Financial Planning: దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల్లో పిల్ల‌ల ఉన్న‌త విద్య‌ను చేర్చారా?

చిన్న చిన్న ప‌నుల చేసుకునే వారి ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తి ఒక్క‌రూ త‌మ పిల్ల‌ల‌ను ఉన్న‌త స్థాయిలో చూడాల‌ని ఆశ‌ప‌డుతుంటారు. ఇందుకోసం చాలా క‌ష్ట‌ప‌డుతుంటారు కూడా. అయితే ఖర్చులు విప‌రీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో పిల్లల చదువుకోసం ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బును ఖ‌ర్చుపెట్ట‌డం ఎవ‌రికైనా కష్టమే.

Updated : 29 Dec 2021 17:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న చిన్న ప‌నుల చేసుకునే వారి ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తి ఒక్క‌రూ త‌మ పిల్ల‌ల‌ను ఉన్న‌త స్థాయిలో చూడాల‌ని ఆశ‌ప‌డుతుంటారు. ఇందుకోసం చాలా క‌ష్ట‌ప‌డుతుంటారు కూడా. అయితే ఖర్చులు విప‌రీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో పిల్లల చదువుకోసం ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బును ఖ‌ర్చుపెట్ట‌డం ఎవ‌రికైనా కష్టమే. దీనికోసం దీర్ఘకాలిక ప్ర‌ణాళిక‌ ఉండాల్సిందే. భవిష్యత్‌ కోసం పెట్టుబడులు పెట్టే త‌ల్లిదండ్రులు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలలో పిల్లల ఉన్నత విద్యను తప్పక చేర్చాలి. అలాంటివారు ఎంత త్వరగా ప్రణాళిక వేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీరు అనుకున్న లక్ష్యానికి కావల‌సిన మొత్తాన్ని స‌మ‌కూర్చేందుకు కనీసం 10-15 సంవత్సరాల సమయం పడుతుంది. స్వ‌దేశంలో మంచి పేరున్న క‌ళాశాల‌లో ఉన్న‌త విద్య అభ్య‌సించేందుకే చాలా ఖ‌ర్చవుతుంది. అలాంటిది విదేశాల‌లో చ‌దువుకోవాలంటే మ‌రింత ఖ‌ర్చ‌వుతుంది. మ‌రి దీనికి ఏం చేయాలి?

అంచనా వేయండి: భ‌విష్య‌త్‌లో మీ పిల్ల‌లు ఎలాంటి విద్య‌ను అభ్య‌సించాల‌ని మీరు కోరుకుంటున్నారో ఆ విద్య‌కు ప్ర‌స్తుతం అయ్యే ఖ‌ర్చును తెలుసుకోండి. దానికి ద్ర‌వ్యోల్బణాన్ని జోడించి అప్ప‌టికి కావాల‌సిన మొత్తాన్ని అంచనా వేయండి. ఈ ల‌క్ష్యం కోసం ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత కూడ‌బెట్టారో.. ఇంకా ఎంత మొత్తం కావాలో లెక్కించండి. కావలిసిన నిధికి త‌గిన‌ట్లుగా ల‌క్ష్యం చేరుకునేందుకు ఉన్న స‌మ‌యం వ‌ర‌కు అంటే 10 నుంచి 15 సంవ‌త్స‌రాలు సిప్ రూపంలో మ‌దుపు చేయండి. ప్ర‌తి ఏడాదీ సిప్ మొత్తాన్ని 10 నుంచి 20 శాతం పెంచేందుకు ప్ర‌య‌త్నించండి. భ‌విష్య‌త్‌లో మీ పాప‌/ బాబు త‌మ‌కు న‌చ్చిన రంగంలో ఉన్న‌తంగా ఎదిగేందుకు ఈ మొత్తం స‌హాయ పడుతుంది.

ఇత‌ర ల‌క్ష్యాల‌ను విస్మ‌రించొద్దు: ముందే చెప్పుకున్న‌ట్లు విద్య కోసం విదేశాలకు పంపించాలంటే చాలా మొత్తం ఖ‌ర్చ‌వుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు విదేశీ విద్య‌కు రూ.1 కోటి అవ‌స‌రం అనుకోండి. ఈ మొత్తం స‌మ‌కూర్చుకునేందుకు మీ మొత్తం పొదుపు ఈ ఒక్క ల‌క్ష్యానికే ప‌రిమితం చేయ‌డం క‌రక్ట్ కాదు. ప‌ద‌వీ విర‌మ‌ణ వంటి ల‌క్ష్యాల కోసం కూడా కొంత మొత్తాన్ని కేటాయించాల‌ని గుర్తుంచుకోవాలి. ఉన్న‌త విద్య కోసం బ్యాంకులు విద్యా రుణాల‌ను మంజూరు చేస్తున్నాయి. కొంత మీరు స‌మ‌కూర్చినా.. మిగిలిన మొత్తం బ్యాంకుల నుంచి రుణం రూపంలో పొందొచ్చు. కానీ ప‌ద‌వీ విర‌మ‌ణకు ఎలాంటి రుణం ల‌భించ‌దు. కాబట్టి ల‌క్ష్యాల‌ను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడుల కేటాయింపు నిర్ణయం తీసుకోవాలి.

రుణాన్ని ప‌రిగ‌ణించాలి: కొంతమంది ఉన్నత విద్య కోసం తమకు సరిపోయేంత డబ్బు ఉన్నప్పుడు మళ్లీ రుణం ఎందుకు? అనుకుంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే.. విద్యా రుణం తీసుకోవ‌డం వ‌ల్ల పిల్లల‌కు బాధ్యత ఉంటుంది. రుణం చెల్లింపులు చేయాల్సి వ‌స్తే డబ్బు సంపాదనపై మ‌రింత‌గా దృష్టి సారిస్తారు. మ‌రింత ప‌ట్టుద‌ల‌గా చ‌ద‌వి అనుకున్న ల‌క్ష్యాన్ని త్వ‌ర‌గా సాధిస్తారు. రుణం తీసుకుంటే పన్ను క్లెయిమ్ చేసుకోవచ్చు. విద్యా రుణంపై వడ్డీ రేట్లకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఎంత రుణం తీసుకున్నా వడ్డీపై పన్ను క్లెయిమ్ చేసుకునేందుకు పరిమితులు ఉండవు. అలాగే మీ వ‌ద్ద ఉన్న డ‌బ్బు మీ వ్యాపారం లేదా ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు. లేదంటే భ‌విష్య‌త్‌లో మీ పిల్ల‌ల‌కే బ‌హుమతిగా ఇవ్వొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని