Old pension Scheme: OPSవైపు రాష్ట్రాలు.. రఘురామ్‌ రాజన్ కీలక సూచన

Raghuram Rajan on OPS: పాత పింఛను విధానంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ కీలక సూచన చేశారు. ఆర్థికంగా భారం కాని ఏదైనా ఇతర మార్గాన్ని అన్వేషించాలన్నారు.

Published : 06 Mar 2023 21:09 IST

దిల్లీ: పాత పెన్షన్‌ విధానంపై (OPS) ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ (Raghuram Rajan) ఆందోళన వ్యక్తంచేశారు. దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఓపీఎస్‌ వల్ల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై స్పందించారు. పాత పింఛను విధానం కాకుండా ఇతర మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

ప్రస్తుతం ఉన్న వేతనాల ప్రకారం చూస్తే పాత పింఛను విధానం వల్ల భవిష్యత్‌లో తీవ్ర ఆర్థిక భారం పడుతుందని రాజన్‌ పేర్కొన్నారు. పాత పెన్షన్‌ విధానానికి మారడం అనేది తాత్కాలిక బాధ్యత కాదని, దీర్ఘకాలంపాటు కొనసాగించాల్సి ఉంటుందన్నారు. ఆర్థిక పరిస్థితిపై దీర్ఘకాలిక ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఓపీఎస్‌కు మారే అంశంపై ఆయా రాష్ట్రాలు పునరాలోచన చేయాలన్నారు. పాత పింఛను విధానం అనేది సాంకేతికంగానూ, న్యాయపరంగానూ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. కాబట్టి తక్కువ భారం కలిగే ఇతర మార్గాలను అన్వేషించాలని రాష్ట్రాలకు సూచించారు.

పాత పెన్షన్‌ విధానానికి మారుతున్నట్లు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాలు ప్రకటించాయి. ఇదే విషయాన్ని కేంద్రానికి తెలియజేశాయి. పంజాబ్‌ సైతం పాత పెన్షన్‌ విధానానికి వెళుతున్నట్లు పేర్కొంది. పాత పింఛను విధానం ప్రకారం.. పదవీ విరమణ నాటికి ఉన్న వేతనంలో 50 శాతం మొత్తాన్ని పెన్షన్‌గా ఇస్తారు. 2003లో నాటి ఎన్డీయే ప్రభుత్వం పాత పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి కొత్త పింఛను విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉద్యోగి తన మూల వేతనంలో 10 శాతం మొత్తాన్ని పెన్షన్‌ నిధికి జమ చేయాలి. ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది. కాగా 2003 డిసెంబర్‌ 22కు ముందు వెలువడిన ఉద్యోగ నియామక ప్రకటనల ఆధారంగా నియమితులైన ఉద్యోగులకు ఓపీఎస్‌ ఎంచుకునే అవకాశాన్ని ఇటీవల కేంద్రం కల్పించడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు