FDI: ‘సరిహద్దు’ల్లో 40-50 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు వెయిటింగ్!

FDI proposals: సరిహద్దు పంచుకుంటున్న దేశాల కొన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదనలు నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి.

Updated : 31 May 2023 15:40 IST

దిల్లీ: కరోనా సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) విషయంలో తీసుకొచ్చిన నిబంధనలు  పొరుగు దేశాల నుంచి రావాల్సిన కొన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిలిచిపోయాయి. ఇలా దాదాపు 40-50 ప్రతిపాదనలు ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ 2020లో ప్రభుత్వం చేసిన తీసుకొచ్చిన నిబంధనలే ఇందుకు కారణం.

కరోనా మహమ్మారి సమయంలో అవకాశవాద స్వాధీనాలను నివారించేందుకు ఎఫ్‌డీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీని ప్రకారం దేశంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలైన చైనా, బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, మయన్మార్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత ప్రభుత్వ ముందుస్తు అనుమతి తప్పనిసరి. ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సింది. దీంతో వివిధ రంగాలకు చెందిన 40-50 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు సెక్యూరిటీ, పొలిటికల్‌ క్లియరెన్స్‌ కోసం ఆగిపోయాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నిబంధనలు సడలించే ఉద్దేశమేదీ ప్రభుత్వానికి ప్రస్తుతానికి లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఈ ప్రతిపాదనలకు మూడు నెలల్లో ప్రభుత్వం ఆమోదం తెలపాలి. కానీ, దాదాపు 7 నెలల వరకు సమయం పడుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎంజీ విషయంలో జరిగిందిదే..

ఎంజీ మోటార్‌ ఇండియా విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఎంజీ మాతృ సంస్థ అయిన చైనాకు చెందిన SAIC మోటార్‌ కార్పొరేషన్‌ నుంచి నిధులు సమీకరించేందుకు ఆ కంపెనీ ప్రయత్నించి భంగపడింది. ఈ పెట్టుబడులకు భారత ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలను ఆ కంపెనీ ప్రస్తుతం అన్వేషిస్తోంది. కార్యకలాపాల విస్తరణ కోసం స్థానిక పెట్టుబడిదారులను ఆశ్రయిస్తోంది.
Also Read: ఎంజీ మోటార్‌లో వాటా విక్రయం.. రేసులో రిలయన్స్‌, హీరో గ్రూప్‌!

గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 16 శాతం మేర తగ్గాయి. 2021-22లో 84.83 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఈ పెట్టుబడులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 70.97 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఆటోమొబైల్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో పెట్టుబడులు క్షీణించడమే ఇందుకు కారణం. మరోవైపు ‘సరిహద్దు’ నిబంధన తీసుకొచ్చాక 2020 నుంచి 2023 మార్చి వరకు చైనా నుంచి 2.5 బిలియన్‌ డాలర్లు మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయి. బంగ్లాదేశ్‌ నుంచి 0.076 మిలియన్‌ డాలర్లు, నేపాల్ నుంచి 3.31 మిలియన్‌ డాలర్లు, మయన్మార్‌ నుంచి 9 మిలియన్‌ డాలర్లు, అఫ్గానిస్థాన్‌ నుంచి 2.57 మిలియన్‌ డాలర్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు