PPF: పీపీఎఫ్‌తో వడ్డీపై వడ్డీ.. ద్రవ్యోల్బణం కంటే అధిక రాబడి!

పీపీఎఫ్‌లో పెట్టుబ‌డిదారునికి అస‌లుపైనే కాకుండా వ‌డ్డీపై వ‌డ్డీ కూడా వ‌స్తుంది. 

Updated : 20 Jan 2022 17:42 IST

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) అనేది ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు గ‌ల ప‌న్ను ఆదా పొదుపు ప‌థ‌కం. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేటు క‌న్నా ఇందులో అధికంగానే వ‌డ్డీని ఆశించ‌వ‌చ్చు. పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీసులో గానీ, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులో గానీ తెరవొచ్చు. పీపీఎఫ్ వ‌డ్డీని నెల‌వారీ ప్రాతిప‌దిక‌న లెక్కిస్తారు. ఇది దీర్ఘ‌కాల పొదుపు ప‌థ‌కం అవ్వ‌డంతో ప‌ద‌వీ విర‌మ‌ణ కార్ప‌స్‌ను కూడా కూడబెట్టుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతా 100% రిస్క్ లేనిది, అంతేగాక 6% స‌గ‌టు వార్షిక ద్ర‌వ్యోల్బ‌ణం వృద్ధిని అధిగ‌మించ‌గ‌ల పొదుపు ప‌థ‌కాల్లో ఇదొకటి. అయితే పీఎఫ్‌పై తెలుసుకోవ‌లిసిన మ‌రికొన్ని ముఖ్య‌మైన విష‌యాలు ఉన్నాయి.

పీపీఎఫ్ వ‌డ్డీ రేటు...

ప్ర‌స్తుతం, పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. పీపీఎఫ్ వ‌డ్డీని నెల‌వారీ ప్రాతిప‌దిక‌న లెక్కిస్తారు. నెల‌లో 5వ తేదీ నుండి చివ‌రి తేదీ వ‌ర‌కు అందుబాటులో ఉన్న క‌నీస పీపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌పై పీపీఎఫ్ వ‌డ్డీని ఇస్తారు. కాబ‌ట్టి, పీపీఎఫ్ ఖాతాదారుడు నెల‌లో 1వ తేదీ నుండి 4వ తేదీ వ‌ర‌కు డిపాజిట్ చేసిన‌ట్ల‌యితే ఆ నెల పీపీఎఫ్ వ‌డ్డీకి అర్హ‌త ఉంటుంది. నెల‌వారీగా పీపీఎఫ్‌లో పొదుపు చేసే పెట్టుబ‌డిదారులు నెల 1 నుండి 4 వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌డం మంచిది. సంవ‌త్స‌రానికొక‌సారి డ‌బ్బులు క‌ట్టేవారు కూడా ఏప్రిల్ 1 నుండి 4 వ‌ర‌కు డిపాజిట్ చేయ‌డం మంచిది. అప్పుడు వారి డిపాజిట్‌పై మొత్తం ఆర్ధిక సంవ‌త్స‌రానికి (12 నెలలు) పీపీఎఫ్‌కి వ‌డ్డీని పొందొచ్చు. పెట్టుబ‌డిదారునికి అస‌లుపైనే కాకుండా వ‌డ్డీపై వ‌డ్డీ కూడా వ‌స్తుంది.

పీపీఎఫ్ డిపాజిట్...

గ‌రిష్ఠంగా రూ.1.50 ల‌క్ష‌లు మాత్ర‌మే డిపాజిట్ చేయవచ్చు. ఇంత‌క‌న్నా ఎక్కువ డిపాజిట్ చేసినా రూ.1.50 ల‌క్ష‌ల‌కే వ‌డ్డీ వస్తుంది.

ఎన్ని ఖాతాలు తెర‌వొచ్చు?

ఒక వ్య‌క్తి ఒక పీపీఎఫ్ ఖాతాను మాత్రమే తెరిచేందుకు అనుమతి ఉంటుంది. పీపీఎఫ్ ఖాతా విష‌యంలో ఉమ్మ‌డి ఖాతా తెర‌వ‌డం కుదరదు. మైనర్ పేరున కూడా పీపీఎఫ్‌ ఖాతా తెరవచ్చు.

పీపీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ...

పీపీఎఫ్ ఖాతాదారుడు మెచ్యూరిటీ త‌ర్వాత, అంటే 15 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన త‌ర్వాత మాత్ర‌మే పీపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ను పూర్తిగా ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. అయితే ఆర్ధిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఖాతా తెరిచిన 7వ సంవ‌త్స‌రం నుండి పాక్షికంగా పీపీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ చేసుకోవ‌చ్చు. పీపీఎఫ్ ఖాతా తెరిచిన 4 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన త‌ర్వాత కూడా అత్యవసర ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఉంటుంది.

ఆదాయ‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నం...

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం, ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో పీపీఎఫ్ డిపాజిట్‌తో రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయ‌పు ప‌న్ను మినహాయింపు పొందొచ్చు. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు (ఐటీఆర్‌) ఫైల్ చేసేట‌పుడు సెక్ష‌న్ 80సీ కింద ఈ ప‌న్ను ప్ర‌యోజనాన్ని క్లెయిమ్ చేయాలి. మీ ఉద్యోగ సంస్థకి కూడా ఈ మినహాయింపు తెలియజేయొచ్చు. అలాగే ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో పీపీఎఫ్ మెచ్యూరిటీ మొత్తానికి 100% ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

ఎంత చెల్లించాలి?

ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీసం రూ.500 డిపాజిట్ చేయాలి. ఒక‌వేళ ఇలా డిపాజిట్ చేయ‌డంలో విఫ‌లం అయితే పీపీఎఫ్ ఖాతా స్తంభింప‌చేస్తారు. పీపీఎఫ్ ఖాతాను మ‌ళ్లీ యాక్టివేట్ చేయ‌డానికి సంవ‌త్స‌రానికి రూ.50 జ‌రిమానా చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది.

పీపీఎఫ్ భ‌ద్ర‌త..

పీపీఎఫ్ ఖాతాదారుడు వేరే ఏవైనా ఆర్థిక లావాదేవీలో విఫ‌లం చెందినా ఆ రుణాన్ని చెల్లించ‌డానికి పీపీఎఫ్ సొమ్మును మ‌ళ్లించ‌లేరు. ఆఖ‌రుకు కోర్టు ఆదేశాల ద్వారా చేయ‌డానికి కూడా వీలులేదు. పీపీఎఫ్ సొమ్ముకు ఆ స్థాయిలో భ‌ద్ర‌త ఉంది. ప్రభుత్వ పథకం కాబట్టి మీ పెట్టుబడికి పూర్తి హామీ ఉంటుంది.

పీపీఎఫ్ ఖాతా పొడిగింపు..

15 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ వ్య‌వ‌ధి పూర్త‌యిన త‌ర్వాత‌, వ్య‌క్తి పీపీఎఫ్ ఖాతాను 5 సంవ‌త్స‌రాల కాలానికి పొడిగింపు చేసుకోవ‌చ్చు. ఇలా అప‌రిమితంగా 5 ఏళ్లకు ఒక‌సారి పొడిగింపులు చేసుకోవ‌చ్చు.

పీపీఎఫ్‌పై రుణం..

ఖాతాదారుడు ఖాతా తెరిచిన 3-5 సంవ‌త్స‌రాల మ‌ధ్య పీపీఎఫ్ ఖాతాపై రుణం పొందేందుకు అర్హులు. పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంపై 25% వ‌ర‌కు గ‌రిష్ఠంగా రుణం తీసుకోవచ్చు. వడ్డీ రేటు పీపీఎఫ్ వడ్డీ కంటే 1 శాతం ఎక్కువగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని