Exports: డిసెంబరు ఎగుమతుల్లో 12% తగ్గుదల

డిసెంబరు నెలకు సంబంధించి రెండు కీలక స్థూల  ఆర్థిక గణాంకాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఎగుమతులు తగ్గడం ప్రతికూలాంశం కాగా.. టోకు ద్రవ్యోల్బణం 22 నెలల కనిష్ఠానికి చేరడం సానుకూలాంశం.

Published : 16 Jan 2023 17:33 IST

దిల్లీ: భారత ఎగుమతులు (Exports) 2022 డిసెంబరులో 12.2 శాతం కుంగి 34.48 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 39.27 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. సోమవారం కేంద్ర వాణిజ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది. అదే సమయంలో దిగుమతులు (Imports) సైతం 60.33 బిలియన్‌ డాలర్ల నుంచి 58.44 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మొత్తంగా గత నెలలో వాణిజ్య లోటు (Trade deficit) 23.89 బిలియన్‌ డాలర్లకు చేరింది. క్రితం ఏడాది ఇది 21.10 బి.డాలర్లుగా ఉంది. 2022 నవంబరుతో పోలిస్తే మాత్రం డిసెంబరు వాణిజ్య లోటు (Trade deficit) దాదాపు సమానంగా ఉండడం గమనార్హం.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- డిసెంబరు మధ్య దేశ మొత్తం ఎగుమతుల (Exports) విలువ తొమ్మిది శాతం పెరిగి 332.76 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దిగుమతులు (Imports) 24.96 శాతం ఎగబాకి 551.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారత ఎగుమతులు (Exports) మాత్రం పెరిగాయని కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి సునీల్‌ బర్థ్‌వాల్‌ తెలిపారు.


డిసెంబరులో 22 నెలల కనిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (WPI Inflation) 2022 డిసెంబరులో 4.95 శాతానికి దిగివచ్చింది. ఇది 22 నెలల కనిష్ఠ స్థాయి. 2021 ఫిబ్రవరిలో నమోదైన 4.83 శాతం తర్వాత ఇదే తక్కువ కావడం గమనార్హం. ఈ ఏడాది మే నుంచి తగ్గుతూ వచ్చిన డబ్ల్యూపీఐ.. అక్టోబరులో ఏక అంకె స్థాయి (8.39%)లో నమోదైంది. ఆహార పదార్థాలు, కూరగాయలు, నూనెగింజల ధరలు తగ్గడం వల్లే గత నెలలో డబ్ల్యూపీఐ తగ్గిందని విశ్లేషకులు వెల్లడించారు.

* గత నెల కూరగాయలు, ఉల్లి ధరలు తగ్గడంతో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణ రేటు 1.25 శాతం మేర తగ్గింది. గోధుమలు, పప్పు దినుసులు, బంగాళాదుంపలతో పాటు ప్రోటీన్‌ ఆహారమైన పాలు, గుడ్లు, మాంసం, చేపలు ధరలు ఇంకా అధికంగానే ఉన్నాయి.

* కూరగాయల ద్రవ్యోల్బణ రేటు 35.95% శాతానికి దిగివచ్చింది.

* ఆహారేతర వస్తువుల్లో నూనెల ద్రవ్యోల్బణం 4.18 శాతం, ఖనిజాలు 2.93 శాతానికి తగ్గింది.

* ఇంధనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణ రేటు స్వల్పంగా పెరిగి 18.09 శాతానికి, తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 3.37 శాతంగా నమోదైంది.

* పెట్రోలియం, సహజవాయువు సెగ్మెంట్‌లో నవంబరులో నమోదైన 48.23 శాతం నుంచి డిసెంబరులో 39.71 శాతానికి తగ్గింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని