Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గించుకోండిలా..

ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీ ప్రీమియం తగ్గించుకోవడానికి ఉన్న కొన్ని స్మార్ట్ మార్గాలను చూద్దాం.....

Published : 05 Jul 2022 11:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవనశైలి రుగ్మతలు, మానసిక ఒత్తిడి, వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా (Health Insurance) తప్పనిసరైంది. కరోనా సంక్షోభం అనంతర ప్రపంచంలో దీని అవసరం మరింత పెరిగిందనే చెప్పాలి. క్రమంగా ఆరోగ్య బీమా (Health Insurance) ప్రాముఖ్యత గురించి అవగాహన పెరుగుతోంది. అంతేకాకుండా, పాలసీల సంఖ్యతో పాటు బీమా మొత్తం కూడా పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation) మధ్య తమను, కుటుంబాలను రక్షించుకోవడానికి చాలా మంది ఆరోగ్య బీమా పాలసీ కోసం వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ప్రీమియం (health insurance premium) ఖర్చును తగ్గించుకోవడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీ ప్రీమియం తగ్గించుకోవడానికి ఉన్న కొన్ని స్మార్ట్ మార్గాలను చూద్దాం..

ముందుగానే కొనండి: ఆరోగ్య బీమా ప్రీమియం  (health insurance premium)పై ఎక్కువగా ప్రభావం చూపే అంశం వయస్సు. కాబట్టి చిన్న వయసులోనే కొనుగోలు చేయడం వల్ల మీకు తగ్గింపు లభిస్తుంది. మరోవైపు ముందు నుంచీ వ్యాధులు ఉన్నవారికి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. వయస్సు పెరిగేకొద్దీ, మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి, చిన్న వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడే బీమా తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లను ఎంచుకోండి: ఆరోగ్య బీమా అవసరాలు ప్రతి వ్యక్తికి వేర్వేరుగా ఉంటాయి, అయితే, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లను ఒక కుటుంబంలోని సభ్యులందరికీ సరిపోయేలా రూపొందించారు. ఒక వ్యక్తికి మాత్రమే వర్తించే వ్యక్తిగత కవర్‌కు భిన్నంగా, ఫ్యామిలీ-ఫ్లోటర్ ప్లాన్ మొత్తం కుటుంబ వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. ఒక్కొక్కరికీ వ్యక్తిగత ప్లాన్‌ను తీసుకోవడంతో పోలిస్తే ఇది చాలా తక్కువ ప్రీమియంకే అందుబాటులో ఉంటుంది. కుటుంబంలో వైద్య చికిత్స అవసరమైన ఎవరైనా ప్లాన్ కింద హామీ ఇచ్చిన మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు.

2-3 ఏళ్లకు ఒకేసారి: ఈ రోజుల్లో చాలా బీమా సంస్థలు రెండు నుంచి మూడు సంవత్సరాల ఆరోగ్య పాలసీలను అందిస్తున్నాయి. దీనివల్ల ప్రీమియం తగ్గింపుతో పాటు, ఏటా పెరిగే పెంపు నుంచి కూడా మినహాయింపు లభిస్తుంది. మీరు రెండేళ్ల ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం ద్వారా 10 శాతం వరకు తగ్గింపును, మూడేళ్ల పాలసీపై 15 శాతం వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది.

నో క్లెయిమ్ బోనస్‌ని ఉపయోగించుకోండి: ‘నో క్లెయిమ్ బోనస్ (NCB)’ తక్కువ ఖర్చుతో ఎక్కువ బీమా మొత్తాన్ని పొందడానికి గొప్ప మార్గం. పాలసీ వ్యవధిలో ఎటువంటి బీమా క్లెయిమ్ చేయకుంటే, ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించకుండానే తదుపరి సంవత్సరానికి మీ పాలసీలో భాగంగా అదనపు బీమా మొత్తాన్ని పొందవచ్చు. ఈ రోజుల్లో, చాలా బీమా సంస్థలు ఎన్‌సీబీ వెసులుబాటుని అందిస్తున్నాయి. ఉదాహరణకు, మీరు రూ.10 లక్షల మొత్తంతో పాలసీని కొనుగోలు చేశారనుకుందాం. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు క్లెయిమ్‌ చేయలేదు. అప్పుడు బేస్ పాలసీ కంటే అదనంగా రూ.8-10 లక్షల బీమా మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఇది పాలసీని బట్టి మారుతూ ఉంటుంది. మీరు తీసుకునే పాలసీ ఏ రకమైన ఎన్‌సీబీ ప్రయోజనాలను అందజేస్తుందో ముందుగానే తెలుసుకోవాలి.

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి: బీమా ప్రీమియాన్ని తగ్గించుకోవడానికి ఉన్న మరొక మార్గం మీ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం. ఆన్‌లైన్‌లో బీమా పంపిణీ ఆఫ్‌లైన్‌తో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనివల్ల కంపెనీలు కొంతమేర నిర్వహణ వ్యయాల్ని తగ్గించుకోగలుగుతాయి. ఈ ప్రయోజనంలో కొంత భాగాన్ని పాలసీదారులకు బదిలీ చేయాలన్న ఉద్దేశంతో కంపెనీలు ప్రీమియంలో తగ్గింపును ఆఫర్‌ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని