Updated : 07 May 2022 13:36 IST

Mothers day Gifts: మాతృదినోత్సవం రోజు అమ్మకు ఈ గిఫ్ట్‌ ఇద్దామా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: రేపు (మే 8) మాతృదినోత్సవం (Mother's Day). చాలా మంది తమ తల్లుల త్యాగాలు గుర్తిస్తూ స్టేటస్‌లు పెడుతుంటారు. మరికొందరు చీరను బహుమతిగా ఇచ్చి ప్రేమను చాటుకుంటారు. ఇంకొందరు అమ్మకు ఆ రోజు సెలవిచ్చి ఆమె పనులన్నీ చక్కబెడుతుంటారు. అయితే, ఈసారి కొంచెం స్పెషల్‌గా ప్లాన్‌ చేస్తే ఎలా ఉంటుంది? ఏవైనా ఆర్థికపరమైన బహుమతులిచ్చే (Financial Gifts) ప్రయత్నం చేస్తే! ఫలితంగా గిఫ్ట్‌ ఇవ్వడంతో పాటు ఆమె అవసరాలనూ తీర్చిన వాళ్లమవుతాం..

ఆమె కోసం ఓ ప్రత్యేక నిధి..

మన అవసరాల్ని, ఆశల్ని తీర్చే క్రమంలో అమ్మ తన ఎన్నో ఆశల్ని, ఆశయాల్ని సమాధి చేసుకుంటుంది. కనీసం మనం ఎదిగాకైనా వాటిని తెలుసుకొని తీర్చడం కనీస బాధ్యత. అందుకోసం ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి అమ్మకు గిఫ్ట్‌గా ఇస్తే ఎంత బాగుంటుంది. ఏదైనా ఆలయాన్ని సందర్శించడం, విహారయాత్రకు వెళ్లడం కోసం వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఆ డబ్బుతో తనకు నచ్చిన పని చేసుకునే వెసులుబాటు కల్పించాలి. అందుకు క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని పక్కన పెట్టి ఆమెకు అప్పగించాలి.

ఆరోగ్యానికి భరోసా..

ఆరోగ్యానికి మించిన సంపద లేదు. మనకోసం జీవితాంతం కష్టపడిన అమ్మ ఆరోగ్యం కోసం ఈ సందర్భంగా ఏదైనా చేయాలి. ఆరోగ్య బీమా (Health Insurance) తీసుకుంటే ఉత్తమం. ఆమెకేమైనా ఆరోగ్య సమస్యలుంటే.. అవన్నీ కవర్‌ అయ్యే బీమా తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారి కోసం ‘క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌’ (Critical Illness Cover) చాలా ముఖ్యం. 

* ఫుల్‌ బాడీ చెక్‌-అప్‌ హెల్త్‌ ప్యాకేజీని ఇచ్చి అమ్మను సర్‌ప్రైజ్‌ చేయడానికి ఇదొక మంచి అవకాశం. తద్వారా ఆమెకు తన ఆరోగ్యంపై ఓ భరోసానిచ్చిన వాళ్లమవుతాం. వయసు మీద పడుతున్న కొద్దీ ఏవైనా రుగ్మతలు చుట్టుముడతాయేమోనని ఆందోళన చెందడం సహజం. దాన్ని నివారించడానికి ఇదొక మంచి మార్గం. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం వల్ల వారికి వారి ఆరోగ్యంపై ఎలాంటి బెంగ ఉండదు. ఫలితంగా తమ సమయాన్ని కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

పేపర్‌ గోల్డ్‌ కొనివ్వండి..

చాలా మందికి అమ్మలకు బంగారం అంటే మక్కువ. కానీ, స్వచ్ఛత, భద్రత ఆందోళనగా మారిన ఈరోజుల్లో కాగితపు బంగారం గురించి ఆమెకు వివరించండి. వాటి వల్ల ఉన్న ప్రయోజనాలను వివరించండి. పసిడి బాండ్ల (Sovereign Gold Bond)తో బంగారంతో పాటు అదనంగా వడ్డీ కూడా వస్తుందంటే వాళ్లింకా సంతోషిస్తారు. అలాగే డిజిటల్‌ గోల్డ్ (Digital Gold)‌, గోల్డ్‌ ఈటీఎఫ్‌ (Gold ETF) వంటి వాటి గురించి వివరించి కొనిపెట్టండి.

(Also Read: ఒక్క రూపాయితోనూ బంగారం కొనొచ్చు!)

అమ్మకు ఆర్థిక స్వేచ్ఛ..

ఏ వయసులోని వారికైనా ఆర్థిక స్వేచ్ఛ చాలా అవసరం. ఓ వయసు దాటిన తర్వాత రెగ్యులర్‌గా ఆదాయం వచ్చేలా పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. అందుకు యాన్యుటీ ప్లాన్లు (Annuity Plans) అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొంతకాలం పాటు మదుపు చేస్తే.. తర్వాత జీవితాంతం క్రమం తప్పకుండా పెన్షన్‌ రూపంలో ఆదాయం వస్తుంటుంది. వాటితో మన కనీస అవసరాలకు డబ్బు సమకూరుతుంది. అప్పుడు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అందుకే అమ్మకు యాన్యుటీ ప్లాన్‌ ద్వారా ఆర్థిక స్వేచ్ఛనిద్దాం. ‘సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం’ (Senior Citizens Savings Sheme) కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. మూడు నెలలకోసారి వడ్డీరూపంలో ఆదాయం వస్తూ ఉంటుంది.

(Also Read: ఈ 6 సూత్రాలతో.. మీ డబ్బులకు డబ్బులు కాస్తాయి)

డిజిటల్‌కు పరిచయం..

ఇంతకాలం కాగితాలు, నగదుతో కాలం వెళ్లదీసిన అమ్మకు డిజిటల్‌ లావాదేవీలను (Digital Transactions) పరిచయం చేద్దాం. ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం ఎలాగో నేర్పిద్దాం. సరకులు, కూరగాయలు, దుస్తులు.. ఇలా ఎక్కడికెళ్లినా ఆన్‌లైన్‌ లావాదేవీ (Online Transactions)లు చేసేలా ప్రోత్సహిద్దాం. తద్వారా ఎక్కువ డబ్బును తన దగ్గర పెట్టుకోకుండానే అవసరాలను తీర్చుకునే మార్గాన్ని చూపిద్దాం. పైగా డబ్బు దగ్గర ఉంచుకోవడంలో వారికి ఉన్న భయాన్నీ పారదోలిన వాళ్లమవుతాం.

సొంత బిజినెస్‌కు నిధులిద్దాం..

తన జీవితంలో ఎంతో మంది స్వయం ఉపాధి పొందుతున్న మహిళల్ని చూసి అమ్మ స్ఫూర్తి పొంది ఉంటుంది. తానూ అలా ఏదైనా వ్యాపారం చేసి నలుగురికి ఉపాధి కల్పించాలని కలగని ఉంటుంది. మరి ఇప్పుడు ఆమె ఆశని నెరవేరిస్తే ఎంతో సంతోషిస్తుంది. అలా ఆమె కలల వ్యాపారమేంటో కనుక్కొని కొంత పెట్టుబడి పెడదాం. ఫలితంగా మంచి బహుమతి ఇవ్వడంతో పాటు ఆదాయ వనరునీ చూపించిన వాళ్లమవుతాం. ఆ వ్యాపారంలో లాభాలు గడిస్తే ఆమెకు కలిగే ఆనందం గురించి చెప్పాల్సిన పనే లేదు.

స్టాక్స్‌ కొనిద్దాం..

కొంతమంది అమ్మలకు స్టాక్‌ మార్కెట్‌ (Stock Market)పై కొంత అవగాహన ఉండి ఉంటుంది. కానీ, అదొక జూదం అన్న అపోహ వల్ల వారు దాని జోలికి వెళ్లి ఉండకపోవచ్చు. పైగా దీరూభాయ్‌ అంబానీ, నారాయణమూర్తి, రతన్‌ టాటా వంటి దిగ్గజాల నుంచి వారు జీవితంలో స్ఫూర్తి పొంది ఉంటారు. మరి అలాంటి వారి కంపెనీల్లో అమ్మకు స్టాక్స్‌ కొనిస్తే డిఫరెంట్‌గా ఉంటుంది కదా! ఒకే దెబ్బతో రెండు పిట్టలన్నట్లుగా.. వారు స్ఫూర్తిపొందిన వ్యక్తుల కంపెనీల్లో వారు వాటాదారులు కావడంతో పాటు స్టాక్‌ మార్కెట్లో మదుపు చేయాలన్న కల కూడా నెరవేరుతుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని