Investment: మదుపు చేసేటప్పుడు ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి?
మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్ చేసి రాబడిని ఆశించేటప్పుడు..ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
సాధారణంగా, సంపాదించే వయసులో ఉన్నవారు తమ డబ్బును ఖర్చు పెట్టడమే కాకుండా కొంత మదుపు కూడా చేస్తుంటారు. ఆర్జించిన డబ్బును పెట్టుబడి పెట్టకపోతే, ఆ డబ్బు ఇక పెరగదు. అంతేకాకుండా పన్నులు, ద్రవ్యోల్బణం, ఇతర వ్యయాలు డబ్బుకు సంబంధించిన నిజమైన విలువను కాలక్రమేణా తగ్గిస్తాయి. మీ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి లక్ష్యాలను సిద్ధం చేసుకోవడం ముఖ్యం. మీ పెట్టుబడి ప్రయాణం సాఫీగా సాగేందుకు సహాయపడే కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
పెట్టుబడిపై రిస్క్
పూర్తిగా రిస్క్ లేని పెట్టుబడి అంటూ ఏదీ లేదు. అన్ని పెట్టుబడులు కొంత స్థాయి రిస్క్‌ను కలిగి ఉంటాయి. ఉదాహరణకు బ్యాంకులు, పోస్టాఫీసు ఎఫ్‌డీలలో మదుపు చేస్తే రిస్క్ లేనప్పటికీ, రాబడి తక్కువ స్థాయిలో ఉంటుంది. దానిపై పన్నులు కూడా ఉంటాయి. ఇంకా ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ ఉంటుంది. దీంతో, వచ్చే వాస్తవ రాబడి గణనీయంగా తగ్గుతుంది. ఈక్విటీ పెట్టుబడులయితే రాబడి మెరుగ్గా ఉంటుంది...కానీ, దానికి తగ్గట్టుగా రిస్క్ ఉంటుంది. పెట్టుబడులు పెట్టడం కూడా ఒక గేమ్ లాంటిదే. దీనిలో విజయం సాధించాలంటే సరైన వ్యూహాలు రూపొందించుకోవాలి. సరైన పెట్టుబడితో జీవితాన్ని మార్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మదుపులో నేర్చుకోవడం అనేది ఆపకూడదు. పెట్టుబడులు పెట్టడం కూడా ఒక అభ్యాసం లాంటిదే. మెరుగైన ఫలితాల గురించి ప్రయత్నించాలి. మీరు కొంత రిస్క్ తీసుకుని అధిక రాబడుల గురించి చూస్తున్నట్లయితే, మీ పెట్టుబడులు కొద్దిగా భిన్నంగానే ఉండాలి.
డైవర్సిఫికేషన్
విభిన్న ఆస్తులు, రంగాలు, భౌగోళిక ప్రాంతాల్లో మీ పెట్టుబడులను విస్తరించే ప్రక్రియను డైవర్సిఫికేషన్ అంటారు. ఇది మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోకు సంబంధించిన మొత్తం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టినప్పుడు ఏ రకమైన పెట్టుబడిలో ఎంత శాతం పెట్టుబడి పెట్టారనే దాని ఆధారంగా పోర్టుఫోలియోకు వైవిధ్యత వస్తుంది. మ్యూచువల్ ఫండ్లు వాటి పెట్టుబడి వ్యూహాన్ని బట్టి వివిధ రంగాలకు చెందిన షేర్లలో పెట్టుబడి పెడతాయి, దీనివల్ల నష్టభయం తగ్గుతుంది. పెట్టుబడులు చేసే వర్గాల ఆధారంగా వైవిధ్యత ఆధారపడి ఉంటుంది. డైవర్సిఫికేషన్..స్టాక్స్, బాండ్‌లు, బంగారం, ఎఫ్‌డీలు విభిన్న ఆస్తి తరగతుల మధ్య మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను విభజించే ప్రక్రియ అని చెప్పొచ్చు.
కాలవ్యవధి
మీ పెట్టుబడి కాలవ్యవధి, అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించే సమయం. మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి స్వల్ప, మధ్యస్థ లేదా దీర్ఘకాలిక పెట్టుబడి కాలవ్యవధిని కలిగి ఉండొచ్చు. ఇది కొన్ని నెలల నుంచి అనేక దశాబ్దాల వరకు కూడా ఉంటుంది. మీ పెట్టుబడి వ్యూహం మీ కాలవ్యవధికి అనుగుణంగా ఉండాలి. ఉదా: అభివృద్ధి చెందడానికి అనువుగా ఉండే ప్రాంతంలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టారనుకుందాం. 1-2 దశాబ్దాలు వేచి ఉన్నవారికి మంచి ఆర్థిక ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఓపిక అనేది చాలా ప్రధానం, వెంటవెంటనే లాభాలు రావు అని గుర్తించాలి. అలాగే, ఈక్విటీల్లో కూడా 2-5 ఏళ్లు పెట్టుబడులు పెద్దగా లాభించకపోవచ్చు. మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు వేగంగా ఫలితాలను ప్రయత్నించడం అనేది పేలవమైన పెట్టుబడి ఫలితాలకు దారితీసే ప్రమాదకర వ్యూహం. బదులుగా మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా ఉండే దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాంపై దృష్టి పెట్టాలి. దీర్ఘకాల వ్యవధిలో లాభాలనేవి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.
క్రమశిక్షణ
విజయవంతమైన పెట్టుబడికి క్రమశిక్షణ, సహనం అవసరం. మార్కెట్‌లో పరిస్థితి అస్థిరంగా ఉన్నప్పటికీ మీ పెట్టుబడి వ్యూహానికి కట్టుబడి ఉండడం మంచిది. అంతేకాకుండా భావోద్వేగాలతో పెట్టుబడులు పెట్టకూడదు, ఇలాంటివి నష్టాలకు దారితీసే ప్రమాదం ఉంది. భయం/దురాశతో కూడిన పెట్టుబడి నిర్ణయాలు కూడా ఆశించిన ఆర్థిక ఫలితాలనివ్వవు. పెట్టుబడి పెట్టడం అనేది కూడా ఒక విధమైన క్రమశిక్షణలో భాగమే. కాబట్టి, మదుపు చేసేటప్పుడు వృత్తిపరమైన సలహాలతో ముందుకెళ్లాలి. పెట్టుబడి నిర్ణయాలు కొన్ని సార్లు సంక్లిష్టంగా ఉంటాయి. పెట్టుబడి వ్యూహానికి సంబంధించిన ఏదైనా అంశం గురించి మీకు తెలియనప్పుడు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం చాలా మంచిది. మీ వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి ప్రణాళికను రూపొందించడంలో ఆర్థిక సలహాదారుడు మీకు సరైన సలహ ఇవ్వొచ్చు.
పరిశోధన
పెట్టుబడి పెట్టడం అనేది ఒక ముఖ్యమైన నిర్ణయం. సరైన పెట్టుబడి మీ భవిష్యత్తును గణనీయంగా మార్చేస్తుంది. అందువల్ల, పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మార్కెట్‌ను క్షుణ్ణంగా పరిశోధన చేయడం అనేది ఎల్లప్పుడూ మంచిది. ఇలా మార్కెట్‌ను అర్ధం చేసుకోవచ్చు, భవిష్యత్తు మార్కెట్‌ను అంచనా వేయొచ్చు. దీనివల్ల మీరు పెట్టుబడి పెట్టవలసిన కంపెనీల గురించి మీకు ఒక ఆలోచన వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న పెట్టుబడి రకాన్ని తెలుసుకుంటే..మార్కెట్‌పై మంచి అవగాహనతో పాటు, మీకు బాగా సరిపోయే పెట్టుబడి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందు కంపెనీ, దాని కార్యకలాపాలు, ఆర్థిక పరిస్థితి, మార్కెట్‌లో నిలబడే అంచనాలతో పూర్తి పరిశోధన నిర్వహించడం అవసరం. పరిశోధన చేయడం వల్ల పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచనా, కాదా అని మీకు తెలుస్తుంది.
పన్నులు
మీరు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రస్తుతం, భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే పన్ను నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వేర్వేరు పెట్టుబడులు వేర్వేరు పన్నుల స్థాయిలను కలిగి ఉంటాయి. ఇది మీ పెట్టుబడి రాబడిని ప్రభావితం చేస్తుంది. మదుపు చేసేముందు పన్ను చట్టాలు, నిబంధనలను అర్ధం చేసుకోవడం అత్యవసరం. పన్ను చట్టాలను అర్ధం చేసుకోవడం వల్ల మీ ఆర్థిక భవిష్యత్తును అంచనా వేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
kushboo: ‘ఆ దేవుడే నన్ను ఎంచుకున్నారు’..: ఖుష్బూ
-
NewsClick Raids: ‘న్యూస్‌క్లిక్’పై సోదాలు.. మీడియా స్వేచ్ఛపై అమెరికా కీలక వ్యాఖ్యలు
-
Vande Bharat Sleeper: వందే భారత్‌లో స్లీపర్ కోచ్‌లు.. ఫొటోలు షేర్ చేసిన కేంద్ర మంత్రి
-
Anushka Sharma: అనుష్క శర్మ రెండోసారి తల్లి కానుందంటూ వార్తలు.. నటి ఇన్‌స్టా స్టోరీ వైరల్..!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India-Canada: భారత్‌తో తెరవెనుక చర్చలను కొనసాగిస్తాం: కెనడా