UK Economic Crisis: బ్రిటన్‌లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం.. సంక్షోభం ఎక్కడ మొదలైంది?

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన బ్రిటన్‌ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. లిజ్‌ ట్రస్‌ రాజీనామాతో అది తారస్థాయికి చేరినట్లు అర్థమవుతోంది. 

Updated : 21 Oct 2022 14:07 IST

‘‘నా విధానాలకు అందరూ మద్దతుగా నిలవకపోవచ్చు. కానీ, వాటి వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు. దేశ ఆర్థికాభివృద్ధే నా ఏకైక ప్రాధాన్యం. ఈ సమయంలో పన్నుకోత నైతికంగానేగాక ఆర్థికంగానూ సరైన నిర్ణయం. తిరిగి మనం పూర్వవైభవం సంతరించుకుంటామన్నది సుస్పష్టం’’ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లిజ్‌ ట్రస్‌ (Liz truss) చేసిన తొలి ప్రసంగంలోని కీలక వ్యాఖ్యలు.

‘‘మేం తప్పులు చేశామని గుర్తించాం. ఆ తప్పిదాలకు నన్ను క్షమించండి. ఇప్పటికే వాటిని సరిచేసుకున్నాను. ఆర్థిక స్థిరత్వ చర్యలను పునరుద్ధరించాం. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం’’ మినీ బడ్జెట్‌ వైఫల్యం తర్వాత ట్రస్‌  (Liz truss) చేసిన వ్యాఖ్యలివి.

‘‘ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయాను. అందుకే  వైదొలగుతున్నాను’’ చివరగా తన రాజీనామాను ప్రకటిస్తూ ట్రస్‌ (Liz truss) చెప్పిన మాటలు.

ఇదంతా కేవలం 44 రోజుల్లోనే జరిగిపోయింది. దీన్ని బట్టి బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ ఎంతటి సంక్షోభం (UK Economic Crisis)లో ఉందో చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చిన నెలన్నర వ్యవధిలోనే హామీలను నెరవేర్చలేనని ప్రధానే స్వయంగా అంగీకరించారంటే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతటి గందరగోళం నెలకొందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ పరిస్థితికి చేరుకోవడానికి దారి తీసిన కారణాలేంటి?

2008 నాటి ఆర్థిక సంక్షోభం..

గత 500 ఏళ్లలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ స్థిరత్వానికి పెట్టని కోటగా నిలిచింది. ప్రపంచ యుద్ధాలు, ప్రపంచ వ్యాప్తంగా దేశాలను కాలనీలుగా మార్చడం, మహమ్మారులు, అంటువ్యాధులు.. ఇలా అనేక సంక్షోభ సమయాల్లో కూడా లండన్ పునాదులు పటిష్ఠంగా నిలిచాయి. ఇది అంతర్జాతీయ బ్యాంక్‌లను ఆకర్షించింది. హెచ్‌ఎస్‌బీసీ, బార్‌క్లేస్‌, స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యలయాలన్నీ అక్కడే కొలువుదీరాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇవన్నీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తున్నాయి. దీనికి పరిష్కారంగా బ్రిటన్‌ ప్రభుత్వం ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచాలని భావించింది. ఉదాహరణకు.. గృహరుణ రేట్లను 6.3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది. కొన్ని నెలల క్రితం వడ్డీరేట్లు 1.25 శాతం వరకు పడిపోయాయి. దీంతో వ్యవస్థలో ద్రవ్యలభ్యత ఎక్కువై ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా ద్రవ్యోల్బణానికి దారితీసే పరిస్థితులు తలెత్తాయి. తిరిగి దీనికి పరిష్కారంగా యూకే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా కొవిడ్‌-19 సంక్షోభం తర్వాత రుణరేట్లను 14 ఏళ్ల గరిష్ఠానికి చేర్చింది. దీంతో రుణాలు తీసుకున్న కుటుంబాలు తమ ఆదాయంలో దాదాపు మూడోవంతు వాయిదాల చెల్లింపులకే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.

బ్రెగ్జిట్‌..

ఒకప్పుడు ఐరోపా సమాఖ్యలో బ్రిటన్‌ భాగంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో అనేక వాణిజ్య రాయితీలు, ప్రోత్సాహకాలు ఉండేవి. మరోవైపు, ఒకదేశ వృద్ధికి నైపుణ్యం ఉన్న మానవ వనరులు చాలా ముఖ్యం. బ్రెగ్జిట్‌కు ముందు ఐరోపా దేశాల్లోని చాలా మంది నిపుణులు యూకేకు వెళ్లి స్వేచ్ఛగా పనిచేసుకునేవారు. కానీ, బ్రెగ్జిట్‌ తర్వాత వారి రాక నిలిచిపోయింది. ఐరోపా మార్కెట్‌ను కోల్పోతామనే భయంతో కొన్ని కంపెనీలు బ్రిటన్‌ను వదిలి వెళ్లిపోయాయి. ఫలితంగా తయారీ ఖర్చు పెరిగి.. ద్రవ్యోల్బణానికి దారితీసిన కారణాల్లో ఇదొకటిగా నిలిచింది. అదే సమయంలో కరోనా విరుచుకుపడడంతో యూకే ఆర్థిక వ్యవస్థ ‘స్టాగ్‌ఫ్లేషన్‌’ దశకు చేరుకుంది. (అంటే నిరుద్యోగం పెరగడం, ఆర్థిక వృద్ధి ఆగిపోవడం, ద్రవ్యోల్బణం ఎగబాకడం)

కొత్త ప్రభుత్వం..

బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని పదవి నుంచి వైదొలగడానికి ముందే బ్రిటన్‌ ఆర్థిక కష్టాలు తీవ్రమయ్యాయి. ఆయన తర్వాత వచ్చిన లిజ్‌ ట్రస్‌ చేపట్టిన పన్ను సంస్కరణలు, వ్యాపారాలపై నియంత్రణలను తగ్గించడం వంటి ప్రయోగాలు బెడిసికొట్టాయి. ధనవంతులపై ఉన్న 45 శాతం పన్నును గణనీయంగా తగ్గించారు. కార్పొరేట్‌ పన్నును వచ్చే ఏడాది నుంచి 25 శాతం నుంచి 19 శాతం మధ్యలోకి కుదిస్తానని చెప్పారు. ఇది ప్రజల ఆగ్రహానికి దారి తీసింది. పన్ను కోతల్ని అమలు చేస్తే ఆదాయం తగ్గి.. ప్రభుత్వం కొత్తగా అప్పులు తేవాల్సి ఉంటుంది. పైగా నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకోనున్నారనే అంశంపై ట్రస్‌ స్పష్టమైన వివరాలేమీ వెల్లడించలేదు. ఈ నిర్ణయాలు వివాదం కావడంతో లిజ్‌ ట్రస్‌ మాటమార్చారు. ఆర్థిక మంత్రిపైకి తప్పును తోసి పదవి నుంచి తొలగించారు. ధనవంతులపై 45 శాతం పన్ను, కార్పొరేట్‌ పన్ను 25 శాతంగా కొనసాగుతుందని ప్రకటించారు.

ప్రస్తుతం ఇదీ పరిస్థితి..

స్థిరత్వమే బ్రిటన్‌ ప్రధాన బలంగా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు అదే ప్రమాదంలో పడింది. దీంతో మదుపర్లు పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవడం మొదలుపెట్టారు. ఫలితంగా కరెన్సీ విలువ భారీగా పతనమైంది. దేశ ఆర్థిక పరిస్థితిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సైతం బ్రిటన్‌ను హెచ్చరించింది. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం బ్రిటన్‌ చరిత్రలో అత్యంత తీవ్రమైన వాటిలో ఒకటి. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ద్రవ్యోల్బణం 9.90 శాతంగా నమోదై 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. విద్యుత్తు బిల్లులు 100 శాతానికి పైగా పెరిగాయి. పౌండ్‌ విలువ ఇటీవలి కాలంలో 24 శాతం పతనమై అత్యంత చెత్త పనితీరు కనబరిచిన కరెన్సీగా నిలిచింది. రష్యా నుంచి గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడం బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. ఇదే సమయంలో శీతాకాలం రావడంతో ఇంధన వినియోగం ఒక్కసారిగా పెరిగింది. దీంతో ధరలు అమాంతం పైకెగశాయి. అయితే, రష్యా నుంచి గ్యాస్‌, చమురు సరఫరా నిలిచిపోవడంతో విద్యుదుత్పత్తి ఖర్చు పెరిగి కంపెనీల నష్టాలు భారీగా పెరిగాయి. దీంతో తాజా బడ్జెట్‌లో విద్యుత్తు ధరల పరిమితిని ఒక్కో మెగావాట్‌ హవర్‌పై (MWH) 520 పౌండ్లకు పెంచారు. పైగా పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ఒకే ధరను నిర్ణయించారు. ఇది ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది. సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత ఎదురవడంతో ట్రస్‌ వైదొలగక తప్పలేదు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని