Electric vehicles: ఈ దశాబ్దం మొత్తం ఈవీ విక్రయాల్లో వృద్ధి: సీఐఐ, కేపీఎంజీ నివేదిక

భారత్‌లో విద్యుత్‌ వాహన విక్రయాలు పుంజుకుంటున్నాయని.. అది వచ్చే పదేళ్ల పాటు స్థిరంగా కొనసాగుతుందని ప్రముఖ నివేదిక తెలిపింది. డబ్బులు ఆదా అవుతాయని వినియోగదారులు భావించినపుడే విక్రయాలు గణనీయంగా పుంజుకుంటాయని పేర్కొంది.

Published : 17 Apr 2023 21:40 IST

ముంబయి: భారత్‌లో విద్యుత్‌ వాహన (Electric vehicles- EV) విక్రయాల్లో వృద్ధి ఈ దశాబ్దం మొత్తం కొనసాగుతుందని కేపీఎంజీ, సీఐఐ సంయుక్తంగా తయారు చేసిన నివేదిక పేర్కొంది. పెట్రోల్‌, డీజిల్‌ ఆధారిత వాహనాలతో పోలిస్తే ఈవీల కొనుగోలు వల్ల డబ్బు ఆదా అవుతుందని వినియోగదారులు భావించిన సమయంలో విక్రయాలు గణనీయంగా పుంజుకుంటాయని తెలిపింది.

క్రమంగా ఈవీల (Electric vehicles)వైపు మళ్లాలనుకోవడంలో వినియోగదారుల్లో ఇక ఏమాత్రం సందేహం లేదని నివేదిక తెలిపింది. అయితే, అది ఎప్పుడు అనేదే ఇప్పుడు కీలక అంశంగా మారిందని పేర్కొంది. కొత్త ఈవీ మోడళ్లు, ఛార్జింగ్‌ వసతుల కల్పన, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో రానున్న రోజుల్లో విక్రయాలు గణనీయంగా పుంజుకుంటాయని తెలిపింది. విద్యుత్‌ వాహన విప్లవంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని చెప్పింది. వాహనాల్లో ఎక్ట్రానిక్స్‌ పరికరాల సంఖ్య 16 శాతం నుంచి 55 శాతానికి పెరిగినట్లు తెలిపింది. కొత్త ఫీచర్లు, నియంత్రణలు జతవుతున్న కొద్దీ మరిన్ని ఎలక్ట్రానిక్స్‌ చేరతాయని పేర్కొంది.

ఇప్పుడు కొత్తగా వాహనాల్లో అమర్చుతున్న అనేక రకాల అధునాత ఫీచర్లు, సాంకేతికతలు రానున్న రోజుల్లో ప్రామాణికంగా మారతాయని నివేదిక తెలిపింది. కొత్త ఫీచర్లు, సాంకేతికతలు జత చేయడం ఒక నిరంతర ప్రక్రియగా మారుతుందని పేర్కొంది. 2030 నాటికి ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగంలో 80 శాతం, వాణిజ్య వాహనాల్లో 70 శాతం, బస్సుల్లో 40 శాతం, కార్లలో 30 శాతం విద్యుత్‌ వాహనాలే (Electric vehicles) ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిన విషయాన్ని నివేదిక గుర్తుచేసింది. దీన్ని ప్రోత్సహించడం కోసం ‘ఫేమ్‌’ వంటి ప్రోత్సాహకాలను రూపొందించినట్లు తెలిపింది.

ఈవీల (Electric vehicles) రాకతో టెక్నాలజీ రంగంలోనూ అనేక మార్పులు వచ్చాయని నివేదిక తెలిపింది. కొత్త సాంకేతికతలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొంది. అలాగే వ్యాపార, ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడుతున్నాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని