ఏది అవ‌స‌ర‌ రుణం, ఏది అన‌వ‌స‌ర‌ రుణం? ఎలా తెలుసుకోవాలి?

మ‌న ఆకాంక్ష‌ల‌ను సాకారం చేసుకోవ‌డంలో, అనేక జీవిత ల‌క్ష్యాల‌ను సాధించ‌డంలో రుణాలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి.

Updated : 22 Feb 2022 15:11 IST

సాధార‌ణంగా ఎవ‌రైనా రుణాలు తీసుకోవ‌డం స‌హ‌జ‌మే. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఇలా రుణాలు తీసుకోవ‌డం అత్యవ‌స‌రం అనిపిస్తుంది కూడా. అయితే, దేని గురించి తీసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. రుణం తీసుకోవ‌డం అన్న‌ది కూడా ఒక ఆర్ధిక నిర్ణ‌య‌మే. మ‌న ఆకాంక్ష‌ల‌ను సాకారం చేసుకోవ‌డంలో, అనేక జీవిత ల‌క్ష్యాల‌ను సాధించ‌డంలో రుణాలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి.

కొంత‌మంది ఎప్పుడూ కూడా క్రెడిట్ మీదే ఆధార‌ప‌డ‌తారు. డ‌బ్బు ఆదాచేసి, ఆ త‌ర్వాత ఖ‌ర్చు చేయ‌డానికి వేచి ఉండ‌రు. కొన్ని అప్పులు అన‌వ‌స‌ర‌మైన ఒత్తిడికి దారితీసి బాధ్య‌త‌గా మార‌తాయి. అందువ‌ల్ల ఆర్ధిక నిర్ణ‌యాలు తీసుకోవాల‌నుకునే ఎవ‌రైనా అవ‌స‌ర రుణం, అన‌వ‌స‌ర రుణాల మ‌ధ్య వ్య‌త్యాసాన్ని తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం.

అవ‌స‌ర రుణం:
కొత్త‌గా వివాహం అయిన వారు ఇంటికి సంబంధించిన ముఖ్య‌మైన సామాన్లు, ఫ‌ర్నీచ‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్ వ‌స్తువులు రుణం మీద తీసుకున్నారు అనుకుందాం. ఇవ‌న్నీ కూడా రోజువారీ జీవితంలో ఉప‌యోగ‌ప‌డేవే కాబ‌ట్టి రుణం తీసుకోక త‌ప్ప‌దు. కానీ వారి నెల ఆదాయాన్ని బ‌ట్టి `ఈఎమ్ఐ`లు చెల్లించ‌గ‌లిగే స్థాయిలో ఆ కుటుంబీకులు ఉండాలి. ఆ `ఈఎమ్ఐ` వారి నెల నిక‌ర ఆదాయాన్ని, వారి అత్య‌వ‌స‌ర ఖ‌ర్చులు  దాటి ఉంటే అది అన‌వ‌స‌ర‌ రుణం కిందే లెక్క‌. వారు ఆర్ధిక ఒత్తిడికి గుర‌వ‌తారు.

ఒక‌రు గృహ రుణం తీసుకున్నారు అనుకుందాం. గృహం, దానికి సంబంధించిన స్థ‌లం విలువ పెరిగేదేకాని దాదాపుగా త‌గ్గ‌దు. రుణం తీసుకున్నా కూడా రుణం తీరిన త‌ర్వాత భ‌విష్య‌త్తులో చాలా విలువైన‌ ఆస్తి వారి చేతుల్లో ఉంటుంది. గృహంలో నివాసం ఉండొచ్చు. దీనివ‌ల‌న వారు శాశ్వ‌త స్థిర‌త్వం ఏర్ప‌ర‌చుకున్న‌ట్టే, ఇది అవ‌స‌ర రుణ‌మే.

ఒక‌రు విద్యా రుణం తీసుకున్నారు. ఆ కోర్స్ పూర్తయ్యాక గ‌డువుని బ‌ట్టి రుణం తిరిగి చెల్లించ‌వ‌చ్చు. త‌ర్వాత వారి జీవిత‌మే మారిపోతుంది. విద్యారుణం తీసుకున్న‌వారికే కాకుండా ఇంటిల్లిపాదికీ ఆర్ధిక భ‌రోసా దొరుకుతుంది. ప్ర‌స్తుతం విద్య‌కున్న విలువ‌ను బ‌ట్టి విద్యారుణంతో చ‌దువుకున్న వారు భ‌విష్య‌త్తులో మంచి ఆర్ధిక శ‌క్తిగా మారే అవ‌కాశాలున్నాయి. ఈ విద్యా రుణం కూడా అత్యంత అవ‌స‌ర రుణ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు.

అలాగే, వ్యాపారంలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి రుణం తీసుకోవ‌డం మంచి రుణంగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. ఇందులో రిస్క్‌లు ఉండ‌వ‌చ్చు. కాని వారు బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తే రిస్క్‌ల‌ను ఎదుర్కొవ‌చ్చు. భ‌విష్య‌త్తులో అధిక రాబ‌డుల‌ను సాధించ‌వ‌చ్చు.

అన‌వ‌స‌ర రుణం :
అన‌వ‌స‌ర రుణం గురించి చెప్పుకోవాలంటే.. ఒక వ్య‌క్తి యొక్క ఆర్ధిక శ్రేయ‌స్సుపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపే రుణంగా నిర్వ‌చించ‌బ‌డింది.

ఒక ల‌గ్జ‌రీ కారు గాని, మోటారు బైక్ గాని రుణంతో కొనుగోలు చేయ‌డం. మొత్తం లోన్ వినియోగ‌దారుని నెల‌వారీ, వార్షిక‌ ఆదాయం కంటే అస‌మానంగా ఎక్కువ‌గా ఉంటే, అన‌వ‌స‌ర రుణంగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. అలాగే మోటారు వాహ‌నాలు కాలం గ‌డిచే కొద్ది విలువ‌ త‌గ్గేవే కాని పెరిగేవి కావు. అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైన `ఏటీఎం`లో డ‌బ్బులు విత్‌డ్రా చేసినా కూడా అది అన‌వ‌స‌ర రుణ‌మే. దీనికి వ‌డ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ అప్పులు గుదిబండ‌లా మారే అవ‌కాశ‌ముంది. అధిక వ‌డ్డీ రుణాల‌ను కూడా చెడ్డ రుణంగా, అన‌వ‌స‌ర రుణంగా చెప్ప‌వ‌చ్చు.

కొద్ది మంది షేర్ మార్కెట్‌లో లాభాల‌ను చూసి లేక ఎవ‌రో చెప్ప‌గా విని అప్పులు తెచ్చి మ‌రీ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డులు పెడుతుంటారు. వీటికి లాభాలు వ‌స్తాయ‌ని గానీ, వీరు ఆశించినంత లాభాలు గ్యారంటీగా వ‌స్తాయ‌ని గాని లేదు. కొన్నిసార్లు మార్కెట్ ప‌డిపోవచ్చు. వ‌డ్డీల మీద రుణాలు తెచ్చి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం చాలా పెద్ద త‌ప్పు. ఇది గ్యారంటీగా అన‌వ‌స‌ర రుణ‌మే.

చాలా మంది వ్య‌క్తులు వ‌డ్డీ రేటు కంటే మెరుగైన రాబ‌డిని ఆశించి స్థిరాస్తిలో పెట్టుబ‌డులు పెడుతుంటారు. స్థిరాస్తి అనేది దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి, దీనిలో రుణాలు తీసుకుని పెట్టుబ‌డి పెడితే స్వ‌ల్ప‌కాలానికి ఆశించినంత లాభాలు రాక‌పోగా చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు ఎక్కువ క‌ట్ట‌డం జ‌రుగుతుంది. కాబ‌ట్టి ఈ రుణం కూడా స‌రైన‌ది కాదు.

చివ‌ర‌గా:

ఒక‌రి ఆర్ధిక ప‌రిస్థితిని బ‌ట్టి ఒక‌రి మంచి అప్పు మ‌రొక‌రికి చెడుగా (అన‌వ‌స‌రంగా) ఉంటుంది. మంచి రుణం త‌ప్ప‌నిస‌రిగా ఆర్ధిక స్వేచ్ఛ‌ను పొందేందుకు, దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికి ఉత్త‌మ మార్గాల‌లో ఒక‌టి. మీ ప్ర‌స్తుత ఆర్ధిక ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా అంచ‌నా వేయ‌డం, ప్ర‌స్తుత రుణం దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాన్ని ఎలా అంద‌చేస్తుందో అంచ‌నా వేయ‌డం చాలా ముఖ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని