రుణ వాయిదాలు చెల్లించ‌లేని గ‌డ్డుకాలంలో వెసులుబాటు!

శ్రీకాంత్‌ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. 2013లో బ్యాంకు నుంచి రుణం తీసుకొని ఇల్లు కొన్నాడు. ఖర్చు తగ్గింపులో భాగంగా కంపెనీ నిర్ణయం అతని పాలిట శాపం అయ్యింది. జీతభత్యాలు కోతకు గురయ్యాయి. ఫలితం… నాలుగు నెలలుగా రుణ వాయిదాలు కట్టలేకపోతున్నాడు. బ్యాంకు నుంచి నోటీసు

Published : 15 Dec 2020 22:31 IST

బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న‌వారు కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ వాయిదాల‌ను తీర్చ‌లేక‌పోవ‌చ్చు. ఇలాంటి గ‌డ్డు ప‌రిస్థితుల్లో కొంత కాలానికి చెల్లింపుల‌ను వాయిదా వేసుకునే అవ‌కాశాలు లేవా? మార్గాలున్నాయోమో చూద్దాం...

అప్పు చేసి కొన్న ఇల్లు… రుణ వాయిదాలు చెల్లించలేని పరిస్థితి… ఇప్పుడేం చేయాలి? ఇల్లు వేలానికి వెళ్లాల్సిందేనా? ఉందా ప్రత్యామ్నాయం?

శ్రీకాంత్‌ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. 2013లో బ్యాంకు నుంచి రుణం తీసుకొని ఇల్లు కొన్నాడు. ఖర్చు తగ్గింపులో భాగంగా కంపెనీ నిర్ణయం అతని పాలిట శాపం అయ్యింది. జీతభత్యాలు కోతకు గురయ్యాయి. ఫలితం… నాలుగు నెలలుగా రుణ వాయిదాలు కట్టలేకపోతున్నాడు. బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది. ఈ గడ్డు పరిస్థితి నుంచి ఎలా బయట పడాలో అర్థం కావట్లేదు అతనికి.

శ్రీధర్‌ది మరో వ్యథ. 2014లో ఫ్లాట్‌ కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల పున‌ర‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ వ‌ల్ల స్థిరాస్తి రంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అతని బిల్డర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేశాడు. శ్రీధర్‌కు ఫ్లాటు అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. అదే సమయంలో బ్యాంకు నుంచి ఈఎంఐ బకాయీలు తక్షణం చెల్లించాలని నోటీసు వచ్చింది. అటు ఉంటున్న ఇంటికి అద్దె… ఇటు బ్యాంకు వాయిదాలు… ఏం చేయాలో పాలుపోవట్లేదు.

చాలామంది రుణ గ్రహీతలు నెలవారీ వాయిదాల చెల్లింపునకు ఇబ్బందులు ప‌డుతుండ‌వ‌చ్చు. ఇలాంటి స్థితిని సమర్థంగా ఎదుర్కొని అటు రుణ గ్రహీతలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ… బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులను సాధ్యమైనంత మేరకు కట్టడి చేసేందుకు రిజర్వు బ్యాంకు పలు పథకాలను ప్రవేశపెట్టింది. కష్టకాలంలో ఉన్న రుణ గ్రహీతలకు వారి రుణ ఖాతాలను పునర్‌వ్యవస్థీకరించుకునే వెసులుబాటు కల్పించింది. పారిశ్రామిక రంగానికి, చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు, ఇతరత్రా కార్పొరేట్లకు ఇది ఇప్పటికే ఉంది. దీనిని మరింత విస్తృతంగా అన్ని రుణాలకు వర్తింప చేసే దిశలో రిజర్వుబ్యాంకు వాణిజ్య బ్యాంకులకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.

వెసులుబాటుంది
రుణ గ్రహీత ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఈఎంఐలు కట్టలేని స్థితిలో ఆ రుణ ఖాతాలను పునర్‌వ్యవస్థీకరించేందుకు బ్యాంకులు వెసులుబాటు కల్పిస్తున్నాయి. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలతోపాటు ఇతరత్రా రిటైల్‌ రుణాలకు ఈ అవకాశం ఉంది. పునర్‌వ్యవస్థీకరించిన రుణ ఖాతాలను అంతకుముందు ఏ విధంగా వర్గీకరించారో ఆ తర్వాత కూడా అదే విధంగా కొనసాగుతాయి.

ఉదాహరణకు అంతకుముందు ఒక రుణ ఖాతాను స్టాండ‌ర్డ్‌ అసెట్‌ (రుణ కిస్తులు సమయానికి అందుతూ ఎన్‌పిఎ రహితంగా ఉన్నటువంటిది)గా వర్గీకిస్తే… పునర్‌వ్యవస్థీకరణ తర్వాత కూడా ఈఎంఐలు చెల్లించకపోయినప్పటికీ… అది స్టాండర్డ్‌ అసెట్‌గానే ఉంటుంది. అంటే… కొంత కాలం వరకూ వర్గీకరణ మారదన్నమాట. ఆ ఖాతా ఎన్‌పీఏగా మారే అవకాశం లేనందువల్ల బ్యాంకులు కూడా రుణ చెల్లింపులపై ఒత్తిడి చేయవు. సాధారణంగా రుణ చెల్లింపుల్లో జాప్యం జరిగినా, డిఫాల్టరయినా బ్యాంకులు అపరాధ రుసుము విధిస్తాయి. రీషెడ్యూల్‌ చేసిన ఖాతాలపై అటువంటి వేమీ ఉండవు.

ఏం చేయాలంటే…
రుణ పునర్‌వ్యవస్థీకరణ, రీ షెడ్యూల్‌మెంట్‌ వంటి సదుపాయాల్ని బ్యాంకులు ఒక ప్రత్యేక లక్ష్యంతో పరిమిత కాలానికి మాత్రమే అందిస్తున్నాయి. ఈ అవకాశాన్ని పొందడం కోసం రుణ గ్రహీత పెద్దగా శ్రమ పడాల్సిన పనిలేదు. బ్యాంకుల చుట్టూ పదేపదే తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు. రుణ గ్రహీత చేయాల్సిందల్లా ఒక్కటే. ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారో ఆ శాఖకు వెళ్లి ఒక దరఖాస్తు ఇవ్వడమే. ఆ దరఖాస్తులో రుణ ఖాతా వివరాలు తెలియజేస్తూ… ఈఎంఐ చెల్లించడంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు వివరించాలి. రుణ ఖాతాను రీ షెడ్యూలింగ్‌కు స్వీకరించాల్సిందిగా కోరాలి. ఈఎంఐలను ఎప్పటి నుంచి తిరిగి చెల్లించగలరో కూడా బ్యాంకుకు తెలియజేయాలి.

దీనికి అర్హత పొందాలంటే…
* పునర్‌వ్యవస్థీకరణ (రీస్ట్రక్చరింగ్‌) లేదా రీ షెడ్యూల్‌ చేయదలిచిన రుణ ఖాతాలు స్టాండర్డ్‌ అసెట్‌గా వర్గీకరించి ఉండాలి. అంటే… అప్పటిదాకా రుణ ఖాతాలో నెలవారీ వాయిదాలు సరైన సమయానికి చెల్లించి ఉండాలన్నమాట.
* ఈఎంఐలు చెల్లించలేకపోవడానికి చూపిన కారణాలు హేతుబద్ధంగా ఉండాలి.
* రుణ ఖాతాలో గతంలో చెల్లింపులు సకాలంలో జరిపి ఉండాలి. చెల్లింపుల ట్రాక్‌ రికార్డ్‌ సజావుగా ఉండాలి.
మారటోరియం పెంచుకోవచ్చు
బ్యాంకులు రుణాల చెల్లింపులకు ఇచ్చే విరామాన్ని మారటోరియం అంటారు. రుణ వితరణ చేసినప్పటి నుంచి రుణ గ్రహీత ఈఎంఐ చెల్లింపులు ప్రారంభించే సమయానికి మధ్య ఉన్న వ్యవధే మారటోరియం. బ్యాంకులు సాధారణంగా గృహరుణాలకు 18 నెలలదాకా మారటోరియం కల్పిస్తాయి. ఈ మారటోరియం నిర్మాణంలో ఉన్న ఇల్లు లేదా ఫ్లాట్‌కు మాత్రమే వర్తిస్తుంది. పూర్తయిన ఇళ్లకు, పాత ఇళ్లు, లేదా ఫ్లాట్‌ కొనుగోళ్లకు ఇచ్చే రుణాలకు వర్తించదు. కొత్త ఫ్లాట్‌ లేదా ఇంటి నిర్మాణానికి కనీసం 8 నెలల నుంచి 12 నెలలదాకా ఆయా ప్రాజెక్టులను బట్టి సమయం పడుతుంది. కాబట్టి, నిర్మాణ పనులు పూర్తయి రుణ గ్రహీతకు ఆ ఫ్లాట్‌ అప్పగించిన తర్వాతే ఈఎంఐ ప్రారంభమయ్యే విధంగా బ్యాంకులు మారటోరియం వ్యవధిని నిర్ణయిస్తాయి. కొన్ని సందర్భాలలో ముందుగా అనుకున్న ప్రకారం నిర్మాణ పనులు పూర్తి కాక రుణ గ్రహీతకు ఫ్లాట్‌ లేదా ఇంటిని అందజేయలేకపోవచ్చు. .

బ్యాంకుదే తుది నిర్ణయం
రుణ ఖాతాల రీషెడ్యూల్‌ ప్రతిపాదనలను ఆమోదించాలా లేదా అనే విషయంలో బ్యాంకులు నిష్పక్షపాతంగా స్వేఛ్చగా నిర్ణయాలు తీసుకోవాలి. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణ గ్రహీతలకు అందజేయడంలో బ్యాంకులు విజ్ఞతతో వ్యవహరించాలని, అర్హులందరికీ ఈ సదుపాయం అందేలా చూడాలని రిజర్వుబ్యాంకు సూచించింది.

వేలం వేయాలంటే…
బ్యాంకులు వాటికి తనఖా పెట్టిన స్థిరాస్తిని కోర్టు ప్రమేయం లేకుండానే వేలం వేసి బకాయీలను వసూలు చేసుకునేందుకు అవకాశం ఉంది. 2002లో ప్రభుత్వం సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ ఇంటరెస్ట్‌ చట్టాన్ని తెచ్చింది. బ్యాంకులు నిరర్థక ఆస్తులుగా మారిన రుణాలను వదిలించుకుని బకాయీలను పూర్తిగా వసూలు చేసుకునేందుకు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంది. ఎన్‌పీఏలుగా మారిన రుణ ఖాతాదారులకు ముందుగా ‘రీకాల్‌’ నోటీసులు జారీచేయాల్సి ఉంటుంది.

ఈ నోటీసులో రుణ మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ అందుకు 60 రోజులు గడువు ఇవ్వాలి. ఆ గడువు తీరేలోపు బకాయీల మొత్తం చెల్లించినట్లయితే… కథ సుఖాంతం అవుతుంది. లేకుంటే బ్యాంకు తనకు తనఖా పెట్టిన స్థిరాస్తిని వేలం వేసే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ మేరకు ప్రముఖ దినపత్రికల్లో వేలం వివరాలను తెలుపుతూ ప్రకటన జారీ చేస్తుంది. వేలం ప్రక్రియ పూర్తయిన తర్వాత తద్వారా వచ్చిన మొత్తాన్ని రుణ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. వేలం వేయగా వచ్చిన సొమ్ము రుణ బకాయీల కంటే ఎక్కువగా ఉంటే బకాయీల చెల్లింపులు జరిగిన తర్వాత మిగిలిన సొమ్మును రుణ గ్రహీత ఖాతాకు జమ చేస్తారు. తక్కువ వస్తే… మిగిలిన మొత్తాన్ని రుణ గ్రహీత చెల్లించాల్సి ఉంటుంది.

నిరర్థక ఆస్తి అంటే…
రుణ ఖాతాలో వరుసగా 90 రోజుల వరకూ అసలు, వడ్డీ జమ కాకుండా ఉంటే… ఆ రుణ ఖాతాని నిరర్థక ఆస్తి (నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్‌)గా గుర్తిస్తారు. రుణ ఖాతా ఎన్‌పీఏగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులకు ఎంతుందో… రుణ గ్రహీతలకు కూడా అంతే ఉంది. ఎందుకంటే రుణ ఖాతా ఎన్‌పీఏగా మారితే ఆ ఖాతాదారునికి భవిష్యత్తులో కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకులు వెనకాడుతాయి. క్రెడిట్‌ రేటింగ్‌ కూడా తగ్గుతుంది. బకాయిదారుల జాబితాలో చేర్చితే ఇబ్బందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని