Financial Planning: ఆర్థిక అత్య‌వ‌స‌రాల‌కు సిద్ధంగా ఉన్నారా

జీవితంలో ఎదుర‌య్యే ప్ర‌తీ స‌వాలును ఎదుర్కునేందుకు మాన‌సికంగానూ, ఆర్థికంగానూ సిద్ధంగా ఉండాలి. 

Updated : 07 Feb 2022 16:50 IST

కోవిడ్‌-19 వ‌ల్ల ఏర్ప‌డిన ప‌రిణామాల‌ను ఇంత‌కు ముందెన్నెడూ మ‌నం చూడ‌లేదు. క‌నీసం ఊహించ‌లేదు. ఈ మ‌హ‌మ్మారి మ‌న దేశంలో ప్ర‌వేశించి దాదాపు రెండేళ్లు పూర్త‌వుతున్నా ఇంకా వివిధ వేరియంట్ల రూపంలో ప్రభావం చూపుతూనే ఉంది. ఈ రెండేళ్ల‌లో ఆప్తుల‌ను కోల్పోయిన వారు కొంద‌రైతే, ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ప‌డిన వారు చాలామందే ఉన్నారు. దీంతో ఆరోగ్యం కంటే మ‌రేదీ ముఖ్యం కాద‌ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది. ఏది ఏమైనా గ‌తంలోని అనుభ‌వాల నుంచి పాఠాల‌ను నేర్చుకుని భ‌విష్య‌త్తును నిర్మించుకోవాలి. అన్ని ప‌రిస్థితుల‌ను ఎదుర్కునేలా మ‌న‌ల్ని మ‌న‌మే సిద్ధం చేసుకోవాలి.

ఆర్థికంగా ఎలా సిద్ధ‌ప‌డాలి?
స్మార్ట్ సేవింగ్‌, రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యూహాల‌తో అన్ని వేళ‌లా సుర‌క్షితం ఉండేందుకు ప్లాన్ చేసుకోవ‌చ్చు.

అత్య‌వ‌స‌ర నిధి..
అనుకోకుండా వ‌చ్చే ఖ‌ర్చులు జీవ‌న శైలికి అంత‌రాయం క‌లిగించ‌వ‌చ్చు, లేదా పెట్టుబ‌డులు రద్దు చేయాల్సిన ప‌రిస్థితులు కూడా రావ‌చ్చు. లేదంటే అప్పు చేయాల్సి రావ‌చ్చు. అలా కాకుండా ఉండాలంటే లిక్విడ్ ఎసెట్స్‌ని నిర్వ‌హించ‌డం మంచిది. సాధార‌ణంగా మూడు నుంచి ఆరు నెల‌ల కుటుంబ ఖ‌ర్చుల‌కు స‌రిపోయే మొత్తాన్ని అత్య‌వ‌స‌ర నిధిలో అందుబాటులో ఉంచాల‌ని చెబుతారు. అయితే, 6 నుంచి 12 నెల‌ల ఖ‌ర్చుల‌కు స‌రిపోయే మొత్తాన్ని ఏర్పాటు చేసుకోవడంలో మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ఆర్థిక అత్య‌వ‌స‌రాల‌కు సిద్ధ‌ప‌డ‌వ‌చ్చు. 

అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటులో భాగంగా ముందుగా నెల‌వారి ఖ‌ర్చుల‌ను అంచ‌నా వేయాలి. ఇంటి అద్దె/నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు, కిరాణా, ర‌వాణా, మెడిసిన్స్, ఇత‌ర వినియోగ వ‌స్తువులు చేర్చాలి. వీటికి పిల్ల‌ల ట్యూష‌న్ ఫీజులు, రుణాల‌కు చెల్లించాల్సి ఈఎమ్ఐలు వంటి త‌ప్ప‌ని ఖ‌ర్చులన్నింటిని క‌లిపి నెల‌వారి ఖ‌ర్చుల‌ను అంచ‌నా వేయాలి. 

అత్య‌వ‌స‌ర నిధి = (నెల‌వారి త‌ప్ప‌నిస‌రి ఖ‌ర్చులు + ఇత‌ర ఖ‌ర్చులు (ఇవి ప్ర‌తీ నెల ఉండ‌వు)) * 6 +  ఇత‌ర పెద్ద ఖ‌ర్చులు

అత్య‌వ‌స‌ర నిధిని 10:20:70 నిష్ప‌త్తిలో విభ‌జించి, స‌త్వ‌ర అవ‌స‌రాల కోసం 10 శాతం నిధిని న‌గ‌దు రూపంలోనూ, 20 శాతం నిధిని బ్యాంకు పొదుపు ఖాతాలోనూ (వెంట‌నే విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా), 70 శాతం మొత్తాన్ని త‌క్కువ న‌ష్ట‌భ‌యంతో పాటు, లిక్విడిటీ ఉండే షార్ట్ ట‌ర్మ్ లిక్విడ్ ఫండ్లు, మ‌నీ మార్కెట్ ఫండ్లు, బ్యాంక్ డిపాజిట్లలో మ‌దుపు చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల 70 శాతం నిధి నుంచి కొంత రాబ‌డి పొందవ‌చ్చు.

ఆరోగ్య బీమా..
ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడికి ప్ర‌ధాన కార‌ణం వైద్యం కోసం అయ్యే ఖ‌ర్చులు. ఏదైనా అనారోగ్యం కార‌ణంగా కుటుంబంలో ఏ ఒక్క‌రు ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌చ్చినా అందుకు అయ్యే ఖ‌ర్చుల కోసం అప్పులు చేయాల్సిన ప‌రిస్థితులు వ‌స్తున్నాయి. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ఆరోగ్య బీమా ఒక్క‌టే మార్గం. మీతో పాటు మీ కుంటుంబానికి స‌రిపోయే ఆరోగ్య బీమా త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే. ఇందుకోసం సమగ్ర ఆరోగ్య బీమా పథకం, కుటుంబం కోసం ఫ్యామిలీ ఫ్లోటర్‌ను పరిగణించాలి. టాప్‌-అప్ ప్లాన్లు, రైడ‌ర్లతో నామ‌మాత్ర‌పు అద‌న‌పు ప్రీమియంను జోడించి క‌వ‌రేజ్‌ను గ‌ణ‌నీయంగా పెంచుకోవ‌చ్చు. 

జీవిత బీమా..
అదేవిధంగా, జీవిత బీమా..అంటే ఒక టర్మ్ ప్లాన్. కుటుంబ ఆర్థిక‌ శ్రేయ‌స్సు కోసం ఇది త‌ప్ప‌నిస‌రి. బీమా క్లెయిమ్ నుంచి వచ్చే ఆదాయం మీరు లేని స‌మ‌యంలో కుటుంబానికి స్థిరమైన జీవనోపాధి ఏర్పాటుకు స‌హాయ‌ప‌డుతుంది. మీరు తీసుకున్న రుణాలు కుటుంబ సభ్యుల‌కు భారం కాకుండా ట‌ర్మ్ బీమా స‌హాయ‌ప‌డుతుంది. వార్షిక ఆదాయానికి  15 నుంచి 20 రెట్లు హామీ మొత్తం ఉండాలి. మీ ఆర్థిక ల‌క్ష్యాలు, బాధ్యతలు, ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసిన తర్వాత అధిక కవరేజీని పరిగణించండి.

రుణ నిర్వ‌హ‌ణ‌..
అప్పు చేసే ముందే చెల్లింపుల కోసం ప్ర‌ణాళిక ఉండాలి, లేదంటే రుణాల‌పై నియంత్ర‌ణ కోల్పోయే ప్ర‌మాదం ఉంది. పొదుపు, భ‌విష్య‌త్తు ల‌క్ష్యాలు దెబ్బ‌తింటాయి. త‌ప్ప‌దు అనుకంటే త‌ప్ప రుణం తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. నెల‌వారి ఈఎమ్ఐ (సెక్యూర్డ్ + అన్‌సెక్యూర్డ్ రుణాలు క‌లిపి) టేక్-హోమ్ జీతంలో 30 శాతం కంటే త‌క్కువ ఉండేలా జాగ్ర‌త్త ప‌డాలి. ఇది మంచి క్రెడిట్ స్కోరు సాధించ‌డంలోనూ స‌హాయ‌ప‌డుతుంది. అధిక వ‌డ్డీ రేట్ల‌తో కూడిన రుణాల‌ను ముందుగా చెల్లించేందుకు ప్ర‌య‌త్నించండి. ఇందుకోసం బోన‌స్‌/క‌మీష‌న్‌, పెట్టుబ‌డి ద్వారా వ‌చ్చిన లాభాల‌ను వినియోగించ‌వ‌చ్చు. 

పొదుపును పెంచ‌డం..
పొదుపు సామర్థ్యం మీ ఆర్థిక భవిష్యత్తును నేరుగా ప్రభావితం చేస్తుంది. అత్య‌వ‌స‌ర‌ నిధిని ఏర్పాటు చేయ‌డం, రుణాన్ని తిరిగి చెల్లించడం, దీర్ఘకాలిక ల‌క్ష్యాల‌ కోసం పెట్టుబడి పెట్టేందుకు కావాల్సిన మొత్తాన్ని పొదుపు నుంచే సేక‌రించాలి. మీ టేక్‌-హోమ్ జీతంలో నెల‌వారి పొదుపు ల‌క్ష్యం 30-35 శాతం ఉండాలి. మీ జీవిత లక్ష్యాలు, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని మ‌రింత పొదుపు చేయాలి. క్ర‌మ‌శిక్ష‌ణ‌, స్థిర‌త్వం కోసం.. జీతం ఖాతాలో జ‌మైన వెంట‌నే రుణ చెల్లింపులు, పెట్టుబ‌డుల‌కు నిధుల‌ను మ‌ళ్లించే విధంగా ఆటో-ఇన్వెస్ట్ ప్లాన్‌ను రూపొందించ‌డం ద్వారా నెల‌వారి పొదుపును పెంచుకోవ‌చ్చు. 

చివ‌రిగా..
భ‌విష్య‌త్తులో అవకాశాలు వ‌స్తాయి. అలాగే స‌వాళ్లు ఎదుర‌వుతాయి. రెండింటినీ స‌రిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. పొదును తెలివిగా ప్లాన్ చేసుకోవ‌డం ద్వారా ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా స‌మ‌ర్థ‌వంతంగా అధిగ‌మించ‌వ‌చ్చు. జీవితంలో ఎదుర‌య్యే ప్ర‌తీ స‌వాలును ఎదుర్కునేందుకు మాన‌సికంగానూ, ఆర్థికంగానూ సిద్ధంగా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని