IDBI Bank privatisation: ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి వచ్చే ఏడాదే!

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మార్చి నాటికి ఫైనాన్షియల్‌ బిడ్స్‌ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నాయి.

Published : 10 Oct 2022 20:44 IST

 

దిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మార్చి నాటికి ఫైనాన్షియల్‌ బిడ్స్‌ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నాయి. ఐడీబీఐలో 60.72 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం గత వారం ఆసక్తి వ్యక్తీకరణలను (EOI) ఆహ్వానించిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 16 వరకు దీనికి గడువు విధించింది. ఆసక్తి వ్యక్తీకరణలో పాల్గొన్న పార్టీలకు ఆర్‌బీఐ నిర్వహించే ‘ఫిట్‌ అండ్‌ ప్రాపర్‌’ మదింపు ప్రక్రియను, హోంమంత్రిత్వ శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్‌ పూర్తి చేసుకున్న అనంతరం  డేటా రూమ్‌ యాక్సెస్‌ ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే ఫైనాన్షియల్‌ బిడ్లు దాఖలు చేస్తారని, దీనికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని పేర్కొన్నాయి. మార్చి నాటికి ఫైనాన్షియల్‌ బిడ్లు వచ్చే అవకాశం ఉందని, బ్యాంక్‌ వ్యూహాత్మక విక్రయం పూర్తి కావడానికి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ అవ్వొచ్చని అంచనా వేశాయి.

ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీకి 49.24 శాతం (529.41 కోట్ల షేర్లు), ప్రభుత్వానికి 45.48 శాతం (488.99 కోట్ల షేర్లు) వాటాలున్నాయి. ఇందులో ప్రభుత్వం 30.48%, ఎల్‌ఐసీ 30.24 శాతం వాటాలను విక్రయించనున్నాయి. మొత్తంగా 60.72 శాతం వాటా విక్రయంతో పాటు ఐడీబీఐ బ్యాంక్‌ యాజమాన్య నియంత్రణను కూడా ప్రభుత్వం బదిలీ చేయనుంది. ఐడీబీఐలో వాటాల కొనుగోలుకు బిడ్లు దాఖలు చేయాలంటే కనీసం రూ.22,500 కోట్ల నికర సంపద కలిగిన ఇన్వెస్టర్లే బిడ్లు దాఖలు చేయాలి. గత అయిదు ఆర్థిక సంవత్సరాలలో మూడేళ్లు నికర లాభాన్ని నమోదు చేయాలి. కన్సార్షియంగా (బృందం) బిడ్‌ వేయాలంటే.. అందులో గరిష్ఠంగా నలుగురు సభ్యులు ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని