Layoffs: ప్రతి నలుగురిలో ఒకరికి లేఆఫ్ భయం..

ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోతుందనే భయాందోళనకు గురవుతున్నట్లు తాజా సర్వే ఒకటి వెల్లడించింది.

Published : 26 Jan 2023 01:35 IST

దిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఇప్పుడు దిగ్గజ సంస్థలన్నీ లేఆఫ్‌ల (Layoffs) బాట పడుతున్నాయి. కంపెనీ వ్యయాల్లో అధిక భాగం ఉద్యోగుల జీతభత్యాలే కావడంతో భారీ సంఖ్యలో కోతలు ప్రకటిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందేమోనని ఉద్యోగులు కలవరపడుతున్నారు. మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు లేఆఫ్‌ల గురించి భయపడుతున్నారని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. ఇక, మిగతా ముగ్గురు ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందుతున్నారని పేర్కొంది.

దేశ బడ్జెట్‌ (Union Budget 2023)పై మార్కెటింగ్‌ డేటా అండ్‌ అనలిటిక్స్‌ సంస్థ కాంటార్‌ (Kantar) నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థపై సర్వే నిర్వహించగా.. మెజార్టీ ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారు. 2023లో ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందుతుందని 50శాతం మంది విశ్వసిస్తున్నారు. 31శాతం మాత్రం వృద్ధి నెమ్మదిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రపంచ ఆర్థిక మందగమనం, కొవిడ్‌ ముప్పు మళ్లీ తప్పదేమో అనే అంచనాలపై భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నలుగురిలో ముగ్గురు ధరల పెరుగుదలపై కలవరపడుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు రాబోయే బడ్జెట్‌ (Budget 2023)లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించాలని వారు కోరుకుంటున్నారు. ఇక, ప్రతి నలుగురిలో ఒకరు లేఆఫ్‌ ముప్పు గురించి భయపడుతున్నారు’’ అని సర్వే వెల్లడించింది.

ఆదాయపు పన్ను పరిమితి పెంచుతారా?

ఇక, వచ్చే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను (Income Tax)లో విధానపరమైన మార్పులకు ప్రకటనలు వెలువడే అవకాశముందని అధిక మంది అభిప్రాయపడుతున్నారని సర్వేలో తేలింది. ‘‘ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి (ప్రస్తుతం రూ.2.5లక్షల వరకు ఉంది)ని పెంచొచ్చని చాలా మంది ఆశాభావంతో ఉన్నారు. వేతన జీవుల్లో 42శాతం మంది పరిమితి పెంచే అవకాశాలున్నాయని చెప్పారు’’ అని కాంటార్‌ సర్వే వెల్లడించింది. ఇక, 80సీ చట్టం కింద పెట్టుబడులకు పన్ను రిబేట్‌ను పెంచాలని 2/3 వంతుల మంది కోరుకుంటున్నారని తెలిపింది.

ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా 12 ప్రధాన నగరాల్లో 2022 డిసెంబరు 15 నుంచి ఈ ఏడాది జనవరి 15 వరకు కాంటార్‌ ఈ సర్వే చేపట్టింది. 21 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు గ్రూప్‌ వారి నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని