Life Insurance: జీవిత బీమా.. మరింత ధీమా

జీవిత బీమా పాలసీలను పాలసీదారులకు మరింత చేరువ చేసే దిశగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) పలు నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసింది.

Published : 13 Jun 2024 02:25 IST

పాలసీ నచ్చకపోతే.. 30 రోజుల్లో వాపసు
పొదుపు పాలసీలపై రుణాలు ఇవ్వాలి
నామినీ వివరాలు ఎప్పుడైనా మార్చుకోవచ్చు
ఐఆర్‌డీఏఐ మాస్టర్‌ సర్క్యులర్‌
ఈనాడు - హైదరాబాద్‌

జీవిత బీమా పాలసీలను పాలసీదారులకు మరింత చేరువ చేసే దిశగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) పలు నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసింది. పాలసీదారు కోరుకుంటే, జీవిత బీమా పొదుపు పాలసీలపై తప్పనిసరిగా రుణం ఇవ్వాలని బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల పాలసీదారులకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని పేర్కొంది. పాలసీ నచ్చకపోతే, దాన్ని వాపసు ఇచ్చే వెసులుబాటు ఇప్పటివరకు 15 రోజులే ఉండేది. దీన్ని 30 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవిత బీమా పాలసీలకు సంబంధించిన నిబంధనలతో బుధవారం మాస్టర్‌ సర్క్యులర్‌ జారీ చేసింది. ఇప్పటికే సాధారణ - ఆరోగ్య బీమా పాలసీల కోసం ఇలాంటి సర్క్యులర్లను ఐఆర్‌డీఏఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

పాలసీదారుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు, బీమా పాలసీల్లో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలుగా నిబంధనలను తీసుకొచ్చినట్లు ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. మాస్టర్‌ సర్క్యులర్‌లో ఇంకా ఏం చెప్పిందంటే..

  • అందరికీ అందుబాటులో ఉండేలా జీవిత బీమా పథకాలను రూపొందించాలి. అన్ని వయసుల వారు, ప్రాంతాల వారు, దివ్యాంగులు ఎంచుకునేలా పాలసీలు ఉండాలి. పాలసీదారుడు తన అవసరం మేరకు రైడర్లను ఎంచుకునే అవకాశం కల్పించాలి. 
  • పాలసీదారులకు పూర్తి సమాచారం ‘కస్టమర్‌ ఇన్ఫర్మేషన్‌ షీట్‌’ రూపంలో అందించాలి. ఇందులో పాలసీ రకం, పాలసీ మొత్తం, అందించే ప్రయోజనాలు, మినహాయింపులు, క్లెయిం విధివిధానాలు అన్నీ ఉండాలి.
  • పాలసీ అందించే ప్రయోజనాలను సోదాహరణంగా వివరించాలి. దీనిపై బీమా సంస్థ, పాలసీదారు పరస్పరం అంగీకరిస్తున్నట్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. 
  • పాలసీ వ్యవధి తీరిన తర్వాత చెల్లించే మొత్తం, పాలసీదారు మరణించినప్పుడు ఇచ్చే పరిహారం వివరాలు స్పష్టంగా పేర్కొనాలి. 
  • పాలసీ పునరుద్ధరణ సమయంలో గడువులోపు ప్రీమియం చెల్లించకపోతే.. మరో 30 రోజుల అదనపు వ్యవధిని ఇవ్వాలి. నెలవారీ ప్రీమియం చెల్లించే పాలసీలకు ఇది 15 రోజులుగా ఉంటుంది. 
  • పింఛను పాలసీలు తీసుకున్న పాలసీదారులకు, పిల్లల ఉన్నత విద్య, వివాహం వంటి ముఖ్యమైన  సందర్భాల్లో పాక్షికంగా కొంత మొత్తం ఉపసంహరించుకునేందుకు అనుమతించాలి. ఇంటి కొనుగోలు, వైద్య ఖర్చులు, తీవ్ర అనారోగ్యానికి చికిత్సల కోసమూ ఈ వెసులుబాటు ఉండాలి.
  • పాలసీలను స్వాధీనం చేసినప్పుడు పాలసీదారులకు సహేతుక విలువను చెల్లించాలి.
  • పాలసీదారుల ఫిర్యాదుల పరిష్కారానికి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  • బీమా అంబుడ్స్‌మన్‌ ఇచ్చిన అవార్డుపై బీమా సంస్థ అప్పీలుకు వెళ్లకపోతే.. 30 రోజుల్లోగా దాన్ని అమలు చేయాలి. ఒకవేళ ఈ గడువు దాటితే ఫిర్యాదుదారులకు రోజుకు రూ.5,000 చొప్పున చెల్లించాలని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. బీమా సంస్థలు మోసపూరితంగా పాలసీలను అంటకట్టకూడదని, పాలసీదారులకు ఆర్థికంగా నష్టం కలిగే విధానాలను అనుసరించకూడదనీ సూచించింది.

పాలసీదారు మరణించిన సందర్భంలో పరిహారం చెల్లించేందుకు వీలుగా నామినీ పేరును తెలియజేసే సౌకర్యం ఉండాలి.   ఈ పేరును ఎప్పుడైనా మార్చుకునేందుకు అనుమతించాలి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని