Published : 09 May 2022 21:48 IST

EV Fire Incidents: అందుకే విద్యుత్‌ వాహనాల్లో మంటలు! నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌

దిల్లీ: ఇటీవల దేశవ్యాప్తంగా విద్యుత్‌ వాహనాలు మంటల్లో చిక్కుకున్న ఘటనలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్‌డీఓ మాజీ చీఫ్‌ వీకే సారస్వత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్‌ వాహనాల కోసం దిగుమతి చేసుకున్న బ్యాటరీల్లోని సెల్‌లు మన దేశ పరిస్థితులకు అనుకూలంగా లేవేమోనని అభిప్రాయపడ్డారు. అధిక ఉష్ణోగ్రతలు, ఉష్ణమండల వాతావరణానికి అనుకూలంగా వాటిని రూపొందించకపోవడం, నాణ్యత లేమి కారణంగా ఈ ఘటనలు జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాటిని దేశీయంగా ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

‘బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న సాంకేతికత. అయితే, దేశీయ తయారీ ప్లాంట్‌లను వీలైనంత త్వరగా నెలకొల్పాలి. ఇక్కడ తయారు చేసే సెల్‌లు.. అధిక ఉష్ణోగ్రత కలిగిన స్థానిక పరిస్థితులను తట్టుకుని ఉండేలా చూసుకోవాలి’ అని ఓ వార్తాసంస్థకు చెప్పారు. ఇప్పటికే కొన్ని దేశాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే సెల్‌లను అభివృద్ధి చేశాయన్నారు. మరోవైపు విదేశాలనుంచి దిగుమతి చేసుకునే బ్యాటరీ సెల్‌ల విషయంలో పకడ్బందీ స్క్రీనింగ్ వ్యవస్థతోపాటు కఠినమైన పరీక్షా విధానాలూ అమలు చేయాలని సూచించారు.

ఈవీలలో అగ్రగామిగా మారేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను ఈ ఘటనలు బలహీనపరుస్తాయా అనే ప్రశ్నకు సారస్వత్ బదులిస్తూ.. ఈ తరహా ప్రమాదాలు ఆటోమొబైల్ రంగంలో బ్యాటరీల ప్రవేశంపై కొంత ప్రభావం చూపుతాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా విద్యుత్తు ద్విచక్ర వాహనాలు మంటల్లో చిక్కుకున్న ప్రతి ఘటనపై దర్యాప్తు చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణే ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మంత్రి నితిన్ గడ్కరీ ఇదే విషయమై మాట్లాడుతూ.. ఈ ఘటనలపై నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని