Mobile number: ఫోన్‌ నంబరుకు ఫీజు?

ప్రస్తుత, కొత్త మొబైల్‌ఫోన్‌ - ల్యాండ్‌ లైన్‌ నంబర్లకూ ఛార్జీ వసూలు చేయాలని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ భావిస్తోంది. నంబరింగ్‌ వనరుల నియంత్రణపై వచ్చిన ప్రతిపాదనతోనే, ట్రాయ్‌ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 14 Jun 2024 07:22 IST

ట్రాయ్‌ పరిశీలన 
వాడని నంబర్లకు జరిమానా
చర్చాపత్రం విడుదల

ప్రస్తుత, కొత్త మొబైల్‌ఫోన్‌ - ల్యాండ్‌ లైన్‌ నంబర్లకూ ఛార్జీ వసూలు చేయాలని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ భావిస్తోంది. నంబరింగ్‌ వనరుల నియంత్రణపై వచ్చిన ప్రతిపాదనతోనే, ట్రాయ్‌ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ‘రివిజన్‌ ఆఫ్‌ నేషనల్‌ నంబరింగ్‌ ప్లాన్‌’ పేరిట ఒక చర్చాపత్రం విడుదల చేసి, వివిధ వర్గాల అభిప్రాయాలను కోరింది.

ఇదీ ప్రతిపాదన: ఫోన్‌ నంబర్లను కూడా విలువైన ప్రజా వనరులుగా భావిస్తూ, వాటి కేటాయింపునకు ఛార్జీ విధించాలని ట్రాయ్‌ యోచిస్తోంది. టెలికాం ఆపరేటర్ల నుంచి ఈ రుసులు వసూలు చేయాలన్నది ట్రాయ్‌ ప్రతిపాదన. ఆపరేటర్లు ఆ వ్యయాలను వినియోగదార్లకు బదిలీ చేసే అవకాశం ఉంది. ఒక నంబరుకు ఒకే సారి (కనెక్షన్‌ ఇచ్చినప్పుడు) లేదా ఏడాదికి/ఒక నిర్దిష్ట కాలావధికి ఇంత.. అని ఛార్జీ వసూలు చేసే యోచన ఉందని చెబుతున్నారు. వ్యానిటీ నంబర్లకు కేంద్రీకృత వేలం నిర్వహించే యోచనలోనూ ట్రాయ్‌ ఉంది. 

వినియోగించని సిమ్‌కార్డులుంటే..

వినియోగంలో లేని నంబర్లను అట్టే పెట్టి ఉంచుకున్న టెలికాం సంస్థలపై జరిమానా విధించాలని ట్రాయ్‌ అనుకుంటోంది. స్మార్ట్‌ఫోన్‌లో రెండు సిమ్‌ కార్డులు వాడటం సాధారణమైంది. అందులో ఒక సిమ్‌ కార్డును అలంకార ప్రాయంగా ఉంచుకునే వారే ఎక్కువ. రీఛార్జి చేయకపోయినా, కంపెనీలు తమ వినియోగదార్ల సంఖ్యను కాపాడుకోవడం కోసం ఆ నంబరును రద్దు చేయడం లేదు. ఇలాంటివి గుర్తించి, సదరు ఆపరేటర్లకు జరిమానా విధించాలని ట్రాయ్‌ అనుకుంటోంది. 

వినియోగదార్లపై భారం: సిమ్‌కార్డు నంబరుకు ఛార్జి వసూలు చేయాలని ట్రాయ్‌ ఆదేశిస్తే, టెలికాం దిగ్గజాలైన రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా(వీఐ) వినియోగదార్లకు అదనపు భారం తప్పదు. ఆయా కంపెనీలు వినియోగదార్లను పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లకు మారేలా ఒత్తిడి చేయొచ్చు. ఇందువల్ల సగటు వినియోగదారు ఆదాయం(ఆర్పు) పెంచుకునే అవకాశం కంపెనీలకు ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 

వినియోగ హక్కులు మాత్రమే: స్పెక్ట్రమ్‌ తరహాలోనే ఫోన్‌నంబర్లకు సంబంధించిన యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయి. వాటి వినియోగ హక్కును మాత్రమే టెలికాం సంస్థలకు ఇస్తున్నారు. గతేడాది డిసెంబరులో అమల్లోకి వచ్చిన టెలికాం కొత్త చట్టం కింద, నంబర్లకు ఛార్జీ విధించే వెలుసుబాటు కలిగింది. సాంకేతికంగా దీనిని ‘టెలికాం ఐడెంటిఫైర్స్‌’ అంటారు. ఈ పరిణామాలపై పరిశ్రమ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి. యాక్టివ్‌గా లేదని కనెక్షన్లకు ఒక నిర్వచనం ఇవ్వడం, పరిమిత సమయం నిర్దేశించి.. ఆ తర్వాత నంబర్లను ఇతరులకు కేటాయించడం మంచిదని కొందరు సూచిస్తున్నారు. 

ఈ దేశాల్లోనూ..

టెలికాం నంబర్లకు ఛార్జీలు విధిస్తున్న దేశాలూ చాలానే ఉన్నాయి. ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, బ్రిటన్, గ్రీస్, హాంకాంగ్, బల్గేరియా, కువైట్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, నైజీరియా, దక్షిణాఫ్రికా, డెన్మార్క్‌ దేశాల్లో ఆపరేటర్లు/ వినియోగదార్లకు ఛార్జీ విధిస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని