Education Loan: కోర్స్ మాత్రమే కాదు.. ప్రయాణ ఖర్చులకు కూడా..!

బ్యాంకులు..ఉన్న‌త విద్య కోసం యూనివ‌ర్సిటికీ చెల్లించే ఫీజుతో పాటు, విదేశాలు వెళ్లేందుకు ప్ర‌యాణ ఖ‌ర్చులు, ఇత‌ర ఖ‌ర్చుల‌ను కూడా లెక్కించి..వాటిని కోర్సు ఫీజుతో పాటు విదేశీ విద్యా రుణంలో చేర్చుతాయి.

Updated : 22 Jul 2022 17:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార‌తీయ విద్యార్థులు విదేశాల‌కు వెళ్లి చ‌దువుకునేందుకు.. బ్యాంకులు విద్యా రుణం ఆఫ‌ర్ చేస్తున్నాయి. అయితే, కోర్సుకు అయ్యే ఖ‌ర్చు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా.. ప్ర‌యాణం, వ‌స‌తి, ఇత‌ర ఖ‌ర్చుల‌కు డ‌బ్బు సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటారు. ఇందుకు అయ్యే ఖ‌ర్చు కూడా ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి అర్హ‌త ఉండి కూడా వెన‌క‌డుగు వేస్తుంటారు. అయితే, బ్యాంకులు కేవ‌లం కోర్సుకు అయ్యే ఖ‌ర్చు కోస‌మే కాకుండా ఇత‌ర ఖ‌ర్చుల‌కు రుణం ఇస్తుంటాయి. అస‌లు విదేశీ విద్య కోసం రుణం తీసుకునే వారికి.. బ్యాంకులు ఏయే ఖ‌ర్చుల‌కు నిధులు ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బ్యాంకులు.. ఉన్న‌త విద్య కోసం యూనివ‌ర్సిటీ/క‌ళాశాల‌కు చెల్లించే ఫీజుతో పాటు, విదేశాలు వెళ్లేందుకు ప్ర‌యాణ ఖ‌ర్చులు, ఇత‌ర ఖ‌ర్చుల‌ను కూడా లెక్కించి.. వాటిని కోర్సు ఫీజుతో పాటు విదేశీ విద్యా రుణంలో చేర్చుతాయి. అయితే, వీటికి కొన్ని ప‌రిమితులు ఉండొచ్చు. అలాగే మొత్తం రుణానికి కూడా గ‌రిష్ఠ ప‌రిమితి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ విద్య కోసం గ‌రిష్ఠ‌ంగా రూ.20 ల‌క్ష‌లు ఆఫ‌ర్ చేస్తుండ‌గా, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా రూ.50 ల‌క్ష‌లు, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.30 ల‌క్ష‌లు ఆఫ‌ర్ చేస్తోంది.

లైబ్రరీ, లెబొరేటరీ, పుస్తకాలు వంటి వాటికి ఇచ్చే రుణంపై కూడా గ‌రిష్ఠ ప‌రిమితి ఉంటుంది. చాలా వ‌ర‌కు బ్యాంకులు మొత్తం కోర్సు ఫీజులో ఇటువంటి ఖ‌ర్చుల‌కు 20 శాతం మించ‌కుండా చూస్తాయి. అలాగే కంప్యూట‌ర్ వంటి వ‌స్తువుల‌ కొనుగోలుకు స‌హేతుక‌మైన ధ‌ర‌ల‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. కొన్ని యూనివ‌ర్సీటీలు.. రీఫండ‌బుల్ డిపాజిట్లు (ముందుగా స్వీక‌రించి.. నిర్దిష్ట స‌మ‌యం త‌ర్వాత తిరిగి చెల్లించే డిపాజిట్లు) కోరుతుంటాయి. కొన్ని బ్యాంకులు వీటికి కూడా నిధులు ఇస్తుంటాయి. అయితే, వీటికి గ‌రిష్ఠ ప‌రిమితి ఉంటుంది. చాలా వ‌ర‌కు బ్యాంకులు రీఫండ‌బుల్ డిపాజిట్ల‌కు మొత్తం కోర్సు ఫీజులో 10 శాతం మించ‌కూడ‌ద‌ని చెబుతుంటాయి. 

ఉదాహ‌ర‌ణ‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే విదేశీ విద్యారుణం.. ఎస్‌బీఐ గ్లోబ‌ల్ అడ్వాంన్‌టేజ్ (SBI Global Ed-Vantage)ను తీసుకుంటే.. ఇది యూఎస్ఏ, యూకే, కెన‌డా, సింగ‌పూర్‌, జ‌పాన్‌, హాంకాంగ్‌, న్యూజిల్యాండ్‌తో పాటు ప‌లు యూరోపియ‌న్ దేశాల‌లో విదేశీ విద్య కోసం రుణం ఆఫ‌ర్ చేస్తుంది. ఆయా దేశాల‌లో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, డాక్ట‌రేట్ వంటి ప‌లు కోర్సుల‌కు.. కాలేజ్ ఫీజుతో పాటు హాస్టల్, విద్యార్థి విదేశాలు వెళ్లేందుకు అయ్యే ప్ర‌యాణ ఖ‌ర్చు, అక్క‌డ ఉండేందుకు వ‌స‌తి (హాస్ట‌ల్‌) ఖ‌ర్చుల‌ను ఇస్తుంది.

దీంతో పాటు పరీక్ష, పుస్తకాలు, పరికరాలు, యూనిఫాంలు, కంప్యూటర్ (సహేతుకమైన ధరతో), కోర్సు పూర్తి చేసేందుకు చేయాల్సిన ఇత‌ర కోర్సులు (స్టడీ టూర్లు, ప్రాజెక్ట్ వర్క్, థీసెస్‌) మొదలైన వాటితో సహా వివిధ రుసుములను విద్యా రుణంలో చేర్చి ఇస్తుంది. అయితే వీటి కోసం మొత్తం ట్యూష‌న్ ఫీజులో 20 శాతం వ‌ర‌కు పరిమితి ఉంటుంది. కాష‌న్ డిపాజిట్‌, బిల్డింగ్ ఫండ్‌, రీఫండ‌బుల్ డిపాజిట్ వంటి వాటికి మొత్తం ట్యూష‌న్ ఫీజులో 10 శాతానికి మించ‌కుండా ఇస్తుంది. అలాగే, విదేశీ విద్య కోసం కనీసం రూ. 7.50 ల‌క్ష‌లు ఇస్తుండ‌గా, గ‌రిష్ఠంగా రూ.1.50 కోట్లు ఆఫ‌ర్ చేస్తుంది.

చివ‌రిగా.. విదేశీ విద్యా రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేవారు.. కేవ‌లం ట్యూష‌న్ ఫీజు మాత్ర‌మే కాకుండా ఇత‌ర ఖ‌ర్చుల‌కు సంబంధించిన ఖ‌ర్చుల‌ను అంచనా వేసి దానికి సంబంధించిన ప‌త్రాల‌ను, కావాల్సిన ఇత‌ర ప‌త్రాల‌తో పాటు బ్యాంకుకి అందించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని