పెన్ష‌న‌ర్ల‌ లైఫ్ స‌ర్టిఫికెట్‌ సమర్పణ గడువు పొడిగింపు

జీవన ధ్రువీకరణ ప‌త్రాన్ని స‌మ‌ర్పించే వ్య‌వ‌ధిని కేంద్రం పొడిగించింది.

Updated : 01 Jan 2022 15:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌స్తుత కొవిడ్‌-19 ప‌రిస్థితుల కార‌ణంగా కేంద్ర ప్ర‌భుత్వ పెన్ష‌న‌ర్ల‌కు లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువును కేంద్ర ప్ర‌భుత్వం మ‌ళ్లీ పొడిగించింది. తుది గడువును ఫిబ్ర‌వ‌రి 28గా నిర్ణయించింది. ఈ పొడిగించిన కాలంలో కూడా పెన్ష‌న్ చెల్లింపులు నిరంత‌రాయంగా జరుగుతాయి. అంత‌కు ముందు జీవన ధ్రువీకరణ పత్రం (జీవ‌న్ ప్ర‌మాణ్‌) స‌మ‌ర్ప‌ణ చివ‌రి తేదీ డిసెంబంర్ 31 వరకు విధించిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో కొన‌సాగుతున్న కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి దృష్ట్యా పెద్ద వ‌య‌స్సు గ‌ల పెన్ష‌న‌ర్లు వేగంగా క‌రోనా వైర‌స్ బారిన ప‌డే అవ‌కాశ‌మున్నందున సిబ్బంది, ప్ర‌జా ఫిర్యాదులు, పెన్ష‌న్ల మంత్రిత్వ‌శాఖ కార్యాల‌యం తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం పెన్ష‌న్ లైఫ్ స‌ర్టిఫికెట్‌ను సమర్పించడానికి వ్య‌వ‌ధిని పెంచారు.

ప్ర‌తి కేంద్ర ప్ర‌భుత్వ పింఛ‌నుదారుడూ పెన్ష‌న్‌ను కొన‌సాగించ‌డానికి న‌వంబ‌ర్ నెల‌లో వార్షిక జీవన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. అయితే ఎక్కువ మంది పెన్ష‌న‌ర్లు ఒకేసారి రాకుండా ఉండ‌టానికి ఇంత‌కుముందు ప్ర‌భుత్వం 80 ఏళ్లు, అంత‌కంటే ఎక్కువ వ‌య‌స్సున్న కేంద్ర ప్ర‌భుత్వ పెన్ష‌న‌ర్ల‌ను ప్ర‌తి సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 1 నుంచి కాకుండా అక్టోబ‌ర్ 1 నుంచి వార్షిక జీవన ధ్రువీకరణ పత్రాన్ని స‌మ‌ర్పించ‌డానికి అనుమ‌తించింది.

లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పణకు ఉన్న ఐదు వేర్వేరు పద్ధతులు

1. పెన్ష‌న‌ర్ భౌతికంగా పెన్ష‌న్ డిస్బ‌ర్సింగ్ అథారిటీ ముందు హ‌జ‌రైతే వారి లైఫ్ స‌ర్టిఫికెట్‌ను బ్యాంకులు రికార్డు చేస్తాయి.

2. పెన్ష‌న‌ర్ ప్ర‌భుత్వం నియ‌మించిన అధికారి సంత‌కం చేసిన లైఫ్ స‌ర్టిఫికెట్‌ ఫారమ్‌ సమర్పించినట్లయితే వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రి ముందూ స్వ‌యంగా హాజ‌రు కాన‌వ‌స‌రం లేదు.

3. పెన్ష‌న‌ర్లు జీవ‌న్ ప్ర‌మాణ్ పోర్ట‌ల్ ద్వారా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో లైఫ్ స‌ర్టిఫికెట్‌ను సమర్పించొచ్చు. యూఐడీఏఐ ఒక వ్య‌క్తి బ‌యోమెట్రిక్‌ల‌ను తీసుకోవ‌డానికి అనుమ‌తించిన అన్ని బ‌యోమెట్రిక్ ప‌రిక‌రాల వివ‌రాల‌ను అందించింది. అటువంటి అన్ని ప‌రిక‌రాల స‌మాచారాన్ని పొంద‌డానికి పెన్ష‌న‌ర్లు యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

4. పోస్ట్‌మ్యాన్ ద్వారా డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్‌ను స‌మ‌ర్పించ‌డానికి పోస్ట‌ల్ శాఖ‌కు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) డోర్‌స్టెప్ స‌ర్వీస్‌ను ప్రారంభించింది.

5. ఈజ్ ఆఫ్ బ్యాంకింగ్ సంస్క‌ర‌ణ‌ల కింద దేశంలోని 100 ప్ర‌ధాన న‌గ‌రాల్లో త‌న ఖాతాదార్ల‌యిన పెన్ష‌న‌ర్ల‌ కోసం డోర్‌స్టెప్ బ్యాంకింగ్‌ చేసే 12 ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని