ఇల్లు కొనుగోలు చేస్తున్నారా? అయితే ఇది మీకోసం

ఆస్తి కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ ఆశ పడుతుంటారు. అది కొందరికి సులభంగా సాధ్యమైతే మరికొందరికి ఆర్థికంగా భారం కావచ్చు. అలాగే ఒక సొంత ఇల్లు ఉండాలనేది కూడా ప్రతి ఒక్కరి కోరిక. ఈ క్రమంలో అనేక ఖర్చులను ఎదుర్కోవలసి ఉంటుంది....

Updated : 02 Jan 2021 17:00 IST

ఆస్తి కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ ఆశ పడుతుంటారు. అది కొందరికి సులభంగా సాధ్యమైతే మరికొందరికి ఆర్థికంగా భారం కావచ్చు. అలాగే ఒక సొంత ఇల్లు ఉండాలనేది కూడా ప్రతి ఒక్కరి కోరిక. ఈ క్రమంలో అనేక ఖర్చులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇల్లు కొనుగోలు చేసే సమయంలో అసలు ఆస్తి విలువ కాకుండా చెల్లించవలసిన అదనపు వ్యయాలను మీకోసం కింద తెలియచేస్తున్నాము.

రిజిస్ట్రేషన్ ఫీజు:

ఆస్తిని మీ పేరు మీదకు మార్చుకోడానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ స్థానికంగా ఉన్న సబ్ - రిజిస్టార్ కార్యాలయంలో జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఆస్తి విలువలో 0.5 శాతం నుంచి 4 శాతం వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఆస్తి రకం ఆధారంగా ఒక్కో రాష్టంలో ఒక్కో విధంగా మారుతూ ఉంటుంది.

స్టాంప్ డ్యూటీ:

స్టాంప్ డ్యూటీ అనేది ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను. ఇది అన్ని రకాల చట్టపరమైన ఆస్తి లావాదేవీలకు వర్తిస్తుంది. ఇది ఆస్తి విలువలో 3 శాతం నుంచి 8 శాతంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు మాదిరిగానే ఇది కూడా ఆస్తి రకం ఆధారంగా ఒక్కో రాష్టంలో ఒక్కో విధంగా మారుతూ ఉంటుంది. ఆస్తి ఒప్పంద విలువ లేదా ఆస్తి మార్కెట్ విలువ ఆధారంగా స్టాంప్ డ్యూటీ నిర్ణయించబడుతుంది.

జీఎస్టీ:

అమ్మకం పన్ను, వ్యాట్ లాంటి ఇతర పరోక్ష పన్నులను భర్తీ చేసి తెరపైకి వచ్చిన పన్ను జీఎస్టీ. నిర్మాణంలో ఉన్న ఆస్తులకు 12 శాతం జీఎస్టీ చెల్లించవలసి ఉంటుంది. అదే నిర్మాణం పూర్తై ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఆస్తులపై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

మధ్యవర్తి ఫీజులు:

మీరు ఒక ఆస్తిని కొనడానికి లేదా విక్రయించడానికి ఒక మధ్యవతిని నియమించుకున్నట్లైతే, అతను మీ కోసం విక్రేతదారుని లేదా కొనుగోలుదారుని కనుగొని, మీ తరపున చర్చలు జరిపినందుకు గాను ఆస్తి విలువలో 1 నుంచి 2 శాతం డబ్బును సదరు మధ్యవర్తికి చెల్లించవలసి ఉంటుంది.

నిర్వహణ ఛార్జీలు:

మీరు సంవత్సరానికి ఒక చదరపు అడుగుకి గాను రూ.1.5 నుంచి రూ.3 వరకు నిర్వహణ ఛార్జీలను బిల్డరుకు చెల్లించవలసి ఉంటుంది.

ఆలస్య చెల్లింపులపై వడ్డీ:

బిల్డరుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, మీరు చెల్లించవలసిన సొమ్మును ఆలస్యంగా చెల్లించినట్లైతే అప్పుడు మీరు బిల్డరుకు సంవత్సరానికి 18 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీ చెల్లించవలసి ఉంటుంది.

సదుపాయాలు:

కారు పార్కింగ్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ లాంటి సదుపాయాలు కావాలంటే మీరు అదనంగా చెల్లించవలసి ఉంటుంది. సదుపాయాలు లేదా ఆస్తి ఉన్న ప్రాంతం ఆధారంగా వీటి విలువ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని