Festival season: పండగ సీజన్‌.. ఆపై వరల్డ్‌ కప్‌.. కొనుగోళ్లే కొనుగోళ్లు!

Festival season: ప్రపంచ కప్‌ (World Cup 2023) నేపథ్యంలో టీవీలకు భారీగా గిరాకీ ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Published : 24 Sep 2023 16:42 IST

దిల్లీ: ఈ పండగ సీజన్‌ (Festival season)లో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌ కొనుగోళ్లలో విలువపరంగా 18- 20 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓనంతోనే దక్షిణాది మార్కెట్లలో కొనుగోళ్ల జోరు ప్రారంభమైందని పేర్కొన్నాయి. ఈసారి పండగ సీజన్‌ (Festival season)లోనే క్రికెట్‌ ప్రపంచ కప్‌ (World Cup 2023) కూడా రానుండడం మరో విశేషమని తెలిపాయి. దీనివల్ల కొనుగోళ్లు మరింత పుంజుకుంటాయని అంచనా వేస్తున్నాయి.

ప్రపంచ కప్‌ (World Cup 2023) నేపథ్యంలో టీవీలకు భారీ గిరాకీ ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా పెద్ద తెరలు ఉండే టీవీల కొనుగోళ్లు భారీగా జరగొచ్చని తెలిపాయి. బ్యాటరీ ఆధారిత స్పీకర్లు, సౌండ్‌బార్లు, వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్లు, ఇయర్‌ బడ్స్‌కు కూడా మంచి గిరాకీ ఉంటుందని అంచనా వేస్తున్నాయి. పాత టీవీలు, చిన్న తెరలు ఉన్న టీవీల స్థానంలో వినియోగదారులు పెద్ద తెరల టీవీలను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, పానాసోనిక్‌, థామ్సన్‌ వంటి కంపెనీలు తెలిపాయి. క్యూలెడ్‌, ఓలెడ్‌ టీవీ వేరియంట్లలో ప్రీమియం, అల్ట్రా ప్రీమియం టీవీలకు మంచి గిరాకీ ఉంటుందని పేర్కొన్నాయి. అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు కొనసాగనున్న విషయం తెలిసిందే.

గత కొన్నేళ్ల తరహాలోనే ఈసారి కూడా కంపెనీలు ఆఫర్లు, వడ్డీ రహిత రుణ పథకాలు, కొత్త ఉత్పత్తుల విడుదల సహా పలు ప్రోత్సాహకాలతో సిద్ధమయ్యాయి. ప్రీమియం సెగ్మెంట్‌లో కొనుగోళ్లకు ఢోకా ఉండకపోవచ్చునని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ, ద్రవ్యోల్బణం, తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ‘మాస్‌ సెగ్మెంట్‌’లో కొనుగోళ్ల వృద్ధి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చునని పలు కంపెనీలు అభిప్రాయపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని