Financial Mistakes: కొత్త ఏడాదిలో ఈ 6 తప్పులు అస్సలు చేయొద్దు..!

Financial Mistakes: ఆర్థిక విషయాల్లో మనం చేసే తప్పుల వల్ల మనపై ఆధారపడేవారు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. కొత్త ఏడాదిలో అలాంటి తప్పులు జరగకుండా చూడాలి.

Updated : 01 Jan 2023 10:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త ఏడాదిలో అడుగుపెట్టగానే చాలా మంది కొత్త కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. ఆరోగ్యంపట్ల శ్రద్ధ పెట్టడంలో భాగంగా పార్కులకు పరుగులు తీస్తుంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్లడానికీ ప్రణాళికలు రూపొందించుకుంటారు. చాలా మంది ఇతర విషయాల మీద పెట్టే శ్రద్ధ.. ఆర్థిక విషయాల మీద పెద్దగా పెట్టరు. మిగిలిన విషయాల్లో మన నిర్ణయాలు ఎలా ఉన్నా.. ఆర్థిక విషయాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆర్థికంగా మనం చేసే పొరపాట్లు మనతో పాటు మనపై ఆధారపడే వారు సైతం ప్రభావితం అవుతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి కొత్త ఏడాదిలో ఆర్థికంగా చేయకూడని కొన్ని తప్పులను తెలుసుకుందాం. ఒకవేళ పాత ఏడాదిలో ఈ తప్పులు చేసుంటే పరిహరించేందుకు ప్రయత్నిద్దాం..

పొదుపు దేనికోసం చేస్తున్నాం?

కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు.. ఇప్పటికే ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నవారు సైతం కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. పొదుపు అనగానే చాలా మంది పన్ను ప్రయోజనాలు పొందే మార్గాల కోసమే అన్వేషిస్తుంటారు. లేదంటే ఎక్కువ రిటర్నులు ఆశించి పెట్టుబడులు పెడుతుంటారు. ఆర్థిక విషయాల్లో తెలివైన వారైతే ఈ పొరపాట్లు చేయరు. ఆదాయపు పన్ను మినహాయింపులు పొందడం కోసం కొంత వరకు బీమా, ఇతర పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టడం మంచిదే అయినప్పటికీ.. మన పెట్టుబడులకు ఒక లక్ష్యం ఉంటే అది ఫలప్రదం అవుతుంది. లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు ఒకరకమైన సంతృప్తి కలుగుతుంది. కాబట్టి ఏడాది ప్రారంభంలోనే మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. అదీ సాధించగలిగే లక్ష్యమై ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

బీమా విషయంలో ఆ తప్పులొద్దు

జీవిత బీమా పట్ల ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి తరానికి అవగాహన పెరిగిన మాట వాస్తవం. అయితే, ఇప్పటికీ చాలా మంది జీవిత బీమా కోసం వెచ్చించే మొత్తం తిరిగి రావాలని కోరుకునేవారే ఉంటున్నారు. వాస్తవానికి మనపై ఆధారపడే కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవడం తెలివైన నిర్ణయం. మన వయసు, ఆదాయం, కెరీర్‌, కుటుంబ సభ్యుల అవసరాలు వంటివి పరిగణనలోకి తీసుకుని అందుకు తగ్గట్లుగా టర్మ్‌ బీమా పాలసీని తీసుకోవాలి. అలాగని తక్కువ ప్రీమియం కోసం తక్కువ మొత్తం ఎంచుకోవడమూ సరికాదు. కాబట్టి అవసరాలు, చెల్లించగలే స్తోమతను బట్టి టర్మ్‌ బీమా పాలసీ తీసుకోండి.

ఈ రూల్‌ పాటిస్తున్నారా?

‘‘ప్రస్తుతం నెలకు లక్ష వస్తోంది. వచ్చే ఏడాది ఓ 10 శాతం ఇంక్రిమెంట్‌. ఒకవేళ కంపెనీ మారితే 30 శాతం హైక్‌ అనుకుంటే నెలకు రూ.1.30 లక్షలు వేతనం వస్తుంది. ఇంకేం బిందాస్‌!’’.. చాలా మంది యువత ఆలోచనలు ఇలానే ఉంటున్నాయి. వచ్చే ఏడాది పెరగబోయే వేతనాన్ని కూడా అంచనా కట్టి గాల్లో మేడలు కట్టే్స్తుంటారు. జీతం పెరిగాక చూద్దాంలే అనే తీరుతో ముందుకు సాగిపోతూ పొదుపు పక్కనపెడుతుంటారు. కొవిడ్‌ పరిస్థితులు, ఉద్యోగ కోతలు చూశాకైనా ఈ ధోరణి మార్చుకోవాలి. ఎప్పుడూ ప్రస్తుత జీతాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. ఇందులో 50-30-20 సూత్రాన్ని నిత్యం పాటించాలి. మనం సంపాదించేదాంట్లో 50 శాతం అద్దెలు, కిరాణా, బిల్లు చెల్లింపులు వంటివి అవసరాలకు వినియోగించాలి. 30 శాతం కోరికలు, సరదాలు వంటివాటికి వినియోగించొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ 20 శాతం మొత్తాన్ని పొదుపు పెట్టుబడుల కోసం వినియోగించాలన్న విషయం గుర్తుంచుకోవాలి.

అత్యవసర నిధి ఉందా?

పైన చెప్పినట్లు పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. పైగా అవసరాలు చెప్పిరావు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కరోనా సమయంలోనూ, ఇటీవల మాంద్యం భయాల నేపథ్యంలోనూ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైనా ఎలాంటి ఇబ్బందీ లేకుండా నిత్య జీవితం ఒడుదొడుకులకు లోను కాకుండా ఉండాలంటే కనీసం 4 నుంచి 6 నెలల జీతం మన అత్యవసర నిధిలో ఉండాలి.

విలాసాలకు పోకుంటేనే దిలాసా

చాలా మందికి చిన్నప్పటి నుంచి తీరని కోరికలు ఉంటాయి. ఉద్యోగంలోకి రాగానే వచ్చే జీతంతో ఆ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. కలలను సాకారం చేసుకోవడం మంచిదే అయినా అది విలాసాలకు దారితీయకుండా ఉంటే మంచిది. ఈఎంఐలు కట్టగలిగే స్తోమత ఉన్నంత మాత్రాన విలాసాలకు పోతే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖర్చులు పరిమితితో ఉండేలా చూసుకోవడం మంచిది.

క్రెడిట్‌ కార్డు ఎల్లప్పుడూ మిత్రుడు కాదు!

ఇప్పుడు క్రెడిట్‌ కార్డు పొందడం చాలా ఈజీ. దీంతో దాదాపు అందరి వద్దా క్రెడిట్‌కార్డులు ఉంటున్నాయి. లిమిట్‌ కూడా కొందరికి లక్షల్లో ఉంటోంది. ఏదైనా అత్యవసరం అయినప్పుడు ఈ లిమిట్‌ అక్కరకొస్తుంది. సరిగ్గా వాడుకుంటే క్రెడిట్‌కార్డు ఆప్తమిత్రుడిలా పనిచేస్తుంది. ఒకవేళ ఆఫర్ల మోజు, క్యాష్‌బ్యాక్‌ల క్రేజ్‌లో చిక్కుకుంటే మాత్రం తడిసిమోపెడవుతుంది. ఒక్కోసారి బిల్లు చెల్లింపులు చేయడానికి అప్పు మీద అప్పు చేయాల్సి వస్తుంది. ఒకసారి అప్పుల ఊబిలో చిక్కుకుంటే బయటపడడం అంత సులువు కాదు. చాలా మంది ఈ నియంత్రణ లేకే క్రెడిట్‌కార్డులను రద్దు చేసుకుంటున్నారు. కాబట్టి కొత్త ఏడాదిలో క్రెడిట్‌కార్డుపై మీ పట్టు పెంచుకోండి. గతంలో పొరపాట్లు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు