Twitter: మస్క్‌కు 8 డాలర్లు లభిస్తే.. ఎలీ లిల్లీకి 15 బిలియన్లు ఆవిరి..!

మస్క్‌ అనాలోచితంగా తీసుకొన్న నిర్ణయం బడాకంపెనీలకు శాపంగా మారింది. ఇప్పటికే అమెరికాలోని పలు పెద్దకంపెనీలు బిలియన్ల డాలర్లు నష్టపోయాయి. 

Updated : 13 Nov 2022 12:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్విటర్‌ బ్లూటిక్‌ కోసం ఆత్రంగా 8 డాలర్లు వసూలు చేయడం.. ఓ కంపెనీ సంపద 15 బిలియన్‌ డాలర్లు(రూ.1.20లక్షల కోట్లు) ఆవిరి కావడానికి కారణమైంది. టెక్‌ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న మస్క్‌ నిర్ణయాలు ప్రపంచంలో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఆయన ట్విటర్‌ను కొనుగోలు చేస్తానని ప్రకటించిన నాటి నుంచి ఇది కొనసాగుతోంది. ఫార్మా రంగానికి చెందిన ఓ దిగ్గజ సంస్థకు ట్విటర్‌ నిర్ణయం చేదు అనుభవాన్ని మిగిల్చింది.

అమెరికాలో ‘ఎలీ లిల్లీ అండ్‌ కంపెనీ’ మధుమేహం బాధితులకు ఇన్సులిన్‌ తయారు చేస్తుంది. శుక్రవారం ఈ కంపెనీదిగా పేర్కొంటున్న బ్లూటిక్‌ ఖాతా ట్విటర్‌లో ప్రత్యక్షమైంది. ‘ఇన్సులిన్‌ను ఉచితంగా ఇస్తున్నాం అని ప్రకటించినందుకు సంతోషిస్తున్నాం’ అని ట్వీట్‌ చేసింది. 1876లో ప్రారంభించిన ‘ఎలీ లిల్లీ’ ఓ ప్రైవేటు రంగ సంస్థ. స్టాక్‌ మార్కెట్‌లో నమోదైంది. దీంతో ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను విక్రయించడం మొదలుపెట్టారు. ఈ తప్పుడు బ్లూటిక్‌ ఖాతా చేసిన ట్వీట్‌ కారణంగా ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 4.37 శాతం పతనం అయ్యాయి. దీంతో ఆ కంపెనీ మార్కెట్‌ విలువలో 15 బిలియన్‌ డాలర్లు ఆవిరైపోయింది. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.1.20 లక్షల కోట్లన్నమాట. విషయం తెలుసుకున్న ‘ఎలీ లిల్లీ’  వెంటనే తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో వివరణ ఇచ్చుకొంది. గతంలో ప్రచారమైన ట్వీట్‌ ఓ నకిలీ ఖాతాదని వెల్లడించింది. అప్పటికే ఈ సంస్థ షేరు 368 డాలర్ల నుంచి 345 డాలర్లకు పడిపోయింది.

ప్రముఖ ఆయుధ తయారీ సంస్థ ‘లాక్‌హిడ్‌ మార్టిన్‌’కు కూడా ట్విటర్‌ బ్లూటిక్‌ సెగ తాకింది. ఈ సంస్థ పేరిట ట్విటర్‌ బ్లూటిక్‌ ఖాతా పుట్టుకొచ్చింది. ‘‘ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియా, అమెరికా దేశాల మానవహక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు ముగిసే వరకు ఆయుధాలు విక్రయించం’’ అన్న ట్వీట్‌ ప్రత్యక్షమైంది. లాక్‌హిడ్‌ మార్టిన్‌కు ఈ దేశాలు పెద్ద కస్టమర్లు. దీంతో వీటికి ఆయుధ విక్రయాలు ఆపితే సంస్థ నష్టపోవడం ఖాయమని భావించిన ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించడం మొదలు పెట్టారు. ఫలితంగా ఈ కంపెనీ షేర్‌ ధర 5.5శాతం పతనం కావడంతో భారీగా మార్కెట్‌ విలువ ఆవిరైంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts