Published : 11 Jun 2022 13:35 IST

Personal Loan: ఇవి ముందే చెక్‌ చేసుకుంటే.. పర్సనల్‌ లోన్‌ ఇక పక్కా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్షణ ఆర్థిక అవసరాలను, అనుకోకుండా వచ్చిపడే ఖర్చులను ఎదుర్కోవడానికి ఉన్న అతికొద్ది మార్గాల్లో వ్యక్తిగత రుణం (Personal Loan‌) ఒకటి. రుణం (Loan) అంటేనే రిస్క్‌. ఏమాత్రం పొరపాటు చేసినా దాని పర్యవసానాలు దీర్ఘకాలం ఉంటాయి. మన ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పైగా గృహ, వాహన వంటి ఇతర రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలు (Personal Loan‌) పొందడం కాస్త తేలికనే చెప్పాలి. ఈ క్రమంలో బ్యాంకులు చెప్పే వివిధ ఆఫర్లను సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే ముందు కొన్ని కనీస విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అవేంటో చూద్దాం..!

క్రెడిట్‌ స్కోర్‌ చెక్‌ చేసుకోండి..

మనం ఏ బ్యాంకుకైనా వ్యక్తిగత రుణం కోసం వెళ్లగానే వారు మొట్టమొదట చేసేది మన క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score)ని చెక్‌ చేయడం. కొన్ని బ్యాంకుల్లో వారి సొంత విధానాలను వినియోగించి వ్యక్తి రుణ అర్హతను ధ్రువీకరించుకుంటారు. ఈ నేపథ్యంలో మనం మన క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score)పడిపోకుండా చూసుకోవాలి. 750 కంటే అధిక స్కోర్‌ ఉన్నవారికి రుణం (Loan) మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన ఆర్థిక కార్యకలాపాలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. సకాలంలో వాయిదాలు చెల్లించడం, క్రెడిట్‌ కార్డు బిల్లు (Credit Card Bill) గడువులోగా చెల్లించడం వంటి చర్యల వల్ల మంచి స్కోర్‌ మెయింటైన్‌ చేయవచ్చు. క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score)ను తరచూ చెక్‌ చేసుకోవాలి. తద్వారా ఒకవేళ ఎక్కడైనా తప్పులు దొర్లినా సవరించుకునే అవకాశం ఉంటుంది.

అవసరమైతేనే.. అవసరం ఉన్నంతే..

ఇతర రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలు పొందడం కాస్త తేలిక. మీ క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score)బాగుంటే ఎక్కువ మొత్తంలో ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపుతాయి. కొన్ని ఆఫర్లను ఇవ్వడానికి కూడా ముందుకు వస్తాయి. అలాంటి సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. మీరు తిరిగి చెల్లించే స్తోమత, భవిష్యత్తు ఖర్చులు, మీ బాధ్యతలు, ఇతర రుణాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఎంత తీసుకోవాలన్నది నిర్ణయించుకోండి. మీ తక్షణ అవసరానికి ఎంత కావాలో అంతే తీసుకోవడం ఉత్తమం. వీలైతే ఆన్‌లైన్‌లో అనేక ఈఎంఐ కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవచ్చు. మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐల వాటా 40%-50% మించకుండా చూసుకోవడం ఉత్తమం.

మార్కెట్‌ అధ్యయనం..

మీ ఆర్థిక పరిస్థితి, క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score) బాగుంటే చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఆయా సంస్థలు ఇస్తున్న ఆఫర్లు ఎంటో కనుక్కోండి. అవి ఎంత వరకు లాభదాయకమో చూడండి. అవసరమైతే ఆర్థిక నిపుణుల్ని సంప్రదించండి. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు (Interest rates) కనుక్కొని పోల్చి చూడండి. ప్రాసెసింగ్‌ ఫీజు వంటి ఇతరత్రా ఖర్చులను ఆరా తీయండి. వీటన్నింటినీ బేరీజు వేసుకొని తక్కువ ఖర్చుతో ఇచ్చే నమ్మకమైన సంస్థ వద్ద రుణం తీసుకోండి. తక్కువ వడ్డీరేటు కోసం వారితో బేరాలాడే అవకాశం ఉంటుందని మరవొద్దు.

ఒకేసారి ఎక్కువ సంస్థల్లో దరఖాస్తు చేయొద్దు..

ఏకకాలంలో రుణం కోసమై అనేక సంస్థల్ని ఆశ్రయించి దరఖాస్తులు ఇవ్వొద్దు. సంస్థను బట్టి నిబంధనలు మారుతుంటాయి. వారి నియమాల ప్రకారం మీరు అర్హులు కాకపోవచ్చు. అలా సంస్థలు తిరస్కరిస్తున్న కొద్దీ క్రెడిట్‌ స్కోర్‌ పడిపోతూ ఉంటుంది. నమ్మకమైన, మార్కెట్లో పేరున్న సంస్థల్నే ఆశ్రయించాలి. ఈ క్రమంలో కమిషన్‌ కోసం పనిచేసే మధ్యవర్తులను సంప్రదించొద్దు. ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలేవీ బ్రోకర్లపై ఆధారపడవు. రుణాల మంజూరుకు వారికి సొంత వ్యవస్థ, ఉద్యోగులు ఉంటారు. నేరుగా బ్యాంకులను సంప్రదిస్తేనే మేలు.

ఒప్పంద పత్రాన్ని క్షుణ్నంగా చదవండి..

సొమ్ము మీ చేతికి అందే ముందు రుణ ఒప్పందంపై మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. దానిలోని నియమ నిబంధనల్ని క్షుణ్నంగా చదవండి. వడ్డీరేటు, కాలపరిమితి వంటి వాటిని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోండి. ఆలస్యమైతే చెల్లించాల్సిన అదనపు రుసుము వంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో నిబంధనల్ని ఉల్లంఘించినట్లయితే ఉండే పర్యవసానాల్ని అడిగి తెలుసుకోండి. అవన్నీ మీకు సమ్మతమైతేనే సంతకం చేయండి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని