Quiet quitting: క్వైట్‌ క్విట్టింగ్‌.. ఉద్యోగుల్లో ఏంటీ కొత్త ట్రెండ్‌?

Quiet quitting: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు క్వైట్‌ క్విట్టింగ్‌ అనే పదం బాగా వినిపిస్తోంది. చాలా మంది ఉద్యోగులు కేవలం తమ పాత్రకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఏమాత్రం అదనపు బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.....

Updated : 22 Aug 2022 13:42 IST

Quiet quitting: కొవిడ్‌-19 వ్యక్తిగత జీవితాలనే కాకుండా వృత్తిపరమైన అభిరుచులనూ మార్చింది. 2021 ఏప్రిల్‌ నుంచి ఏప్రిల్‌ 2022 మధ్య ఒక్క అమెరికాలోనే దాదాపు 7.16 కోట్ల మంది ఉద్యోగాలు మారారు. ప్రపంచవ్యాప్తంగానూ ఈ ట్రెండ్‌ కనిపించింది. దీన్నే ‘గ్రేట్‌ రెసిగ్నేషన్‌’గా వ్యవహరించారు. అయితే, ఇలా ఉద్యోగాలు మారడమే కాదు.. తమ పనిభారాన్ని కూడా తగ్గించుకుంటున్నారు ఉద్యోగులు . దీన్నే ఇప్పుడు ‘క్వైట్‌ క్విట్టింగ్‌ (Quiet quitting)’గా వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్‌ ప్రపంచంలో, సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఈ పదంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే, భారత్‌లో మాత్రం ఈ పోకడ తక్కువగానే ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతుండడం గమనార్హం.

క్వైట్‌ క్విట్టింగ్‌ అంటే..

పదం సూచిస్తున్నట్లుగా.. నెమ్మదిగా ఉద్యోగం నుంచి జారుకోవడం అని దీని అర్థం కాదు. పనిభారాన్ని తగ్గించుకొని.. కేవలం వారి పాత్ర ఎంత వరకో అక్కడికి మాత్రమే పరిమితం కావడం. ముఖ్యంగా కొవిడ్‌ తర్వాత వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో భాగంగానే ఉద్యోగులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వ్యక్తిగత లక్ష్యాల కోసం కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి మరీ పనిచేసేవారు. కానీ, ఇప్పుడు ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నారు. అన్నింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ.. ఎక్కడా అదనపు బాధ్యతల్ని తమ భుజాన వేసుకోవడానికి కార్పొరేట్‌ ఉద్యోగులు ఇష్టపడడం లేదని నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే, ఈ క్రమంలో ఉద్యోగులు తమ బాధ్యతలను మాత్రం మరవడం లేదు. పనిని నిర్లక్ష్యం చేయడం లేదు. కానీ, ‘ఉద్యోగమే జీవితం’ అనే సూత్రాన్ని మాత్రం అంగీకరించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇది కొత్తా?

క్వైట్‌ క్విట్టింగ్‌ (Quiet quitting) అనే పదం మాత్రమే కొత్తది. ఈ విధానం మాత్రం ఎప్పటి నుంచో ఉంది. వ్యక్తిగత, వృత్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించాలన్నది ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి. కానీ, ఇప్పుడు ఇది బాగా ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం టిక్‌ టాక్‌ సహా ఇతర సామాజిక మాధ్యమాలు.

ఎందుకు ఈ పరిస్థితి?

క్వైట్‌ క్విట్టింగ్‌ (Quiet quitting)కు చాలా కారణాలున్నాయి. ఉద్యోగంలో అసంతృప్తి, ధరలు పెరిగినప్పటికీ.. ఇంకా తక్కువ వేతనాలు ఇవ్వడం, సరైన గుర్తింపు లేకపోవడం, మెరుగైన భవిష్యత్తుకు సరైన అవకాశాలు లేకపోవడం, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించడం.. వంటివి క్వైట్‌ క్విట్టింగ్‌కు ప్రధాన కారణాలని కార్పొరేట్‌ ఉద్యోగులు పలు సర్వేల్లో వెల్లడించారు. ఉద్యోగంలో తమ పాత్రకు మించి పనిచేసినా.. సరైన గుర్తింపు లేకపోవడం వల్ల పనిపై ఉద్యోగులకు శ్రద్ధ తగ్గుతోందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తమ కనీస పనిని పూర్తి చేయడం వరకు మాత్రమే పరిమితమవుతున్నారని పేర్కొన్నారు.

కొవిడ్‌ ప్రభావం..

కొవిడ్‌ సంక్షోభంలో చాలా మంది ఇంటి నుంచి పనిచేశారు. ఇది చాలా మంది ఉద్యోగులకు సౌకర్యంగా మారింది. అదే సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసేశాయి. మరికొన్ని కంపెనీలు వేతనాలు తగ్గించాయి. మరోవైపు ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో చాలా కంపెనీలు తిరిగి కార్యాలయాలకు రావాలని ఆదేశిస్తున్నాయి. అయితే, ఉద్యోగులను మాత్రం ఇంకా మహమ్మారి భయాలు వీడలేదు. ఒకసారి కొవిడ్‌ సోకడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులకు తమ పనిపై ఆసక్తి తగ్గింది. ఇంత కష్టపడితే కంపెనీలు ఇస్తున్న ప్రయోజనాలు అంతంతమాత్రమేనన్న అభిప్రాయం బలపడింది. ఇదే క్వైట్‌ క్విట్టింగ్‌కు దారితీసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి టిక్‌టాక్‌ సహా సామాజిక మాధ్యమాలు జత కావడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. కేవలం ఉద్యోగంలో తమ పాత్ర ఎంత వరకో.. అక్కడికి మాత్రమే పరిమితం కావాలన్న వాదనకు టిక్‌టాక్‌ సహా ఇతర వేదికలపై యువ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

ఎలా గుర్తించడం?

ఉద్యోగుల్లో ఉత్సాహం తగ్గడం, ఉత్పాదకత పడిపోవడం, ఎక్కువ పనిగంటలు చేయడానికి విముఖత, అదనపు భత్యాలు లేకపోతే.. ఇతర బాధ్యతలు తీసుకోవడానికి నిరాకరించడం, ఇతరుల స్థానంలో పనిచేయడానికి ఇష్టపడకపోవడం, పనిలో ఆలస్యంగా చేరడం, తొందరగా వెళ్లిపోవడం, ఈమెయిళ్లు, కాల్స్‌కు సరిగా స్పందించకపోవడం.. వంటి లక్షణాలు చాలా మంది ఉద్యోగుల్లో ఉంటే దాన్ని క్వైట్‌ క్విట్టింగ్‌గా కంపెనీలు గుర్తించవచ్చని నిపుణులు తెలిపారు. అయితే, ఈ లక్షణాలన్నీ కచ్చితంగా క్వైట్‌ క్విట్టింగ్‌గా భావించాల్సిన అవసరం లేదని.. కొందరు బద్ధకం వల్ల కూడా ఇలా చేస్తుంటారని తెలిపారు. పరిస్థితిని క్షుణ్నంగా అధ్యయనం చేయడం వల్ల కారణం తెలుసుకోవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని