FII: భారత మార్కెట్ల నుంచి రూ.లక్షకోట్లు బయటకు!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గతకొన్ని రోజుల్లో భారీగా పతనమయ్యాయి. సూచీల నష్టాలకు విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు ఓ కారణం....

Published : 30 Jan 2022 01:59 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గతకొన్ని రోజుల్లో భారీగా పతనమయ్యాయి. సూచీల నష్టాలకు విదేశీ సంస్థాగత మదుపర్ల (FII) అమ్మకాలు కూడా ఓ కారణం. ముఖ్యంగా గత పదిరోజులుగా పెద్ద ఎత్తున షేర్లు విక్రయించి భారత మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐలు నిష్క్రమించారు. అమెరికాలో బాండ్ల రాబడులు పెరగడం, వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలోనే వారు అమ్మకాలకు దిగినట్లు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ‘మోతీలాల్‌ ఓస్వల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌’ అంచనా వేసింది.

ఈ సంస్థ లెక్కల ప్రకారం.. గత ఏడాది అక్టోబరు నుంచి ఎఫ్‌ఐఐలు 13.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.లక్ష కోట్లు) విలువ చేసే షేర్లను విక్రయించారు. ఈ క్రమంలో దేశీయ కంపెనీల షేర్లు పెద్ద ఎత్తున దిద్దుబాటుకు గురయ్యాయి. భారత్‌లోని రెండు ప్రధాన సూచీలైన సెన్సెక్స్30‌, నిఫ్టీ50 గత ఏడాది అక్టోబరులో జీవితకాల గరిష్ఠానికి చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడి నుంచి నిఫ్టీ 8 శాతం మేర దిద్దుబాటుకు గురికావడం గమనార్హం.

సూచీల పతనానికి దేశీయ స్టాక్‌ల ధరలు అధిక విలువకు చేరుకోవడం కూడా ఓ కారణమని మోతీలాల్‌ ఓస్వల్ అంచనా వేసింది. కొవిడ్‌ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందన్న వార్తలతో అక్టోబరుకి ముందు సూచీలు చాలా రోజుల పాటు ర్యాలీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక దేశీయ స్టాక్‌ల ధర అధిక విలువకు చేరుకుందని పేర్కొంది. ఆ ప్రభావం ఇప్పుడు మార్కెట్లపై కనిపిస్తోందని తెలిపింది.

అలాగే ఐపీఓ జోరులో లాభపడ్డ కంపెనీలు సైతం ఇప్పుడు సగటున 25-30 శాతం దిద్దుబాటుకు గురయ్యాయని మోతీలాల్‌ ఓస్వల్‌ తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ఈ పరిణామాలు కూడా మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీసినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని