‌ఛార్టెడ్‌ బ్యాంక్‌ కస్టోడియన్‌గా వ్యవహరిస్తోంది. కొత్త కస్టోడియన్‌ బాధ్యతలు స్వీకరించే వరకు స్టాండర్డ్‌ ఛార్టరే ఆ బాధ్యతలను చూడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని