Windfall Tax: విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ రద్దు చేయాలి.. కేంద్రానికి ఫిక్కీ విజ్ఞప్తి

పెట్రోలియం ముడిచమురుపై పర్సంటేజ్‌ ఆధారంగా కాకుండా ఉత్పత్తి చేస్తున్న టన్నుల ఆధారంగా విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ వసూలు చేయడం వల్ల ఆయిల్‌ ధరలు తగ్గినప్పుడు ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఫిక్కీ పేర్కొంది. 

Published : 24 Jan 2023 23:03 IST

దిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడిచమురుపై విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ (Windfall Tax)ను రద్దు చేయాలని భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (FICCI) కేంద్రాన్ని కోరింది. ఇది చమురు సంస్థల లాభాలపై ప్రభావం చూపిస్తోందని తెలిపింది. ఈ మేరకు పరిశ్రమల తరపున బడ్జెట్‌కు సంబంధించి సమర్పించే సిఫార్సులలో విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ రద్దు అంశాన్ని చేర్చినట్లు ఫిక్కీ వెల్లడించింది. దేశీయ చమురు సంస్థలు పొందుతున్న అదనపు లాభాలను ఆదాయంగా మార్చుకునేందుకు కేంద్రం గతేడాది జవనరి 1 నుంచి విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను వసూలు చేస్తోంది. అప్పట్లో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడిచమురుపై టన్నుకు రూ.23, 250 వసూలు చేసింది. ఈ పన్ను వసూలుతో అంతర్జాతీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలతోపాటు విమాన ఇంధనం (ATF) ధరలు తగ్గాయి. తాజాగా ఈ నెలలో దాన్ని రూ.17,000కు తగ్గించింది.

‘‘పెట్రోలియం ముడిచమురుపై స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ (SAED)ని రద్దు చేయాలి. ఒకవేళ తప్పనిసరిగా పన్ను వసూలు చేయాలని భావిస్తే ప్రస్తుతం ఉన్నదానికంటే 20 శాతం తగ్గించాలి.  పర్సంటేజ్‌ ఆధారంగా కాకుండా ఉత్పత్తి చేస్తున్న టన్నుల ఆధారంగా విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ వసూలు చేయడం వల్ల ఆయిల్‌ ధరలు తగ్గినప్పుడు ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది’’ అని ఫిక్కీ పేర్కొంది. 

‘‘ ప్రస్తుతం దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి చేస్తున్న సంస్థల నుంచి 70 శాతం వరకు పన్ను వసూలు చేస్తున్నారు. కానీ, ఈ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 35 నుంచి 40 శాతం పన్ను వసూలు మాత్రమే పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. వీటిపై కేంద్రం నిర్ణయం తీసుకునేందుకు బడ్జెట్‌ సరైన సమయం’’ అని వేదాంత లిమిటెడ్‌ సీఈవో సునీల్‌ దుగ్గల్‌ అన్నారు. 

ఏడాది రెండు మిలియన్‌ బ్యారెల్‌ల కన్నా తక్కువ ముడిచమురు ఉత్పత్తి చేస్తున్న సంస్థలకు విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ నుంచి కేంద్రం మినహాయింపును ఇచ్చింది. ఇంధన రంగానికి మద్దతుగా,  ప్రపంచ ముడిచమురు మార్కెట్ల నుంచి దేశీయ సంస్థలకు రక్షణ కల్పించేందుకు విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌పై విధానపరమై సంస్కరణలు అమలు చేయడాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని దేశీయ ముడిచమురు ఉత్పత్తి సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని