Facebook: మెటాలో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం

ట్విటర్‌ బాటలోనే మెటా కూడా నడవనుంది. త్వరలోనే సంస్థకు చెందిన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించనుంది. 

Updated : 07 Nov 2022 10:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాలో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ కోతలు వేల సంఖ్యలోనే ఉండొచ్చని ఆంగ్లపత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో పేర్కొంది. నవంబర్‌ 9వ తేదీన ఈ అంశంపై మెటా నుంచి ప్రకటన వెలువడవచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పినట్లు తెలిపింది. సెప్టెంబర్‌ 30వ తేదీ నాటి గణాంకాల ప్రకారం ప్రస్తుతం మెటాలో ప్రపంచ వ్యాప్తంగా 87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మూడో త్రైమాసిక ఫలితాల్లో మెటా వాటాదారులను నిరాశపర్చింది. ఈ సందర్భంగా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ మాట్లాడుతూ 2023 వరకు ఉద్యోగుల సంఖ్యను పెంచబోమని.. స్వల్పంగా తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి పరిశ్రమలో ఇతర టెక్‌ సంస్థలు అనుసరిస్తున్నట్లే నియామకాలు తగ్గించుకోవడమో.. లేదా ఉద్యోగుల సంఖ్యలో కోత విధించుకోవడమే చేయవచ్చు.

గత వారం సిలికాన్‌ వ్యాలీలో పలు సంస్థలు భారీగా లేఆఫ్‌లను ప్రకటించాయి. మరోవైపు అమెజాన్‌ సంస్థ కార్పొరేట్‌ ఆఫీస్‌లో కొత్త నియామకాలను నిలిపివేసినట్లు పేర్కొంది. ట్విటర్‌ మరో వైపు దాదాపు 3,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టింది. మరోవైపు ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి చర్యలు ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సంస్థల వాణిజ్య ప్రకటనల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మెటా లాభం 52 శాతం కుంగి 4.4 బిలియన్‌ డాలర్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని