NPS: ఎన్‌పీఎస్ చందాదారులా? రాబోతున్న మార్పులు ఇవే..

పెన్ష‌న్ ఫండ్ మేనేజ‌ర్‌ను మాత్రం ఏడాదిలో ఒక‌సారి మాత్ర‌మే మార్చుకొనేందుకు వీలుంది

Updated : 18 Jun 2022 16:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాతీయ ఫించ‌ను ప‌థ‌కం (NPS)ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దేందుకు పెన్షన్ సెక్టార్ రెగ్యులేటర్.. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) సిద్ధ‌మైంది. ఎన్‌పీఎస్ చందాదారులు (NPS Subscribers) ప‌ద‌వీవిర‌మ‌ణ నాటికి మ‌రింత‌ నిధిని స‌మ‌కూర్చుకునేందుకు గానూ కొత్త ప్ర‌ణాళిక‌ల‌తో వస్తోంది. ఈక్వీటీ పెట్టుబ‌డుల‌ కేటాయింపుల‌ను పెంచ‌డం, మ‌రింత మంది ఫండ్ మేనేజ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం, ఒక ఏడాదిలో ఆస్తి కేటాయింపును (Asset Allocation) మార్చుకునేందుకు ఎక్కువ అవ‌కాశాలు ఇవ్వడం వంటి వివిధ మార్పుల‌ను తీసుకొచ్చే దిశ‌గా యోచిస్తోంది.

పింఛను రంగం నిర్వ‌హిస్తున్న దాదాపు రూ.35 ల‌క్ష‌ల కోట్ల ఆస్తి విలువ‌లో 21 శాతం వాటా ఎన్‌పీఎస్‌దే. అంటే, ఎన్‌పీఎస్ ప్ర‌స్తుతం రూ.7.30 ల‌క్ష‌ల కోట్ల విలువైన చందాదారుల ఆస్తిని నిర్వ‌హిస్తోంది. ఎన్‌పీఎస్‌లో టైర్-I, టైర్-II అని రెండు ఖాతాలు ఉంటాయి. టైర్-I ఖాతా దీర్ఘ‌కాల లాక్-ఇన్ పీరియ‌డ్‌తో వ‌స్తుంది. ఇది ప‌న్ను ప్రోత్స‌హ‌కాల‌ను అందిస్తుంది. 

ఆస్తి కేటాయింపు మార్పున‌కు ఏడాదిలో 4 సార్లు అనుమతి..

ఎన్‌పీఎస్ చందాదారులు ఈక్వీటీ, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు.. ఇలా మూడు అసెట్ క్లాస్‌ల‌లో త‌మ పెట్టుబ‌డులు కేటాయించుకునేందుకు ఎన్‌పీఎస్ అనుమ‌తిస్తుంది. ప్రత్యామ్నాయ ఆస్తులలో పెట్టుబడులను కూడా ఎన్‌పీఎస్‌ అనుమతిస్తుంది. చందాదారులు ‘యాక్టివ్‌ ఛాయిస్ అసెట్ ఎలోకేష‌న్‌’ను ఎంచుకుంటే సంవ‌త్స‌రానికి రెండు సార్లు మాత్ర‌మే ఆస్తి కేటాయింపుల‌ను మార్చుకునే అవ‌కాశం ఉంది. అయితే, ఇప్పుడు టైర్-I, టైర్-II ఖాతాల కోసం ఆస్తి కేటాయింపును మార్చుకునేందుకు చందాదారుల‌కు 4 సార్లు అవ‌కాశం ఇవ్వాల‌ని పీఎఫ్ఆర్‌డీఏ భావిస్తోంది. ఈ ఆప్ష‌న్ త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తుంద‌ని సంబంధిత అధికారులు చెబుతున్నారు. పెన్ష‌న్ ఫండ్ మేనేజ‌ర్‌ను మాత్రం ఏడాదిలో ఒక‌సారి మాత్ర‌మే మార్చుకునేందుకు వీలుంది. 

మార్కెట్ గురించి అవ‌గాహ‌న ఉన్న చందాదారులు మార్కెట్ క‌ద‌లిక‌ల‌కు అనుగుణంగా ఆస్తి కేటాయింపును మార్చుకుని మ‌రింత ప్ర‌యోజ‌నాన్ని పొందేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక ఏడాదిలో ఎక్కువ‌సార్లు ఆస్తి కేటాయింపుల‌ను మార్చుకునే అవ‌కాశం ఇవ్వాల‌నే చందాదారుల అభ్య‌ర్థన మేర‌కు ఆ ఆప్ష‌న్ తీసుకొస్తున్న‌ట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే, ఎన్‌పీఎస్ అనేది దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల కోస‌మ‌ని చందాదారులు ఎల్ల‌ప్పుడూ గుర్తుంచుకోవాలి. దాని ప్ర‌కార‌మే ఆస్తి కేటాయింపులు, మార్పుల గురించి నిర్ణ‌యం తీసుకోవాలి.

ఆస్తి కేటాయింపు కోసం ఆటో ఛాయిస్‌ను ఎంచుకునే పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చందాదారులు వారి వారి వయస్సు, ఆస్తుల మధ్య ఎంపికపై ఆధారపడి రీబ్యాలెన్స్ పొందుతారు.

పెన్ష‌న్ ఫండ్ మేనేజ‌ర్ల పెంపు..
చందాదారులు త‌మ పెట్టుబ‌డుల కోసం.. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ఏడుగురు పెన్ష‌న్ ఫండ్ మేనేజ‌ర్ల నుంచి ఒక‌రిని ఎంచుకోవాల్సి ఉంది. అయితే పెట్టుబ‌డిదారుల కోసం మ‌రిన్ని ఎంపిక‌లు అందుబాటులోకి రానున్నాయి. పెన్ష‌న్ ఫండ్ మేనేజ‌ర్ల కోసం యాక్సిస్‌, మ్యాక్స్ లైఫ్‌, టాటా.. మూడూ సూత్రప్రాయంగా ఆమోదం పొందాయి. తుది ధ్రువీక‌ర‌ణ త‌ర్వాత ఈ మూడు త‌మ సేవ‌ల‌ను అందించ‌డం ప్రారంభిస్తాయి. ప్ర‌స్తుతం ఉన్న ఏడుకు మరో మూడు క‌లిస్తే మొత్తం 10 పెన్ష‌న్ ఫండ్ మేనేజ‌ర్లు అందుబాటులో ఉంటాయి. చందాదారులు త‌మ‌కు కావాల్సిన పెన్ష‌న్ ఫండ్ మేనేజ‌ర్‌ను ఎంచుకోవ‌చ్చు. 

ఇప్పటి వ‌ర‌కు చందాదారులు నిర్వ‌హించే అన్ని అసెట్ క్లాసుల‌ను ఒకే ఫండ్ మేనేజ‌ర్ ద్వారా నిర్వ‌హించేవారు. అయితే, ప్ర‌భుత్వేత‌ర స‌బ్‌స్క్రైబ‌ర్లు వారు పెట్టుబ‌డి పెట్టే ప్ర‌తీ అసెట్ క్లాస్‌కి ప్రత్యేక ఫండ్ మేనేజ‌ర్‌ను నియ‌మించుకోవ‌చ్చు. అయితే, ఇలా చేయ‌డం త‌ప్ప‌నిస‌రి కాదు. 

100 శాతం ఈక్వీటీల‌కు కేటాయించే అవ‌కాశం..
ఎన్‌పీఎస్ టైర్-II ఖాతాదారులు పెట్టుబ‌డుల‌ను 100 శాతం ఈక్విటీలకు కేటాయించే అవ‌కాశం ఇచ్చే దిశ‌గా ఆలోచిస్తోంది. ఎన్‌పీఎస్‌కి సంబంధించి ప్ర‌తి పెన్ష‌న్ ఫండ్ మేనేజ‌ర్ రిస్క్ ప్రొఫైల్‌ని ఎన్‌పీఎస్ చందాదారుడు తెలుసుకునే వీలుక‌ల్పించ‌నుంది. ఎన్‌పీఎస్ చందాదారులు రిస్క్ గురించి మ‌రింత‌ స‌మాచారంతో నిర్ణ‌యం తీసుకుంటే మంచి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌లుగుతారు. ఎన్‌పీఎస్.. మార్కెట్‌కు అనుసంధాన‌మై రాబ‌డిని అందిస్తుంది. అయితే, చందాదారులు అంద‌రూ మార్కెట్ లింక్డ్ స్కీమ్‌తో సౌకర్యవంతంగా ఉండరు. ఇటువంటి సబ్‌స్క్రైబర్‌ల కోసం పీఎఫ్ఆర్‌డీఏ కనీస హామీతో రాబ‌డిని అందించే ప్రతిపాదనపై పని చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని