Four bucket strategy: ఆర్థిక లక్ష్యాల సాధనకు ‘నాలుగు బకెట్ల’ వ్యూహం!

Four bucket strategy: మన లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను ప్లాన్‌ చేసుకోవాలి. ఈ పెట్టుబడులను నాలుగు బకెట్ల కింద విభజించుకొని.. ఒక్కో బకెట్‌ను ఒక్కో కేటగిరీ పెట్టుబడుల కోసం కేటాయించాలి.

Published : 15 Feb 2023 11:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భవిష్యత్‌ లక్ష్యాలు, అవసరాలకు అనుగుణంగా పెట్టుబడుల (Investments) ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. సొంతిల్లు, పిల్లల చదువులు, వారి పెళ్లి, రిటైర్‌మెంట్‌.. ఇలా చాలా లక్ష్యాలే ఉంటాయి. వాటిని గుర్తించిన తర్వాత సరైన పెట్టుబడి ప్రణాళికను ఎంచుకోవాలి. ఎంత డబ్బు అవసరం, కాలపరిమితి, రాబడి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

కానీ, చాలా మందికి ఇది ఒక పెద్ద సంక్లిష్ట ప్రక్రియ. లక్ష్యాలను గుర్తించడం, వాటికి తగిన పెట్టుబడి (Investments) మార్గాలను సిద్ధం చేసుకోవడం.. ఇదంతా అంత సులువుగా అయ్యే పని కాదని భావిస్తుంటారు. అలాంటి వారికోసం ఆర్థిక నిపుణులు నాలుగు బకెట్ల వ్యూహాన్ని (Four Bucket Strategy) సూచిస్తున్నారు. మరి అదేంటి? ఎలా పనిచేస్తుంది? మనకు ఎలా ఉపయోగపడుతుంది?

మొదటి బకెట్‌: అత్యవసర నిధి

మొదటి బకెట్‌ అత్యవసర నిధులకు (Emergency Funds) సంబంధించినది. కాలపరిమితి లేకుండా తక్షణమే డబ్బు అవసరమయ్యే ఖర్చులను ఈ కేటగిరీలో చేర్చాలి. ఉదాహరణకు వైద్య ఖర్చుల కోసం ఎప్పుడూ కొంత డబ్బును సిద్ధంగా ఉంచుకోవాలి. దానికోసం నెలనెలా కొంత పక్కకు తీసి పెట్టాలి. అలాగే అనుకోకుండా ఉపాధి కోల్పోతే ఇంటిని నెట్టుకురావడానికి కావాల్సిన డబ్బును కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బులను పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ నిధులను వెంటనే నగదు రూపంలోకి మార్చుకోగలిగే అవకాశం ఉన్న మార్గాల్లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఉదాహరణకు బ్యాంక్‌, పోస్టాఫీస్‌ డిపాజిట్లు, డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు.

రెండో బకెట్‌: స్వల్పకాలిక లక్ష్యాల కోసం..

స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం చేసే పెట్టుబడులు రెండో బకెట్‌లోకి వస్తాయి. రెండు లేదా మూడేళ్ల తర్వాత అవసరమయ్యే డబ్బు కోసం ఇన్వెస్ట్‌ చేయాలి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వంటి స్థిర ఆదాయ మార్గాలు, షార్ట్‌టర్మ్‌ డెట్‌, డైనమిక్‌ బాండ్‌ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టొచ్చు. బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లను కూడా పరిశీలించొచ్చు. 

మూడో బకెట్‌: మధ్యకాలిక లక్ష్యాల పెట్టుబడులు

ఐదు నంచి ఏడేళ్ల కాలపరిమితితో కూడిన లక్ష్యాల కోసం చేసే పెట్టుబడులను ఈ బకెట్‌ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ కొంత వరకు రిస్క్‌ తీసుకోవడానికి వెనుకాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వీటి కోసం ఈక్విటీ అంటే స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. లార్జ్‌ క్యాప్‌ ఫండ్లు, హైబ్రిడ్‌ ఫండ్ల వంటి మ్యూచువల్‌ ఫండ్ల కేటగిరీలను మూడో బకెట్‌ పెట్టుబడుల కోసం పరిశీలించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

నాలుగో బకెట్‌: దీర్ఘకాలిక పెట్టుబడులు..

సంపద సృష్టి లక్ష్యంతో చేసే పెట్టుబడులు నాలుగో బకెట్‌ పరిధిలోకి వస్తాయి. అలాగే పన్ను ఆదా కోసం చేసే పెట్టుబడులను కూడా ఈ కేటగిరీలోకే తీసుకురావొచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం స్థిరాస్తి, నాణ్యమైన కంపెనీల షేర్లు, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు, ఎన్‌పీఎస్‌, పీపీఎఫ్‌, మల్టీక్యాప్‌ ఫండ్స్‌ వంటి మార్గాలను పరిశీలించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని