Health Insurance: ఆరోగ్య బీమా ప్రీమియంను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి..?

ఆరోగ్య బీమా సంస్థలు, పాలసీదారునికి సంబంధించి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రీమియం లెక్కింస్తుంటాయి. కాబట్టి ప్రీమియం అందరికీ ఒకేలా ఉండదు.

Published : 13 Feb 2023 18:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో బీమాపై (Insurance) అవగాహన పెరిగింది. ముఖ్యంగా ఆరోగ్య బీమా. పెరుగుతున్న వైద్య ఖర్చులతో ఆరోగ్య బీమా లేకపోతే.. చికిత్స చేయించుకోవడం చాలా కష్టం అవుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలి. అయితే ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ మంది ప్రీమియం ఎంత అనేదే చూస్తారు. కానీ ప్రీమియం అనేది అందరికీ ఒకేలా ఉండదు. వేరు వేరు వ్యక్తులకు వేరు వేరుగా ఉంటుంది. వ్యక్తి నేపథ్యం, ఇతర అంశాల ఆధారంగా ప్రీమియం మారుతుంటుంది. కాబట్టి ఆరోగ్య బీమా సంస్థలు ప్రీమియంను లెక్కించేటప్పుడు ముఖ్యంగా ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయనేది తెలుసుకోవడం ముఖ్యం. దీని ద్వారా ప్రీమియం తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు.

వయసు..

ఆరోగ్య బీమా తీసుకునే వ్యక్తులకు 20 నుంచి 30 ఏళ్ల వయసు గోల్డెన్‌ ఇయర్స్‌గా చెప్పుకోవచ్చు. ఈ వయసులో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. క్లెయిమ్‌లు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వయసులో బీమా సంస్థలు తక్కువ ప్రీమియంతో త్వరిత గతిన పాలసీలను జారీ చేస్తుంటాయి.  వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ వయసున్న వారికి అధిక ప్రీమియంతో పాలసీలను జారీ చేస్తుంటాయి. కొన్ని బీమా సంస్థలు అయితే నిర్దిష్ట వయసు దాటిన తర్వాత పాలసీ జారీ చేసేందుకు సుముఖత చూపవు.

ముందుగా ఉన్న వ్యాధులు..

ఆరోగ్య బీమా తీసుకోవడానికి ముందు.. 48 నెలల్లో గుర్తించిన వ్యాధులను ముందుగా నిర్ధారించిన వ్యాధులు ( ప్రీ-ఎగ్జిస్టింగ్‌ డిసీసెస్‌) అంటారు. పాలసీ తీసుకునే సమయానికి మీకు రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్‌ వంటివి నిర్ధారణ అయ్యి ఉంటే అవి ప్రీ-ఎగ్జిస్టింగ్‌ డీసీసెస్‌ కిందకి వస్తాయి. 

ప్రమాద సంభావ్యతను అంచనా వేసి బీమా సంస్థలు పాలసీలను అందిస్తాయి. అయితే ప్రీ-ఎగ్జిస్టింగ్‌ డిసీసెస్‌ ఉన్నవారు ఇతర అనారోగ్యాల భారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో క్లెయిమ్‌లు పెరగొచ్చు. కాబట్టి ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని బీమా సంస్థలు ముందుగా ఉన్న అనారోగ్యాలకు కవరేజీని అందించడం లేదు. ఇందుకోసం సంబంధిత యాడ్‌-ఆన్‌లను కొనుగోలు చేయమని సూచిస్తున్నాయి. 

హామీ మొత్తం..

ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో బీమా సంస్థ నుంచి క్లెయిం చేయగల మొత్తం ఇది. మీ పాలసీ హామీ మొత్తం రూ. 5 లక్షలు, మీ ఆసుపత్రి బిల్లు రూ. 7 లక్షలు అయితే, మీరు పాలసీ నియమ నిబంధనలను అనుసరించి గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు మాత్రమే కవరేజీ పొందగలరు. మిగిలినది పాలసీదారుడే చెల్లించాలి. అందువల్ల హామీ మొత్తం ఎంత తక్కువగా ఉంటే ప్రీమియం కూడా అంత తక్కువగా ఉంటుంది. ఎక్కువ కవరేజీతో కూడిన పాలసీలకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అయితే పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణంతో చికిత్సలకు అయ్యే ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఎక్కవ కవరేజీ కూడిన పాలసీలను తీసుకోవడమే మంచిది. 

అధిక బీఎంఐ..

ఒక వ్యక్తి ఫిట్‌నెస్‌ను అంచనా వేసేందుకు ఆ వ్యక్తి బాడీ మాస్‌ ఇండెక్స్‌ (BMI)ను పరిశీలిస్తారు. అధిక బీఎంఐ అనేది గుండె జబ్బులు, శ్వాస సమస్యలు, కీళ్ల నొప్పులు, మొదలైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని సూచిస్తుంది. కాబట్టి వీరిని అధిక రిస్క్‌ ఉన్న వారిగా భావించి ప్రీమియం పెంచే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం పాలసీదారులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా ప్రోత్సహించేందుకు, ఊబకాయం వంటివి రాకుండా నియంత్రించేందు, జీవన శైలి మెరుగుపర్చుకునేందుకు అనేక ఫిట్‌నెస్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అలాగే ఇటువంటి వారి కోసం డిస్కౌంట్లు, రివార్డులను అందిస్తున్నాయి. 

ధూమపానం..

ధూమపానం ఆరోగ్యానికి హనికరం. ఊపిరితిత్తుల సమస్యలు, వంధత్వం, క్యాన్సర్‌ మొదలైన అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి క్లెయింలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి వారికి అధిక ప్రీమియంతోనే పాలసీలను జారీ చేస్తుంటారు.

సహ చెల్లింపులు..

ఆరోగ్య బీమాలో సహ చెల్లింపుల (కో-పేమెంట్‌) ఆప్షన్‌ ఎంచుకుంటే ప్రీమియం తగ్గుతుంది. అనారోగ్యం కారణంగా పాలసీదారుడు ఆసుపత్రితో చేరితే.. క్లెయిం మొత్తంలో నిర్దిష్ట శాతాన్ని బీమా చేసిన వ్యక్తి చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. కాబట్టి ప్రీమియం తగ్గుతుంది. కొన్ని పాలసీలు అంతర్గతంగా ఈ ఆప్షన్‌తో వస్తాయి. అయితే సాధ్యమైనంత వరకు సహ-చెల్లింపులు లేని పాలసీలను ఎంచుకోవడమే మంచిది.

మినహాయింపులు..

తక్కువ మినహాయింపులు ఉంటే, ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఆసుపత్రిలో చేరి 24 గంటల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు, మెడికల్‌ బిల్లు, ఐసీయూ ఛార్జీలు, గది అద్దె, డాక్టర్‌ ఫీజుతో సహా వైద్య ఖర్చులను పాలసీలు కవర్‌ చేస్తాయి. అయితే కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. మినహాయింపుతో కూడిన పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గొచ్చు. కానీ అవసరమైన సమయంలో ఈ బిల్లులే ఎక్కువ కావచ్చు.

ఇతర అంశాలు..

పైన తెలిపిన అంశాలే కాకుండా పాలసీదారుని పని ప్రదేశం, లింగం వంటి ఇతర అంశాలు కూడా ప్రీమియంను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. 

వృత్తి: సాధారణ కార్యాలయ ఉద్యోగులతో పోలిస్తే ఫ్యాక్టరీ లేదా తయారీ యూనిట్‌లో పనిచేసేవారు గాయాలు, అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారికి అధిక ప్రీమియం వసూలు చేయవచ్చు. బీమా సంస్థలు వృత్తిపరమైన ప్రమాదాలను కవర్‌ చేయవు.

ప్లాన్‌ రకం: మీరు ఎంచుకున్న ప్లాన్‌ కూడా ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. విస్తృతమైన కవరేజీతో, క్లిష్టమైన అనారోగ్యాలను కవర్‌ చేసే పాలసీలకు ప్రీమియం కాస్త ఎక్కువగా ఉండొచ్చు.

లింగం: మహిళలు, పురుషులు వారి వారి జీవనశైలి ఆధారంగా భిన్నమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొన్ని బీమా సంస్థలు మహిళలను రిస్క్‌ పాలసీదారులుగా పరిగణించవచ్చు. ఉదాహరణకు మహిళల విషయంలో గర్బధారణ, సూతి ఖర్చులు సంబంధిత క్లెయింలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇటువంటి కవరేజీలతో కూడిన పాలసీలకు ప్రీమియం కాస్త ఎక్కువ ఉండొచ్చు. 

యాడ్‌-ఆన్‌లు..

యాడ్‌-ఆన్‌లు అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. వీటి కోసం అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 

గుర్తుంచుకోండి..

పాలసీ దరఖాస్తు ఫారం నింపేటప్పుడు రిస్క్‌ ప్రొఫైల్‌ గురించి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. పాలసీదారుడు ఇచ్చిన సమాచారాన్ని అధ్యయనం చేసి, ప్రమాదస్థాయిని అంచనా వేసి ఎంత ప్రీమియం చెల్లించాలో బీమా సంస్థ తెలుపుతుంది. ఒకవేళ తప్పు సమాచారం ఇచ్చినా, ఏదైనా విషయం దాచిపెట్టినా పాలసీలు తిరస్కరణకు గురై మొదటికే ముప్పురావచ్చు. కాబట్టి ప్రీమియం కొంచెం ఎక్కువైన అన్ని సరైన వివరాలతో, సమగ్ర కవరేజీతో కూడిన పాలసీ తీసుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని