EPFO: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు ఊరట.. పదే పదే క్లెయింల తిరస్కరణలకు చెక్‌!

పీఎఫ్‌ క్లెయింలను వివిధ కారణాలతో  పలుమార్లు తిరస్కరిస్తున్నారని, అలాగే నిర్ణేత సమయంలో క్లెయింలను పరిష్కరించడం లేదని పీఎఫ్‌ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.

Published : 07 Dec 2022 12:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈపీఎఫ్‌ (EPF) ఖాతాదారులకు శుభవార్త. సభ్యులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఈపీఎఫ్‌ఓ (EPFO) చర్యలు తీసుకుంటోంది. పీఎఫ్‌ క్లెయింలను తర్వగా పరిష్కరించడం కోసం ప్రాసెసింగ్‌లో జాప్యాన్ని తగ్గించాలని, ఒకే క్లెయింను పదేపదే తిరస్కరించకుండా చూసుకోవాలని తమ ఫీల్డ్‌ కార్యాలయాలను కోరింది. ఈపీఎఫ్‌ఓ ఫీల్డ్‌ ఆఫీసులకు ఇటీవల విడుదల చేసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

పీఎఫ్‌ క్లెయింలను వివిధ కారణాలతో  పలుమార్లు తిరస్కరిస్తున్నారని, అలాగే నిర్ణేత సమయంలో క్లెయింలను పరిష్కరించడంలేదని పీఎఫ్‌ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో క్లెయింలు పదేపదే తిరస్కరణకు గురికాకుండా కఠినమైన మార్గదర్శకాలను నిర్దేశించింది.

ఈ నియమాల ప్రకారం ప్రతి క్లెయింనూ మొదటిసారే క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ క్లెయిం సరిగ్గా లేకపోతే తిరస్కరించవచ్చు. అయితే తిరస్కరణకు గల అన్ని కారణాలను ఒకేసారి ఈపీఎఫ్‌ సభ్యుడికి తెలియజేయాలి. 

ప్రాంతీయ లేదా అదనపు పీఎఫ్‌ కమిషనర్‌ వారి అధికారిక పరిధిలోని పీఎఫ్‌ క్లెయింల తిరస్కరణ బాధ్యత వహిస్తారు. ప్రతినెలా తిరస్కరణకు గురైన క్లెయింలలో 50 లేదా 1%, ఏది ఎక్కువగా ఉంటే.. అన్ని క్లెయింలను విశ్లేషించి సంబంధిత డేటాను సమీక్ష కోసం జోనల్‌ కార్యాలయానికి సమర్పించాలి. 

గతేడాదిలో ఈపీఎఫ్‌ఓ దాదాపు 4 కోట్ల క్లెయింలను క్లియర్‌ చేసింది. ఈపీఎఫ్‌ సభ్యులు వివిధ కారణాల (ఇల్లు నిర్మాణం, వివాహం, ఉద్యోగం కోల్పోవడం)తో పీఎఫ్‌ మొత్తాన్ని పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ విత్‌డ్రా చేసుకునే వీలుంది. విత్‌డ్రా కోసం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాంకేతికంగా పీఎఫ్‌ క్లెయింలను 20 రోజుల్లోపు పరిష్కరించవచ్చు. బ్యాంకు ఖాతా వివరాలు, కేవైసీ, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడంతో పీఎఫ్‌ క్లెయింలు తరచూ తిరస్కరణకు గురవుతుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని