Gold Loans: బంగారం తాక‌ట్టుపై రుణం.. ఈ విషయాలు తెలుసుకోండి..

బంగారు రుణాల‌పై వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉంటాయి.

Published : 17 Sep 2022 14:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగారం చేతిలో ఉంటే ఎక్క‌డో ఒక‌ చోట రుణం ల‌భిస్తుంద‌నేది చాలా మందికి తెలిసిన‌ విష‌య‌మే. ఒక‌ప్పుడు బ్యాంకులు త‌క్కువ స్థాయిలోనే ఈ రుణాలు అంద‌జేసేవి. ప్రైవేట్ వ్య‌క్తులు, చిన్న వ్యాపారులు ఎక్కువ‌గా బంగారు త‌న‌ఖా రుణాలు ఇచ్చేవారు. ఇప్పుుడు బంగారంపై రుణాలు ఇవ్వ‌డానికి బ్యాంకులు, కొన్ని రుణ‌ సంస్థ‌లు సైతం కొంత‌కాలం నుంచి అమితాస‌క్తి చూపుతున్నాయి. అయితే బంగారు రుణాన్ని తీసుకునేముందు కొన్ని విష‌యాలు తెలుసుకోవాలి.

వేగంగా రుణం

తాత్కాలిక న‌గ‌దు అవ‌స‌రాలు, వ్యాపార అవ‌స‌రాలు, పిల్ల‌ల విద్య‌, ఇంటి పునరుద్ధ‌ర‌ణ‌, వైద్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి.. ఇలా అవసరం ఏదైనా స‌రే, అత్య‌వ‌స‌ర ఆర్థిక అవ‌స‌రాల‌ను త‌క్ష‌ణ‌మే తీర్చుకోవ‌డానికి బంగారు రుణాలు అనుకూలంగా ఉంటాయి. రుణ సంస్థ‌ల‌కు స‌మ‌ర్పించే డాక్యుమెంటేష‌న్ త‌క్కువ‌గా ఉంటుంది. రుణం తిరిగి చెల్లించడానికి ఎంపిక‌లు సుల‌భంగా ఉంటాయి. అంతేకాకుండా..  వ్య‌క్తిగ‌త రుణాల వంటి అసుర‌క్షిత రుణాల కంటే బంగారు రుణాల‌పై వ‌డ్డీ రేట్లు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. క్రెడిట్ స్కోరు త‌క్కువున్నా రుణం మంజూర‌వుతుంది. బ్యాంకుల్లో బంగారం త‌న‌ఖా పెట్టి రుణం తీసుకుంటే.. తీసుకున్న న‌గ‌దు ఉప‌యోగ‌ప‌డ‌డ‌మే కాకుండా, త‌న‌ఖా పెట్టిన బంగారం అత్యంత భ‌ద్ర‌తా ప్ర‌దేశంలో ఉంటుంది. దీంతో బంగారాన్ని సుర‌క్షిత ప్ర‌దేశంలో సేఫ్‌ డిపాజిట్ చేసిన‌ట్టు ఉంటుంది. 

NBFC లేదా బ్యాంకు నుంచి రుణం

చిన్న వ్యాపారుల వ‌ద్ద బంగారం తాక‌ట్టు పెట్టి రుణం తీసుకోవ‌డం స‌రైంది కాదు. వ‌డ్డీ రేట్లు ఎక్కువ ఉండొచ్చు. త‌న‌ఖా పెట్టిన బంగారం స‌రైన చోట భ‌ద్రంగా దాచ‌లేక‌పోవ‌చ్చు. అందుచేత బంగారు రుణాల‌ను పొందేందుకు బ్యాంకు లేదా నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ కంపెనీ (NBFC)ని ఎంచుకోవ‌డం చాలా మంచిది. కొన్నిసార్లు NBFCలు బ్యాంకుల కంటే త‌క్కువ వ‌డ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుల‌ను వ‌సూలు చేస్తాయి. బ్యాంకులు ఖాతా ఉన్న‌వారికి ప్ర‌థ‌మ ప్రాధాన్య‌ం ఇస్తాయి.

బంగారం విలువ

మంజూరైన రుణం మీ మొత్తం బంగారం విలువ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. బ్యాంకులు బంగారం అస‌లు ధ‌ర‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. బంగారు ఆభ‌ర‌ణాల‌పై అద‌న‌పు రాళ్లు, ఆభ‌ర‌ణాల డిజైన్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. అలాగే, స్వ‌చ్ఛ‌మైన నాణ్య‌త క‌లిగిన బంగారం మీకు అధిక రుణ మొత్తాన్ని పొందేలా చేస్తుంది. సాధార‌ణంగా బ్యాంకులు 18, 24 క్యారెట్ల బంగారాన్నే తాక‌ట్టు పెట్టుకుని రుణం ఇస్తాయి. రుణ సంస్థ అందించే రుణ విలువ (LTV)  నిష్ప‌త్తిని చూడాలి. బంగారం విలువ‌పై 60-90% వ‌ర‌కు బ్యాంకులు రుణాన్ని ఇస్తాయి. ఏ రుణ సంస్థ కూడా బంగారం విలువ‌పై 100% రుణాన్ని ఇవ్వ‌దు.

వ‌డ్డీ రేటు

బ్యాంకులు, NBFCలు బంగారు రుణాల‌పై 7-18% వ‌ర‌కు వ‌డ్డీ రేట్లను వ‌సూలు చేస్తాయి. రుణ మొత్తం, తిరిగి చెల్లించే కాల వ్య‌వ‌ధి.. వ‌డ్డీ రేటును నిర్ణ‌యించ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. గ్రామాల్లో ఏర్పాటైన ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకులు వ్య‌వ‌సాయ ఖ‌ర్చులకుగాను బంగారంపై త‌క్కువ వ‌డ్డీకి రుణాలు ఇస్తాయి. అయితే, భూమి శిస్తు ర‌శీదు లాంటివి అద‌నంగా చూపించాల్సి ఉంటుంది. సాధ్య‌మైనంత వర‌కు త‌క్కువ వ‌డ్డీ రేటును పొంద‌డానికి అనేక రుణ‌సంస్థ‌లు అందించే వ‌డ్డీ రేట్ల‌తో స‌రిపోల్చుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజులు, ముందుస్తు చెల్లింపు ఫీజులు, ఇత‌ర రుసుముల‌ను అన్ని రుణ సంస్థ‌లు ఒకేలా వ‌సూలు చేయ‌వు. ఇటువంటి వాటిని త‌నిఖీ చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు ముంద‌స్తు చెల్లింపు ఛార్జీగా మిగిలిన రుణం మొత్తంలో 1% వ‌ర‌కు వ‌సూలు చేయ‌వ‌చ్చు.

రుణ చెల్లింపు

రుణ సంస్థ‌లు నెల‌వారీగా స‌మాన వాయిదాల్లో రుణాన్ని చెల్లించ‌డానికి ఈఎంఐ సౌక‌ర్యాన్ని అందిస్తాయి. లేదా రుణ కాల‌వ్య‌వ‌ధిలో వ‌డ్డీని మాత్ర‌మే చెల్లించి, ముగింపు స‌మ‌యంలో ఒకేసారి అస‌లు రుణ మొత్తాన్ని చెల్లించ‌వ‌చ్చు. బంగారు రుణాలు సాధార‌ణంగా ఒక వారం నుంచి 3-5 సంవ‌త్స‌రాల వ‌ర‌కు తిరిగి చెల్లించే సౌకర్యాన్ని అందిస్తాయి.

రుణం చెల్లించ‌కపోతే

రుణ బ‌కాయిల‌ను గ‌డువు కాలంలో చెల్లించ‌క‌పోతే రుణ‌ సంస్థ‌లు బ‌కాయిదారుల‌కు వివిధ మార్గాల ద్వారా నోటీసులు ఇస్తాయి. వాటికి స్పందించ‌క‌పోతే బంగారాన్ని వేలం వేస్తాయి. అంతేకాకుండా, మార్కెట్ ప‌రిస్థితుల కార‌ణంగా బంగారం ధ‌ర త‌గ్గితే రుణ సంస్థ‌లు రుణం ఇచ్చిన స‌మ‌యంలో రుణ విలువ (LTV) నిష్ప‌త్తికి స‌రిపోయేలా అద‌న‌పు బంగారాన్ని డిపాజిట్ చేయ‌మ‌ని డిమాండ్ చేయవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని