Credit card: క్రెడిట్ కార్డ్ వాడేవారికి ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు అవసరం..?

ఎన్ని ఆర్థిక ఒత్తిళ్లు ఉన్న‌ప్ప‌టికీ క్రెడిట్ కార్డ్ రుణాన్ని గ‌డువులోగా త‌ప్ప‌నిస‌రిగా చెల్లించాలి.

Updated : 21 Feb 2022 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జేబులో నుంచి డ‌బ్బులు తీసి ఖ‌ర్చుపెట్టేవారితో పోలిస్తే క్రెడిట్ కార్డ్ (Credit card) ఉప‌యోగించేవారు కొద్ది మొత్తాన్ని అయినా అధికంగా ఖ‌ర్చు పెడ‌తార‌ని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు ఎంత సౌక‌ర్యంగా ఉంటుందో.. బిల్లు చెల్లించేటప్పుడు అంతే ఇబ్బంది ఉంటుంది. ఎన్ని ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా క్రెడిట్ కార్డ్ రుణాన్ని గ‌డువులోగా త‌ప్పనిసరిగా చెల్లించాల్సిన పరిస్థితి. చెల్లించకపోతే భారీగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బిల్లు మొత్తాన్ని ఈఎంఐ కింద మార్చినా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఇలా క్రెడిట్‌ కార్డు వాడకం విషయంలో క్రమశిక్షణ లేకపోతే అప్పులు మెడకు చుట్టుకుంటాయి. కాబట్టి క్రెడిట్‌ కార్డు వాడకంలో ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి.

  • బ‌కాయిలు స‌కాలంలో స‌రిగ్గా చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ భ‌విష్యత్‌లో మ‌న‌కు ఆర్థికంగా మేలు చేస్తుంది. లేక‌పోతే క్రెడిట్ స్కోర్ త‌గ్గుతుంది. షాపింగ్‌కు వెళ్లినప్పుడు బ‌డ్జెట్‌కు క‌ట్టుబ‌డి ఉండ‌టం మంచిది. అధిక కొనుగోళ్లు జరిపేటప్పుడు, తిరిగి చెల్లించ‌డానికి ముందే ప్రణాళిక వేసుకోవాలి. మీరు మీ క్రెడిట్ కార్డ్‌ను ఉప‌యోగించి డ‌బ్బు ఖ‌ర్చు చేసిన‌ప్పుడ‌ల్లా ప్రతిసారీ బిల్లును చెల్లించడంలో మీకు సాయపడే రీపేమెంట్‌ ప్లాన్‌తో సిద్ధంగా ఉండాలి.
  • బిల్లు స‌కాలంలో చెల్లించ‌డం గురించి మీకు అవగాహన లేకపోతే క్రెడిట్ కార్డ్ వినియోగం తగ్గించుకోవడం మంచిది. గ‌డువు తేదీకి ముందే బిల్లుని తిరిగి చెల్లించ‌డానికి మీ బ్యాంక్ ఖాతాలో త‌గినంత నిధులు, మీరు సంపాదించే నెల నిక‌ర ఆదాయం చూసుకుని మాత్రమే క్రెడిట్‌ కార్డును వాడండి.
  • రోజువారీ జీవితంలో క్రెడిట్ కార్డ్‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ప్రయోజనాలు చాలా ఉండొచ్చు. కానీ క్రెడిట్ కార్డ్ ఉప‌యోగించేవారు అత్యంత ఆర్థిక క్రమశిక్షణ పాటించేవారు అయ్యి ఉండాలి. ముఖ్యంగా మీ నెల ఆదాయాన్ని బట్టి మాత్రమే క్రెడిట్ కార్డ్ వాడ‌టం మంచిది. క్రెడిట్ బిల్లు ఆల‌స్య చెల్లింపు లేదా చెల్లింపులో డిఫాల్ట్‌.. కార్డుదారుని క్రెడిట్ స్కోర్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. త‌గ్గిన క్రెడిట్ స్కోర్ మెరుగ‌వ్వడానికి కొన్ని నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. ప్రతి ఆల‌స్య చెల్లింపుపై అధిక వ‌డ్డీ న‌మోద‌వుతుంది. ఒక్కోసారి 40% దాకా కూడా వ‌డ్డీ/పెనాల్టీలు వేయ‌వ‌చ్చు.
  • కొన్నిసార్లు మీరు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ క్రెడిట్ కార్డ్ రుణాన్ని తిరిగి చెల్లించ‌లేని ప‌రిస్థితుల్లో ఉంటే.. కొన్ని వారాలు, ఒక నెల త‌ర్వాత కార్డ్ రుణ బ‌కాయిల‌ను చెల్లిస్తాన‌ని బ్యాంకుని అభ్యర్థించండి. అధిక శాతం బ్యాంకులు మీ రుణాన్ని ఈఎంఐగా మార్చడానికి లేదా మీ ప‌రిస్థితిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని మీకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా కొంత గడువు ఇచ్చే అవకాశం ఉంటుంది. 
  • బ్యాంకుల్లో మీకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వివిధ సెక్యూరిటీలు ఉంటే వాటిపై రుణం ప్రయత్నించొచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై రుణం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వ‌డ్డీరేటు హోమ్‌లోన్ రేట్లతో సమానంగా ఉంటుంది. మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఏమైనా పెట్టుబ‌డులు ఉంటే క్రెడిట్ కార్డ్ బ‌కాయికి స‌రిప‌డా మొత్తానికి యూనిట్లను రిడీమ్‌ చేయొచ్చు.
  • క్రెడిట్ కార్డ్ రుణాన్ని చెల్లించ‌డానికి వ్యక్తిగత రుణాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ రుణాల‌ను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు, స‌మ‌యం కూడా త‌క్కువే ఉంటుంది. అయితే, సెక్యూర్డ్ లోన్‌తో పోలిస్తే ఈ రుణాల‌కు వ‌డ్డీ ఎక్కువ ఉండొచ్చు. క్రెడిట్ కార్డ్ బ‌కాయిల‌ను క్లియ‌ర్ చేయ‌డానికి లోన్ తీసుకునేట‌ప్పుడు లోన్‌పై వ‌డ్డీ రేటు, దానికి సంబంధించిన ఛార్జీలు, రీపేమెంట్ సౌల‌భ్యం మొద‌లైన అంశాల‌ను సరిచూసుకోవాలి. క్రెడిట్ కార్డ్ వాడేవారికి ఆర్థిక క్రమశిక్షణ అత్యంత ముఖ్యం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని