Updated : 20 Feb 2022 17:21 IST

EPFO: వేతన జీవులకు గుడ్‌న్యూస్‌.. ఈపీఎఫ్‌వో నుంచి కొత్త పెన్షన్‌ స్కీమ్‌!

దిల్లీ: వేతన జీవుల కోసం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) ఓ కొత్త పెన్షన్‌ స్కీమ్‌ తీసుకురాబోతోంది. రూ.15వేల కంటే ఎక్కువ బేసిక్‌ వేతనం పొందుతున్న, 1995 నాటి పెన్షన్‌ స్కీమ్‌ (EPS-95) పరిధిలోకి రాని ఉద్యోగుల కోసం ఈ స్కీమ్‌ ప్రవేశ పెట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మార్చిలో గువాహటి వేదికగా జరిగే ఈపీఎఫ్‌వో అత్యున్నత నిర్ణాయక మండలి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (CBT) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

సంఘటిత రంగంలో ఉద్యోగంలో చేరేటప్పుడు రూ.15 వేల కంటే తక్కువ బేసిక్‌ జీతం అందుకున్న వారికి EPS-95 కింద పెన్షన్‌ స్కీమ్‌ వర్తిస్తుంది. ఉద్యోగంలో చేరే సమయంలో అంతకంటే బేసిక్‌ వేతనం ఎక్కువ ఉంటే వారికి ఈ స్కీమ్‌ వర్తించదు. అయితే, రూ.15వేల కంటే ఎక్కువ మొత్తంలో బేసిక్‌ వేతనం పొందుతున్నా.. తక్కువ మొత్తంలో పెన్షన్‌ పొందాల్సి వస్తోంది. బేసిక్‌ వేతనం ఎంత అయినప్పటికీ రూ.15వేల వేతనం ఆధారంగానే... అందులో 8.33 శాతం చొప్పున మాత్రమే EPS-95లో జమ అవుతోంది. దీని వల్ల పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్‌ మొత్తం తక్కువగా వస్తోంది. దీంతో అధిక పెన్షన్‌ పొందేందుకు... ఈపీఎస్‌లో ఎక్కువ మొత్తం జమ చేసే వీలు కల్పించాలన్న డిమాండ్లు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై 2021 నవంబర్‌లో సీబీటీ ఓ సబ్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను బోర్డుకు సమర్పించింది. మార్చిలో జరిగే సీబీటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

కోర్టు పరిధిలో పరిమితి పెంపు అంశం

గతంలో బేసిక్‌ వేతన పరిమితి రూ.6500గా ఉండేది. దాన్ని 2014లో చివరిసారిగా సవరించి రూ.15వేలకు పెంచారు. దాన్ని రూ.25వేలకు పెంచాలని డిమాండ్లూ ఉన్నాయి. కానీ, కేంద్రం ఆ పరిమితిని పెంచలేదు. ఇదే విషయాన్ని 2016లో లోక్‌సభలో నాటి కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదనేదీ లేదని లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మరోవైపు పరిమితి పెంపు అంశంపై 2014లో కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం... బేసిక్‌ వేతనం కంటే ఎక్కువ మొత్తంలో పెన్షన్‌ స్కీమ్‌లో జమ చేసేందుకు ఉద్యోగులకు వీలు కల్పించాలని తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఈపీఎఫ్‌వో ఆశ్రయించింది. దీంతో ఇదే అంశంపై కేరళ, దిల్లీ, రాజస్థాన్‌ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను 2021లో సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. మరోవైపు, ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండడంతో పరిమితిని పెంచే ఉద్దేశమేదీ లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొత్త పథకం అమలు చేస్తే 50 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని సమాచారం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని